ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: పార్టీలోకి కొత్తగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్‌ను కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి ఇంటి వద్ద శుక్రవారం ఉదయం పార్టీ ప్రచార సామగ్రిని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్‌పై కొద్ది రోజులుగా నాన్చుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు 5వ విడత జాబితాలో వరదరాజులరెడ్డికి టికెట్ కేటాయిస్తూ శుక్రవారం ఉదయమే నిర్ణయం తీసుకున్నారు. టీవీల్లో వార్తలు ప్రసారం కావడం ద్వారా విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉదయాన్నే లింగారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇదే విషయంపై చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు గురువారం రాత్రి హైదరాబాద్‌కు లింగారెడ్డి వెళ్లారు. ఆయన హైదరాబాద్‌లో ఉండగానే వరదకు టికెట్ కేటాయించారు. దీంతో కార్యకర్తలు మండిపడ్డారు. జిల్లా అధ్యక్షునిగా ఉన్న లింగారెడ్డికి టికెట్ కేటాయించకపోవడం ఏమిటంటూ తీవ్ర ఆగ్రహంతో కార్యకర్తలు లింగారెడ్డి నివాస గృహం కింద ఉన్న పార్టీ కార్యాలయంలోని జెండాలు, టోపీలు, కండువాలు, పోస్టర్లతోపాటు సైకిల్‌కు కూడా నిప్పంటించారు. పోలీసులు వచ్చి వారించినా వారి ఆగ్రహం చల్లారలేదు.
తొలి నుంచి లింగారెడ్డి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాడని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా పార్టీని వీడకుండా కష్టపడి పనిచేశారన్నారు. అలాంటి నేతను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వరదరాజులరెడ్డికి టికెట్ కేటాయించడం ఏమిటని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నించారు.
కంటతడి పెట్టిన తనయుడు
తెలుగుదేశం పార్టీ టికెట్ తన తండ్రికి కాకుండా వరదరాజులరెడ్డికి కేటాయించడంపై మల్లేల లింగారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి కంటతడిపెట్టారు. మెడిసిన్ చదువుతున్న హర్షవర్ధన్‌రెడ్డి గడిచిన మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత కాలం పార్టీ కోసం పనిచేసినందుకు ఇదేనా గుర్తింపు అని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి మా కుటుంబం ఎంతో సేవ చేసిందన్నారు. ఇంత కాలం పార్టీ కోసం పనిచేసిన లింగారెడ్డికి అన్యాయం జరిగిందంటూ పల్లా లక్ష్మిదేవి అనే కార్యకర్త బోరున విలపించారు. నాయకులు ఓదార్చినా ఆమె ఏడుపును ఆపలేకపోయారు.
భగ్గుమన్న తమ్ముళ్లు
Published Sat, Apr 19 2014 2:25 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement