సాక్షి, రేణిగుంట : తిరుపతి విమానాశ్రయంలో శనివారం టీడీపీ నేత వద్ద 20 బుల్లెట్లు దొరకడం కలకలం రేపుతోంది. తనిఖీల్లో భాగంగా వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా నర్సింహారెడ్డి ముఖ్య అనుచరుడు, సింగిల్ విండో చైర్మన్ సాయినాథ్ శర్మ వద్ద 20 తూటాలు లభించాయి. దీంతో ఆయనను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సాయినాథ్ శర్మ లైసెన్స్‌డ్ గన్‌ను పోలీసులకు డిపాజిట్ చేయలేదని సమాచారం. అధికార బలంతో ఆయన గన్‌ను తనవద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాయినాథ్ శర్మ ఆయుధాన్ని అప్పగించారా లేదా అనేదానిపై కమలాపురం పోలీసులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
వెపన్ డిపాజిట్‌పై అనుమానాలు...
సాయినాథ్ శర్మ వెపన్ డిపాజిట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే నెల (మే) మూడో తేదీతో గడువు ముగియనుంది. లైసెన్స్ దారుడు తన వద్ద ఉన్న ఆయుధాన్ని డిపాజిట్ చేస్తే పోలీసులు రసీదు ఇస్తారు. ఆ రసీదు ఆధారంగా ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు కూడా లైసెన్స్‌దారుడు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి పూర్తయ్యేవరకూ ఆయుధంతో పాటు తుటాలను కూడా కచ్చితంగా పోలీసుల వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆయుధం నెంబర్, లైసెన్స్‌లో ఉన్న నంబర్ అదేవిధంగా జారీ చేసిన బుల్లెట్లకు సంబంధించిన నంబర్లు పరిశీలించిన తర్వాతే డిపాజిట్‌ను స్వీకరిస్తారు.
ఆయుధ లైసెన్స్ ఉన్నప్పటికీ, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి బుల్లెట్లు కలిగి ఉండటం నేరమని స్థానిక డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. టీడీపీ నేత సాయినాథ్ శర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన అన్నారు. ఈ విషయంపై టీడీపీ నేత సాయినాథ్ స్పందిస్తూ.. పోలీసులు తనకు నోటీస్ ఇవ్వకున్నా...ఆర్మ్ హౌస్ వద్ద గన్ డిపాజిట్ చేశానని తెలిపారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment