the chief minister KCR
-
ఓరుగల్లుపై చంద్రబింబం !
ఔటర్ రింగ్ రోడ్డులో కదలిక... ప్రధాన రహదారుల విస్తరణ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు ప్రతిపాదనల రూపకల్పనకు కేసీఆర్ ఆదేశాలు 29న ఏరియల్ సర్వే నేపథ్యంలో జిల్లా అధికారులతో సమీక్ష వరంగల్ అర్బన్ : తెలంగాణలో రెండో అతి పెద్ద నగరమైన చారిత్రక ఓరుగల్లు అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. మెట్రోపాలిటన్ నగరాల తరహాలో వరంగల్‌ను తీర్చిదిద్దాలని ఆయా శాఖల అధికారులను పురమాయించారు. ఈ నెల 29వ తేదీన జిల్లాలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తున్న నేపథ్యంలో ముందస్తుగా అభివృద్ధి ప్రతిపాదనల తయారీపై జిల్లా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర్రావు, ఆర్ అండ్ బీ జిల్లా అధికారులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అర్అండ్బీ అధికారులకు ప లు సూచనలు చేశారు. వరంగల్ నగరానికి వలసలు పెరుగుతుండడంతో రోజురోజుకూ విస్తరిస్తోంది. గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందనుంది. ఇందులో భాగంగా విజన్-2031 పేరుతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ ము సాయిదా(డ్రాఫ్ట్) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రహదారుల వినియోగ సామర్థ్యం పెంచడం, నిర్వహణ వ్యయాన్ని నియంత్రించడం, రవాణా ప్రయాణ సమయం, ఖర్చు గణనీయంగా తగ్గించడం, గమ్య స్థానాలు చేరుకోవడంలో కచ్చితత్వం పెంపొందించడం, రక్షణ చర్యలు, పార్కింగ్, కూడళ్ల విస్తరణతో రవాణా వ్యవస్థను సమగ్రంగా వినియోగించడం ద్వారా ఆర్థికాభివృద్ది సాధించడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయని అధికారులకు సీఎం వివరించారు. ఈ దిశగా నూతన ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ప్రత్యేకంగా ఔటర్ రింగ్ రోడ్డుకు అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఖమ్మం, నర్సంపేట, ములుగురోడ్, కరీంనగర్, హైదరాబాద్ రోడ్లతోపాటు వరంగల్ నగరంలో విలీనమైన 42 గ్రామాల రోడ్లను అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా మడికొండ, హన్మకొండ చౌరస్తా, నర్సంపేట రహదారుల విస్తరణకు కసరత్తు చేయాలన్నారు. ప్రస్తుతం హన్మకొండ నుంచి నర్సంపేట వరకు ఉన్న 100 అడుగుల రహదారిని 150 అడుగుల రోడ్డుగా విస్తరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాజీపేట దర్గాలోని రైల్వే ట్రాక్ సమీపం నుంచి హంటర్ రోడ్డు వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. ఎన్ఐటీ నుంచి కేయూసీ రోడ్డును మరింత విస్తరించాలని సూచించారు. అదేవిధంగా వరంగల్ నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు విరుగుడుగా మల్టిలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అవసరమైన చోట మల్టీలెవల్ ఫ్లై ఓవర్లను నిర్మిచేందుకు శాస్త్రీయతతో కూడిన భవిష్యత్ ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. నగర పరిధిలో రెండు లేదా మూడు చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి.. నిధులు మంజూరైతే వరంగల్ నగరం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కనుంది. రవాణా వ్యవస్థను సమగ్రంగా వినియోగించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యం. ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్ నగరంలో మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం శాస్త్రీయతతో చేపట్టేలా ప్రతిపాదనలు సమర్పించాలి. సీఎం కేసీఆర్ -
వైభవం దక్కేనా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో చెరువులు, కుంటల పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగంగా చేపట్టిన సర్వే కొలిక్కి వచ్చింది. గతంతో పోలిస్తే అధికారిక రికార్డుల్లో లేని చెరువులు, కుంటలను కూడా ప్రస్తుత సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో కుంటల సంఖ్య పెరిగినట్లు చిన్ననీటి పారుదల శాఖ నివేదిక వెల్లడిస్తోంది. అయితే గురువారం ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్ష అనంతరం వివరాలు వెల్లడిస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల స్థితిగతులపై తొలుత ఈ నెల 22న సమీక్ష నిర్వహించాలని భావించినా తిరిగి 25వ తేదీకి వాయిదా వేశారు. సీఎం సమీక్ష నేపథ్యంలో జిల్లాలోని ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, వ్యవసాయ, నీటిపారుదల శాఖ విభాగాలకు చెందిన అధికారులు బృందాలుగా ఏర్పడి వివరా లు సేకరించారు. జిల్లాలో ప్రస్తుతమున్న చెరువులు (వంద ఎక రాలకు పైగా ఆయకట్టు కలిగినవి), పంచాయతీరాజ్ కుంటలు (100 ఎకరాల కంటే తక్కువ ఆయకట్టున్నవి) సందర్శించి వాటి స్థితిగతులను నమోదు చేశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, అటవీ శాఖ నిర్మించిన చెక్‌డ్యాంల వివరాలు కూడా నివేదికలో పొందుపరిచారు. గతంలో జిల్లాలో అధికారిక రికార్డుల ప్రకారం 669 చెరువులుండగా ప్రస్తుతం వాటి సంఖ్య 678గా నమోదైంది. పంచాయతీరాజ్ కుంటలు గతంలో 5.374 ఉండగా, ప్రస్తుతం ఆరు వేలకు పైగా కుంటలున్నట్లు గుర్తించారు. కేవలం మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోనే 370 కుంటలను కొత్తగా గుర్తించి సర్వే నివేదికలో చేర్చారు. పునరుద్ధరణే లక్ష్యం జిల్లాలో చెరువులు, కుంటలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థానికులు ఆక్రమించడంతో చాలాచోట్ల కనుమరుగు కావడమో, కుంచించుకు పోవడమో జరిగింది. చాలాచోట్ల ఎఫ్టీఎల్ (గరిష్ట నీటి నిల్వ మట్టం)ను ఆక్రమించిన దాఖలాలున్నాయి. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో చెరువుల పునరుద్ధరణకు సీబీటీఎంపీ పథకం చేపట్టినా పూర్తిస్థాయిలో ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష అనంతరం ప్రతి నీటి వనరు హద్దులపై సమగ్ర సర్వే జరిగే అవకాశముందని నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చిన్న నీటి పారుదల వనరుల అభివృద్ధి, పునరుద్ధరణ లక్ష్యంగా నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. సీఎం సమీక్ష, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల ఆధారంగా చిన్ననీటి వనరులు పూర్వ వైభవాన్ని సంతరించుకునే సూచనలు కనిపిస్తున్నాయి.