
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలకు ఇళ్లస్థలాలను ఇచ్చే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్ రూంఇళ్లను పూర్తి ఉచితంగా ఇస్తున్నందున, హౌసింగ్ బోర్డు ద్వారా అఫర్డబుల్(తక్కువ ధర) ఇళ్లను నిర్మించి విక్రయించే ప్రతిపాదనలు లేవన్నారు.
రాజీవ్ స్వగృహ పథకం విషయంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లుపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల్లో పట్టణ ప్రాంతాల్లో మైనారిటీలకు 10 శాతం కోటాను తప్పనిసరిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
వారి సేవలుS కొనసాగిస్తాం: ఉద్యానవన శాఖలో 550 మంది మండలస్థాయి అధికారులు, 190 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను పూర్తిస్థాయిలో తొలగించలేదని, సంబంధిత ప్రాజెక్టు అమలు కాలపరిమితి ముగియడంతో వారి సేవలను నిలిపివేశామని వ్యవసాయమంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వారి సేవలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఉద్యానవన డిప్లొమా, పీజీ కోర్సులకు అవకాశం కల్పించడానికి మంత్రి ప్రతిపాదించిన కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన వర్సిటీ సవరణ బిల్లు–2021ను శాసనసభ ఆమోదించింది.