సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
జిల్లాలో చెరువులు, కుంటల పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగంగా చేపట్టిన సర్వే కొలిక్కి వచ్చింది. గతంతో పోలిస్తే అధికారిక రికార్డుల్లో లేని చెరువులు, కుంటలను కూడా ప్రస్తుత సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో కుంటల సంఖ్య పెరిగినట్లు చిన్ననీటి పారుదల శాఖ నివేదిక వెల్లడిస్తోంది. అయితే గురువారం ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్ష అనంతరం వివరాలు వెల్లడిస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల స్థితిగతులపై తొలుత ఈ నెల 22న సమీక్ష నిర్వహించాలని భావించినా తిరిగి 25వ తేదీకి వాయిదా వేశారు. సీఎం సమీక్ష నేపథ్యంలో జిల్లాలోని ఆర్‌డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, వ్యవసాయ, నీటిపారుదల శాఖ విభాగాలకు చెందిన అధికారులు బృందాలుగా ఏర్పడి వివరా లు సేకరించారు. జిల్లాలో ప్రస్తుతమున్న చెరువులు (వంద ఎక రాలకు పైగా ఆయకట్టు కలిగినవి), పంచాయతీరాజ్ కుంటలు (100 ఎకరాల కంటే తక్కువ ఆయకట్టున్నవి) సందర్శించి వాటి స్థితిగతులను నమోదు చేశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, అటవీ శాఖ నిర్మించిన చెక్‌డ్యాంల వివరాలు కూడా నివేదికలో పొందుపరిచారు. గతంలో జిల్లాలో అధికారిక రికార్డుల ప్రకారం 669 చెరువులుండగా ప్రస్తుతం వాటి సంఖ్య 678గా నమోదైంది. పంచాయతీరాజ్ కుంటలు గతంలో 5.374 ఉండగా, ప్రస్తుతం ఆరు వేలకు పైగా కుంటలున్నట్లు గుర్తించారు. కేవలం మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోనే 370 కుంటలను కొత్తగా గుర్తించి సర్వే నివేదికలో చేర్చారు.
పునరుద్ధరణే లక్ష్యం
జిల్లాలో చెరువులు, కుంటలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థానికులు ఆక్రమించడంతో చాలాచోట్ల కనుమరుగు కావడమో, కుంచించుకు పోవడమో జరిగింది. చాలాచోట్ల ఎఫ్‌టీఎల్ (గరిష్ట నీటి నిల్వ మట్టం)ను ఆక్రమించిన దాఖలాలున్నాయి. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో చెరువుల పునరుద్ధరణకు సీబీటీఎంపీ పథకం చేపట్టినా పూర్తిస్థాయిలో ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష అనంతరం ప్రతి నీటి వనరు హద్దులపై సమగ్ర సర్వే జరిగే అవకాశముందని నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చిన్న నీటి పారుదల వనరుల అభివృద్ధి, పునరుద్ధరణ లక్ష్యంగా నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. సీఎం సమీక్ష, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల ఆధారంగా చిన్ననీటి వనరులు పూర్వ వైభవాన్ని సంతరించుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
వైభవం దక్కేనా?
Published Thu, Sep 25 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement