సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (హౌసింగ్ బోర్డు) స్థలాల్లో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన జాయింట్ వెంచర్ల కొనుగోలుదారులకు తీపి కబురు అందింది. వారు కొన్న ఇళ్లు, వాణిజ్య స్థలాల రిజిస్ట్రేషన్‌కు మార్గం సుగమమైంది. జూలై ఒకటి నుంచి రిజిస్ట్రేషన్‌లకు అనుమతినిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనితో దాదాపు 15 ఏళ్ల పాటు కొనసాగిన వివాదానికి తెరపడింది. విలువైన ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసినా.. రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆగిపోవటంతో కొనుగోలుదారుల్లో నెలకొన్న ఆందోళన సమసిపోయింది.
ఏమిటీ వివాదం?
హైదరాబాద్‌లోని కొండాపూర్, గచ్చిబౌలి వంటి విలువైన ప్రాంతాల్లో గృహనిర్మాణ మండలికి ఖాళీ స్థలాలున్నాయి. వాటిలో ప్రైవేటు సంస్థలతో కలిసి పీపీపీ పద్ధతిలో వాణిజ్య సముదాయాలు, నివాస గృహ సముదాయాలను అభివృద్ధి చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. 2007లో అప్పటి ప్రభుత్వం 19 ప్రాజెక్టుల కోసం ప్రైవేటు సంస్థలకు భూములను కేటాయించింది.
ఆయా సంస్థలు వివిధ దఫాల్లో కొంతమొత్తం సొమ్ము చెల్లించాయి. అయితే సదరు స్థలాల్లో కొన్ని సంస్థలు పనులు ప్రారంభించినా, మిగతావి జాప్యం చేశారు. సుమారు 12 ప్రాజెక్టుల్లో ఆశించినమేర ప్రాజెక్టులు ముందుకు పడలేదు. ఇలా దశాబ్దానికిపైగా గడిచింది. వాటిని చేపట్టిన సంస్థలు కమర్షియల్ స్పేస్ నిబంధనలు మార్చాలని, వన్‌టైమ్ సెటిల్‌మెంట్ వంటి ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి.
ఈ క్రమంలోనే ఆయా స్థలాల్లో చేపట్టిన నిర్మాణాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈ వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వం 2016లో కేబినెట్ సబ్‌కమిటీని నియమించింది. ఆ కమిటీ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు స్థలాలను పరిశీలించి, సంస్థల ప్రతినిధులతో చర్చించి 2018లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
ఇప్పటిదాకా నిర్ణయం వెలువడలేదు. ఈలోగా అన్ని ప్రాజెక్టులు దాదాపు పూర్తయి, నిర్మాణాలు అమ్ముడయ్యాయి. కానీ నిషేధం ఉండ టంతో రిజిస్ట్రేషన్లు జరగలేదు. తాజాగా రిజిస్ట్రేష న్లకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గృహనిర్మాణశాఖ ఇచ్చిన భూములకు సదరు సంస్థల నుంచి ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల వరకు అందనున్నట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా కూడా సర్కారుకు ఆదాయం రానుంది.
Comments
Please login to add a commentAdd a comment