అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం ముస్లింలు భక్తి శ్రద్ధలతోనూ, ఆనందోత్సాహంగా బక్రీద్‌ను జరుపుకున్నారు. సామూహిక ప్రార్థనలతో ఈద్గా మైదానాలు అధ్యాత్మిక భావాన్ని చాటాయి. అధికార, అనధికార ప్రముఖులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
స్థానిక హౌసింగ్ బోర్డులోని ఈద్గా మైదానంలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన సామూహిక ప్రార్థనలో వేలాది మంది పాల్గొన్నారు. జామీయా మసీదు పేష్ ఇమామ్ సయ్యద్ రహంతుల్లా ఖాద్రీ, నగర ఖాజీ ఇమామ్ షరీఫ్ తదితరులు పర్వదిన విశిష్టతను వివరించారు. హజరత్ ఇబ్రహీం చేసిన మహోన్నత త్యాగం.. మానవాళికి సందేశాన్నందించిందని, ఇస్మాయిల్ జ్ఞాపకార్థం వారి త్యాగ నిరతిని గుర్తు చేసుకోవడం అందరి విధి అని తమ సందేశంలో పేర్కొన్నారు.
అన్ని మతాల మధ్య సయోధ్యను, సహకార భావనను బక్రీదు తెస్తుందని, సాధ్యమైనంత మేరకు దానధర్మాలతో అల్లాను మెప్పించాలని సూచించారు. ముతవల్లి కేఎం.షఫివుల్లా, పలువురు మత పెద్దలు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ముబారక్ చెప్పుకున్నారు. హెచ్చెల్సీకాలనీలోని ఈద్గామైదానంలో బహువీద్దీన్ మసీదులో మత పెద్ద ఇమామ్ బక్రీద్ సందేశాన్ని అందించారు. లలితా కళాపరిషత్ వద్ద ఉన్న ఈద్గా మసీదు, లక్ష్మీనగర్‌లోని పీటీసీ వద్ద ఉన్న చాందినీ మసీదు, పాతూరులోని జామీయా మసీదు, గుల్జార్‌పేట్‌లోని మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ముస్లింలను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.
భక్తి శ్రద్ధలతో బక్రీద్
Published Thu, Oct 17 2013 2:44 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement