ఉత్తుంగ తరంగమై..
♦ గోదారి తీరాన్ని ముంచెత్తుతున్న భక్తజనం
♦ రోజు రోజుకీ అదే జోరు
♦ జిల్లాలో 45 లక్షలకు పైగా భక్తుల పుణ్యస్నానాలు
♦ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తగ్గని రద్దీ
♦ కొంతమేర గట్టెక్కిన ట్రాఫిక్ ఇక్కట్లు
పశ్చిమ కనుమల్లో చిరుపాయగా జన్మమెత్తి.. ఉప నదులను అక్కున చేర్చుకుని.. క్రమక్రమంగా విస్తరించి.. కొండకోనలు దాటి..ప్రకృతి సౌందర్య వేదిక.. పాపికొండలను అధిగమించి.. మైదాన ప్రాంతంలో అడుగు పెట్టి.. చారిత్రక రాణ్మహేంద్రిని చేరి.. మహాజలధిగా మారి.. ఆపై పాయలుగా విడివడి.. సాగరంతో సంగమిస్తున్న నదీమతల్లి గోదావరికి.. పుష్కర పర్వవేళ.. అశేష జనవాహిని ప్రణమిల్లుతోంది. ఆ పుణ్యవాహినిలో స్నానమాడి పాప ప్రక్షాళన చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో జిల్లాలోని వివిధ స్నానఘట్టాల్లో భక్తులు ఉత్తుంగతరంగమై ఎగసిపడ్డారు.
రాజమండ్రి : భక్తజన ప్రభంజనం గోదారి తీరాన్ని చుట్టేస్తోంది. అవాంతరాలెన్ని ఎదురైనా అధిగమించి మరీ వస్తున్న యాత్రికులతో గోదారి స్నానఘట్టాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆదివారం కావడంతో వివిధ జిల్లాల నుంచే కాకుండా స్థానికంగా కూడా భక్తులు ఘాట్‌ల వద్దకు తరలివచ్చారు. వరుసగా వచ్చిన సెలవులతో గడచిన రెండు రోజులుగా గోదావరి తీరాలు పుష్కర స్నానాలకు వచ్చే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం వారి సంఖ్య మరింత పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు, వ్యాపార సంస్థలకు కూడా సెలవులు కావడంతో ఆదివారం పుష్కర ఘాట్‌లవద్ద భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు.
హైదరాబాద్ నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉంది. అంచనాలకు మించి యాత్రికులు రావడంతో ఘాట్‌లు కిటకిటలాడాయి. రాత్రి ఏడు గంటల సమయానికి 41.07 లక్షల మంది రాజమండ్రి, జిల్లాలోని గ్రామీణ ఘాట్‌లలో పుణ్యస్నానాలు చేసినట్టు అధికారులు తెలిపారు. రాత్రి తొమ్మిది గంటల సమాయానికి ఈ సంఖ్య సుమారు 43 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. యాత్రికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా 24 గంటలపాటు స్నానాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అర్ధరాత్రి 12 గంటల సమయానికి 45 లక్షలకు పైబడి స్నానాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
వెల్లువెత్తారు
శుక్రవారం మొదలైన భక్తుల రాక.. శనివారం ఉదయం నుంచి పోటెత్తింది. ఆదివారం మధ్యాహ్నం వరకూ యాత్రికుల రాక కొనసాగుతూనే ఉంది. అయితే సాయంత్రం నుంచి భక్తుల రాక కాస్త తగ్గింది. జిల్లాలోని మొత్తం ఘాట్‌లను పరిశీలిస్తే తెల్లవారుజామున 3 నుంచి 9 గంటల వరకూ 14.84 లక్షల మంది స్నానాలు చేయగా, 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ 18.49 లక్షల మంది స్నానాలు చేశారు. అక్కడ నుంచి రాత్రి 7 గంటల సమయానికి 7.74 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సాయంత్రం నుంచి భక్తుల సందడి తగ్గడంతో స్నానాల సంఖ్య తగ్గినట్టు అధికారులు తెలిపారు.
‘సి’ ఘాట్‌లలోను పోటెత్తారు
గ్రామీణ ఘాట్‌లలో సైతం భక్తుల రద్దీ అధికంగా ఉంది. కోటిపల్లి ఘాట్‌లో 2.05 లక్షలమంది, కుండలేశ్వరంలో 60 వేలు, సోపంల్లిలో 1.60 లక్షలు, అంతర్వేదిలో 70 వేలమంది స్నానాలు చేయగా, అప్పనపల్లిలో రికార్డు స్థాయిలో 2.01 లక్షల మంది స్నానాలు చేశారు. ఇవే కాదు ‘సి’ గ్రేడ్ ఘాట్‌లలో సైతం భక్తుల ఎక్కువగా పుణ్యస్నానాలు చేశారు. కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక, కపిలేశ్వరపురం ఘాట్‌లలో 40 వేల చొప్పున, తాతపూడిలో 25 వేలు; ఆలమూరు మండలం జొన్నాడలో 50 వేలు; అల్లవరం మండలం బోడసకుర్రు, బెండమూర్లంక, గోపాయిలంకల్లో లక్ష మంది; ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో 46 వేలు; పల్లవారిపాలెంలో 38 వేల మంది చొప్పున స్నానాలు చేయడం గమనార్హం.
అవే కష్టాలు
శనివారంతో పోలిస్తే ఆదివారం కొంతవరకూ ట్రాఫిక్ మెరుగుపడింది. అయితే టోల్‌గేట్ల వద్ద మాత్రం గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. అంచనాలకు మించి భక్తులు రావడంతో బస్సులు, రైళ్లు కిటకిటలాడాయి. సమయానుకూలంగా లేని బస్సులు, అందుబాటులో లేని రైళ్లతో జనం ఇక్కట్ల పాలయ్యారు. పుష్కర నగర్‌లకు సంబంధించి సరైన సమాచారం లేకపోవడంతో కొన్నిచోట్ల భక్తుల తాకిడి ఎక్కువగాను, మరికొన్నిచోట్ల ఖాళీగాను దర్శనమిచ్చాయి. మరుగుదొడ్ల వద్ద మాత్రం పరిస్థితి మెరుగుపడలేదు. స్వచ్ఛంద సంస్థలు సహితం మంచినీరు, మజ్జిగవంటివి అందుబాటులోకి తేవడంతో భక్తుల దాహార్తి తీరింది. వాతావరణం చల్లబడడం కూడా కాస్త ఉపశమనాన్నిచ్చింది.