ఎడవెల్లికి షాక్ | vijayender reddy shock | Sakshi
Sakshi News home page

ఎడవెల్లికి షాక్

Published Thu, Apr 10 2014 4:11 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

vijayender reddy shock

పాపం ఎడవెల్లి.. బుధవారం ఆయన పరిస్థితి చూసిన ఎవరైనా ఈ మాట అనకుండా మానరు. పార్టీ టికెట్ ప్రకటించి, తీరా నామినేషన్ వేసేందుకు వెళ్లాక బీఫారం మరొకరికి కేటాయిం చడంతో ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి బిత్తరపోయారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీలో ఆయన భంగపాటుకు గురయ్యారు.
 
 కరీంనగర్ అర్బన్, న్యూస్‌లైన్ : కరీంనగర్‌కు చెందిన ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశచూపడంతో కరీంనగర్‌లో సోనియాగాంధీ ఎన్నికల బహిరంగ సభ, పార్టీ ఇతర కార్యక్రమాలను సొంత ఖర్చులతో విజయవంతం చేశారు. కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ఖాయమనుకుంటున్న దశలో పార్టీ సీనియర్ నేత ఎమ్మెస్సార్‌కు టికెట్ కేటాయించారు. అప్పు డు విజయేందర్‌రెడ్డిని బుజ్జగించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పార్టీలో పదవి అప్పగించారు. అప్పటినుంచాలా రోజులు కాంగ్రెస్‌లోనే కొనసాగిన ఆయన ఇటీవలి పరిణామాలతో బీజేపీవైపు మొగ్గు చూపారు. కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ఇస్తామని నమ్మబలకడంతో గతేడాది నవంబర్‌లో కిషన్‌రెడ్డి సమక్షంలో భారీ బహిరంగ సభలో విజయేందర్‌రెడ్డి బీజేపీలో చేరారు. గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న పార్టీని ఆయన ఒక్కతాటిపైకి తెచ్చారు.
 
 టికెట్ ఖాయమనుకుంటున్న దశ లో... ఆయనకు మొండిచెయ్యి చూపారు. పార్టీ పనులకు ఉపయోగించుకుని తీరా టికె ట్ సమయంలో చేతులెత్తేశారు. కరీంనగర్ టికెట్ మరొకరికి కేటాయించి హుస్నాబాద్‌నుంచి విజయేందర్‌రెడ్డిని పోటీ చేయమని సూచించారు. ఈ మేరకు అక్కడినుంచి నామినేషన్ వేసేందుకు వెళ్లగా తీరా బీఫామ్ మరొకరికి ఇచ్చారు. కోరుకున్న చోట టికెట్ ఇవ్వకుండా... పార్టీ చెప్పిన చోట బీ ఫామ్ ఇవ్వకుండా చేయడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో టికెట్ల కేటాయింపు ఇంత గందరగోళంగా జరగడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
 
 పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని వలసవాదులకు పట్టం కట్టడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. విజ యేందర్‌రెడ్డి తండ్రి జగ్గారెడ్డి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలో సీనియర్ నాయకులుగా సేవలందించారు. కరీంనగర్‌లో ఆ పార్టీని బలమైన శక్తిగా ఎదిగేలా చేశారనే పేరు ఆయనకు ఉం ది. పార్టీటికెట్ ఇస్తామని సాక్షాత్తూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా ప్రకటించడంతో విజయేందర్‌రెడ్డి పార్టీని భుజస్కందాలపై వేసుకుని నడించారు. పార్టీకి జిల్లా కేంద్రంలో కార్యాలయం లేకపోవడంతో తన ఇంటినే పార్టీ కార్యాలయ నిర్వహణకు అప్పగించారు.
 
 ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ప్రచారం నిర్వహించారు. తీరా సమయానికి పార్టీ మొండిచేయి చూపుతోందనే అనుమానం రావడంతో కార్యకర్తలంతా వెళ్లి రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. అయినా పార్టీ కరుణించకపోవడంతో డాక్టర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పార్టీ కోసం కష్టపడ్డా గుర్తింపు దక్కకపోవడం... టికెట్ కేటాయించినట్లు చెప్పి తీరా బీఫామ్ ఇవ్వకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. చివరకు కరీంనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement