కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు వెడల్పు కాకపోవడంతో ట్రాఫిక్ చిక్కులు అధికమవుతున్నాయి. సి బ్బంది కొరతతో జిల్లాలో ప్రధాన పట్టణాల్లో రాకపోకలను క్రమబద్ధీకరించలేకపోతున్నారు. దీంతో రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ప్రమాదాలకు గురై పలువురు మృత్యువాత పడుతుండగా, అనేక మంది క్షతగాత్రులై ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రధానంగా నగరపాలక సంస్థగా కర్నూలు రూపాతంరం చెందినా, ట్రాఫిక్‌ను కట్టడి చేయలేక పోతున్నారు. ముఖ్యంగా ప్రధాన రోడ్లలోనే ట్రాఫిక్ అదుపు తప్పింది. కలెక్టరేట్ ఎదుట మెయిన్ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయి. పాతబస్తీలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అలాగే ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది.
కర్నూలులో..: నగరంలో రోడ్ల వెడల్పు కార్యక్రమం నెలల తరబడి కొనసాగుతోంది. మెయిన్ రోడ్డు వెడల్పు చేయడమే అధికారులకు తలకు మించిన భారంగా మారింది. అనేక సంవత్సరాలుగా రోడ్డు పక్కనే నివాసాలు, వ్యాపారాలు చేసుకుంటున్న పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఈ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. అలాగే పాతబస్తీలోని రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లను వెడల్పు చేయకుండానే డివైడర్లను ఏర్పాటు చేయడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నగరంలో అబ్దుల్లాఖాన్ ఎస్టేట్, జెడ్‌పీ, కలెక్టరేట్ వద్ద వాహనాలను రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువవుతోంది.
అరకొర సిబ్బంది.. : కర్నూలు నగరపాలక సంస్థతో పాటు నంద్యాల, ఆదోని, డోన్, ఎమ్మిగనూరు మున్సిపల్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు అవసరమైనంత మంది సిబ్బంది లేరు. కర్నూలులో అదనపు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. నగరంలో మొత్తం 52 పాయింట్లు ఉండగా రెండుషిఫ్టుల్లో విధులు నిర్వహించాలంటే 150 మంది సిబ్బంది అవసరం. అయితే 60 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. నంద్యాలలో మొత్తం 27పోలీసు బీట్లు ఉండగా పదింటిలో మాత్రమే ట్రాఫిక్ సిబ్బంది సేవలను అందిస్తున్నారు. ఆదోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో మొత్తం 45 మంది కానిస్టేబుళ్లుకుగాను 15 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఇద్దరు శిక్షణకు వెళ్లారు. డోన్, ఎమ్మిగనూరులో కూడా సిబ్బంది కొరతతో ట్రాఫిక్ అదుపు తప్పుతోంది.
బండి కదలదుప్రయాణం సాగదు
Published Wed, Dec 25 2013 3:37 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement