సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాంగ్రెస్ పార్టీపై విభజన ముద్ర పడటంతో ప్రజాదరణ కలిగిన వైఎస్‌ఆర్‌సీపీలో చోటు లేక టీడీపీలో రాజకీయ ఆశ్రయం పొందిన నేతలు పట్టు కోసం పావులు కదుపుతున్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతో సంతృప్తి చెందక.. పక్క నియోజకవర్గాల్లోనూ పెత్తనం చెలాయించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆయా అసెంబ్లీ టిక్కెట్‌ల కేటాయింపులో చక్రం తిప్పడం ద్వారా కింగ్‌మేకర్ ముద్ర వేయించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. వీరి తీరుతో ఇప్పటి వరకు పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తెలుగుతమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరడం తెలిసిందే. ఈయన కర్నూలు అసెంబ్లీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే డోన్, ఆదోని స్థానాలకు అభ్యర్థుల విషయంలోనూ ఆయన చక్రం తిప్పుతున్నారు.
ఆదోని నుంచి కుమారుడు టీజీ భరత్‌ను పోటీ చేయించేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి టిక్కెట్ ఇస్తే గెలుపు బాధ్యత తానే తీసుకుంటానని భరోసా ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తకు డోన్ టిక్కెట్ కోసం కూడా టీజీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
భరత్, గుప్తలకు సీట్లిస్తే ఆయా స్థానాల్లో ఖర్చుతో పాటు కర్నూలు పార్లమెంట్ వ్యయంలోనూ పాల్పంచుకుంటామనే తన రహస్య ఎజెండాను టీజీ అధినేత ఎదుట ఉంచినట్లు పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆ మేరకు అధినేత సమాలోచన చేస్తున్నారని వినికిడి. ఈ విషయం బయటకు పొక్కడంతో తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. డోన్ నుంచే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి ప్రకటించగా.. ఆదోనిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మరోసారి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు.
వీరిరువురూ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. వీరిరువురూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తుండగానే టీజీ వారికి గోతులు తవ్వుతుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. టీజీకి అడ్డుకట్ట వేయకపోతే పార్టీకి అంతా తానే అన్నట్లుగా తయారవుతారని తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఆ మేరకు ఆయనకు చెక్ పెట్టేందుకు తమ్ముళ్లు అధినేత వద్ద ‘పంచాయితీ’ పెట్టనున్నట్లు తెలిసింది.
‘తమ్ముళ్ల’కు గోతులు కొరకరాని కొయ్యలా టీజీ
Published Sat, Apr 5 2014 2:24 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement