
తప్పక చూడండి!
నగరంలో అభివృద్ధి పనులపై షార్ట్‌ఫిల్మ్
టీవీల ద్వారా ప్రచారం
జీహెచ్‌ఎంసీ సన్నాహాలు
సిటీబ్యూరో: నగరంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. తాము చేస్తున్న పనులకు తగిన ప్రచారం అవసరమని భావిస్తోంది. అందులో భాగంగా ప్రతిపాదిత రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఒక షార్ట్‌ఫిల్మ్ చిత్రీకరించి ప్రదర్శించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులు, వివిధ మార్గాల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కళ్లకు కట్టేలా షార్ట్ ఫిల్మ్ నిర్మించి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, నగరంలోని వివిధ మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌వేలు, స్కైవేలు, గ్రేడ్‌సెపరేటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత వివాదం లేని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగని మార్గాల్లో ఈ పనులు చేపట్టాలని యోచిస్తున్నారు. తొలిదశలో దాదాపు రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల మేర పనులకు అధికారులు ప్రతిపాదనలతో సన్నద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచేందుకు ప్రాథమికంగా నమూనాలను కూడా తయారు చేయించనున్నారు.
జంక్షన్లు..
1. కోఠి జంక్షన్
2.ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్
3.సికింద్రాబాద్ జంక్షన్
4. ఉప్పల్ జంక్షన్
5. ఎల్‌బీనగర్ జంక్షన్
6.చాదర్‌ఘాట్ జంక్షన్ 7.పుత్లిబౌలి జంక్షన్
8.బహదూర్‌పురా జంక్షన్.
ప్రస్తుతానికి ఎంపిక చేసిన రహదారుల వివరాలు..
ఉప్పల్ జంక్షన్ - సంగీత్ జంక్షన్
బయో డైవర్సిటీ పార్కు జంక్షన్(గచ్చిబౌలి)- జేఎన్‌టీయూ జంక్షన్, కూకట్‌పల్లి
ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం - అఫ్జల్‌గంజ్
అబిడ్స్ జంక్షన్ - చాదర్‌ఘాట్ జంక్షన్(వయా కోఠి)
హబ్సిగూడ -ఐడీఏ మల్లాపూర్ (వయా నాచారం)
చాదర్‌ఘాట్-పుత్లిబౌలి-జాంబాగ్-మొజాంజాహీ మార్కెట్-ఏక్‌మినార్ జంక్షన్ (నాంపల్లి)
పురానాపూల్ - ఆరాంఘర్(వయా జూపార్కు)