
నాన్న ఆశయం నెరవేర్చకనే..
ప్రొద్దుటూరు క్రైం : అతనో చిరుద్యోగి.. తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తూ.. మరోవైపు పిల్లలను ప్రయోజకులు చేయాలని ఆశించారు. పిల్లలు కూడా తండ్రి పెట్టే ప్రతిపైసాకు న్యాయం చేయాలని భావించి పట్టుదలతో చదువుతున్నారు. కుమారుడు అంకయ్య అలియాస్ వినోద్ బీఎస్సీ కంప్యూటర్స్ ఇటీవలే పూర్తి చేశాడు. కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. డిగ్రీ పాసైన ఆనందంలో ‘అమ్మా.. ఇక మనకు భయం లేదులే.. ఏదో ఒక ఉద్యోగం సాధిస్తా. మన కష్టాలన్నీ తీరిపోతాయ్’ అని చెప్పాడు.
అమ్మ ఓబుళమ్మకు ఇచ్చిన మాట నిజం కాకనే.. నాన్న తలారి మత్తయ్య(మున్సిపాలిటీలో డ్వాక్రా వర్కర్) ఆశయం నెరవేరకనే అంకయ్య రోడ్డు ప్రమాదానికి గురై.. ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్ర్కమించాడు. దీన్ని ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు పగిలే లా రోదిస్తున్నారు. ఈ తీరు చూసిన వారి హృదయాలను బరువెక్కించింది.
ఎన్‌సీసీ సర్టిఫికెట్ కోసం వెళ్తూ..
అంకయ్యకు చదువు మీద ఎంత శ్రద్ధో.. ఎన్‌సీసీపైనా అంతే శ్రద్ధ. మూడేళ్ల నుంచి అతను ఎన్‌సీసీలో కొనసాగేవాడు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ కోసం తన మిత్రుడితో కలసి బైక్‌లో కడపకు బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను అకాల మృత్యువాతపడ్డాడు. ఈ విషయం తెలియడంతో రామేశ్వరం వాసులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. అంకయ్య మృతదేహాన్ని చూసి అతని మిత్రులు, అధ్యాపకులు కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు ప్రముఖులు సైతం విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.