సాక్షి, ముంబై: ముంబైలో జనాభాతోపాటు వాహనాల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. నగరంలోని ప్రముఖ రోడ్లపై ట్రాఫిక్ సమస్య తీవ్రంకాగా, మరోవైపు వాహనాలను పార్కింగ్ చేయాలన్నా స్థలం లభించడంలేదు.
‘ఒక కుటుంబం.. ఒక వాహనం’
ట్రాఫిక్ సమస్యను తగ్గించాలంటే వాహనాల సంఖ్య తగ్గాలి. అందుకు ‘ఒక కుటుంబం ఒక వాహనం’ అనే ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన బాంబే హైకోర్టు ఇలాంటి ప్రణాళికను తొందరగా అమలు చేసే దిశగా ఆలోచించాలని ‘ఆర్‌టీఓ’కు సూచిం చింది. ఈ ప్రణాళికను అమలు చేస్తే పార్కింగ్ సమస్య కొంత తీరనుంది. మరోవైపు అనేక మంది ముంబైలో నివసిస్తున్నప్పటికీ ఠాణే, భివండీలో నివసిస్తున్నట్లు చిరునామాలో పేర్కొని వాహనాలు తీసుకుంటున్నారు. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా అక్ట్రాయి, ఇతర పన్నుల రూపంలో లభించే ఆదాయానికి గండిపడుతోంది.
తప్పుడు చిరునామాతో వాహనాల కొనుగోలు
ముఖ్యంగా కొందరు డీలర్లు కూడా పన్నులను ఎగ్గొట్టేందుకు ఇలాంటి తప్పుడు చిరునామాలతో వాహనాలు విక్రయిస్తున్నారని తెలిసింది. ఇలా చేసే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముంబై హైకోర్టులో ఠాణే మాజీ కార్పొరేటర్ సుధీర్ బర్గే ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటీషన్‌లో రెవెన్యూ కూడా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన హైకోర్టు ముంబైలోని ట్రాఫిక్ సమస్య తీరేందుకు పై విధంగా ఆర్‌టీఓకు సూచించింది.
పార్కింగ్ స్థలం ఉందా లేదా? చూడండి
వాహనాలు కొనుగోలు చేసే సమయంలో పార్కింగ్ స్థలం ఉందా లేదా? చూడాల్సిన అవసరం ఉందని ముంబై హైకోర్టు పేర్కొంది. అనేక కుటుంబాల వద్ద ఒకటి కంటే అధికంగా వాహనాలున్నాయి. అయితే వాటన్నింటికీ వారు నివసించే స్థలంలో పార్కింగ్ లేకపోవడంతో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. దీంతో కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. మరోవైపు కొన్ని వాహనాలైతే ఒకే చోట అనేక రోజులుగా నిలిపి ఉంచుతున్నారు. దీంతో ఒక కుటుంబం ఒక వాహనం ప్రణాళికను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ముంబై హైకోర్టు సూచించింది.
తీవ్రమవుతున్న పార్కింగ్ సమస్య
నగరంలో పార్కింగ్ సమస్య రోజు రోజుకి తీవ్రమవుతోంది. ముఖ్యంగా నగరంలో బీఎంసీకి చెందిన 89 ‘పే పార్కింగ్’ ప్రాంతాలున్నాయి. వీటిలో 10,314 వాహనాలను పార్కింగ్ చేసేందుకు వీలుంది. అయితే వాహనాల సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో కొన్ని పార్కింగ్ ప్రాంతాలను ప్రైవేట్ భాగస్వామ్యంతో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అపోలో మిల్లు వద్ద 650 వాహనాలను పార్కింగ్ చేసేందుకు వీలుండే బహుళ అంతస్తుల పే పార్క్‌ను నిర్మించింది.
అదేవిధంగా మరో 33 బహుళ అంతస్తుల పే పార్కింగ్ భవనాలను నిర్మించేందుకు బీఎంసీ అనుమతులను ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా పార్కింగ్ సమస్య మాత్రం తీరే అవకాశాలు కన్పించడంలేదు. దీనికి ప్రధాన కారణంగా వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరగడం. ముఖ్యంగా ఒకే కుటుంబంలో నాలుగైదు వాహనాలు ఉండటం. ఇలాంటి వాటి ని తగ్గించి ట్రాఫిక్‌తోపాటు పార్కింగ్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
ఒక కుటుంబం.. ఒక వాహనం ప్రణాళిక అమలు చేయాలన్న బాంబే హైకోర్టు
Published Fri, Feb 7 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement