సాక్షి ప్రతినిధి, విజయనగరం : లోక్‌సభకు పోటీచేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే పూసపాటి అశోక్ గజపతిరాజును చంద్రబాబు ఆదేశించడంతో విజయనగరం అసెంబ్లీ టిక్కెట్‌పై ద్వితీ య శ్రేణి నాయకుల కన్ను పడింది. వేగుల ద్వారా పరిణామాలను ముందే తెలుసుకున్న మీసాల గీత వ్యూహాత్మకంగా రాయబారాన్ని పంపారు.
అశోక్ గజపతిరాజుకు తెలియకుండా బాబుతో మంతనాలు సాగించారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానంటే టీడీపీలో చేరుతానని సంప్రదింపులు చేశారు. ఆ మేరకు కుదిరిన ఒప్పం దంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీ కండువా వేసుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు కంగుతిన్నా రు. నిన్నటి వరకు అనేక ఇబ్బందులు పెట్టిన నాయకురాల్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని, ఆమెకు టిక్కెట్ ఇస్తే తాము పనిచేయమని కరాఖండీగా చెప్పేశారు.
అసెంబ్లీకి ఇక్కడ నుంచి అశోక్ గజపతిరాజే పోటీ చేయాలని, ఒకవేళ కాదూకూడదంటే పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని ద్వితీయశ్రేణి నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రసాదుల రామకృష్ణ, కర్రోతు నర్సింగరావు టిక్కెట్ రేసులోకి వచ్చారు. టికెట్ కోసం అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలో సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు కూడా పార్టీలో చేరారు. తాను కూడా ఎమ్మెల్యే రేసులో ఉన్నానంటూ పరోక్ష సంకేతాలు పంపించారు. అందరూ అడుగుతుంటే తానెందుకు మౌనంగా ఉండాలని మాజీ కౌన్సిలర్ డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ కూడా రేసులోకి వచ్చినట్టు తెలిసింది.
గీత తీరుతో ఇరకాటం
మీసాల గీత టీడీపీలోకి చేరిన దగ్గరి నుంచే తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో చేరినప్పుడు అశోక్ గజపతిరాజు ఫొటో లేకుండా వేసిన పలు ప్లెక్సీలు పట్టణంలో దర్శనమిచ్చాయి. గమనించి న టీడీపీ నేతలు వెంటనే జోక్యం చేసుకోవడంతో ఆయా ప్లెక్సీలపై అశోక్ బొమ్మ కన్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ప్రచార సభలు, పార్టీ కార్యక్రమాల్లో కూడా తన వ్యక్తిగత డబ్బా కొట్టుకోవడా న్ని టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తానున్న హయాంలోనే పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, మిగతా వారీ హయాంలో అంతగా జరగలేదన్నట్టుగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ పాలకవర్గం హయాంలో ఏమీ జరగలేదనే సంకేతాలు బయటికొస్తుండడంతో అభద్రతాభావానికి లోనైన టీడీపీ నేత లు మీసాల గీతపై మరింత అక్కసుకు లోనయ్యారు.
తమకు ఇష్టం లేకపోయినా పార్టీలోకి తీసుకొచ్చారని, ఇప్పుడామె ఏకుమేకై కూర్చొన్నారని క్యాడర్ భావిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఇంకెంత ముదిరిపోతారోనన్న భయం టీడీపీ నాయకులకు పట్టుకుంది. ఇదంతా పార్టీ జిల్లా నాయకత్వం దృష్టికి రావడంతో మేల్కొన్నట్టు తెలిసింది. మీసాల గీతపై తీవ్ర వ్యతిరేకత ఉండటం, మిగతా ఆశావహుల్లో అంత సీన్ లేకపోవడంతో పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అంతర్గత పోరు మధ్య ఒకరికి టిక్కెట్ ఇస్తే చేటేనని, అదే పొత్తు పార్టీ బీజేపీకి ఇచ్చేస్తే ఏ ఇబ్బందులుండవనే ఆలోచనకొచ్చినట్టు తెలిసింది.
బీజేపీ కూడా పొత్తులో భాగంగా జిల్లా నుంచి ఒక టిక్కెట్ ఆశిస్తుండడం, అందులో విజయనగరమైతే మరింత బాగుంటుందనే అభిప్రాయంతో మనసులో మాట అధిష్టానానికి చెప్పినట్టు తెలిసింది. దీంతో విజయనగరం తమకు కేటాయించాలని బీజేపీ అదిష్టానం డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో బిగుసుకుంటున్న సీటు ముడి!
Published Sat, Apr 5 2014 12:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement