ప్రొద్దుటూరు క్రైం: స్థానిక మైదుకూరు రోడ్డులోని బాలాజీ నగర్-1లో మంచి నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కారు. రెండు నెలల నుంచి వీధిలో నీరు రావడం లేదంటూ గురువారం మహిళలంతా సీపీఐ ఆధ్వర్యంలో ఖాలీ బిందెలతో మైదుకూరు రోడ్డుపై బైఠాయించారు. రెండు నెలల నుంచి కుళాయిల ద్వారా నీరు రావడం లేదని దీంతో మోడంపల్లె, నడింపల్లె ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని మహిళలు తెలిపారు.
వీధిలో ఉన్న ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌లకు మాత్రం నీరు సరఫరా అవుతోందన్నారు. అయితే వీధి కుళాయిలకు మాత్రం 4-5 బిందెలు మాత్రమే వచ్చి తర్వాత ఆగిపోతున్నాయని వాపోయారు. గతంలో నాలుగైదు సార్లు మున్సిపల్ అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వేసవి కాలంలో తమ పరిస్థితి ఏమిటని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు, పాలకులు మా వార్డును గాలికి వదిలేశారన్నారు.
నినాదాలతో హోరె త్తించిన మహిళలు..
రహదారిపై బైఠాయించిన మహిళలు కమిషనర్ డౌన్ డౌన్..చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న ఛైర్మన్ ఉండేల గురివిరెడ్డి, కమిషనర్ ప్రమోద్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నీటి ఎద్దడి ఉండటం వల్లనే ప్రతి రోజూ బాలాజీనగర్‌కు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నామని తెలిపారు. 10 రోజుల్లో ప్రతి రోజూ నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాలా సేపు మహిళలు వినిపించుకోలేదు. ఇక నుంచి వార్డులో మంచి నీటి ఎద్దడి రాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, మునిరెడ్డి, రామకృష్ణ, మున్ని, మురళి, జయరామిరెడ్డి, సులోచన, స్వర్ణ, ఎస్‌ఎం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు
Published Fri, Feb 27 2015 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement