స్వచ్ఛ భద్రాద్రికి సమాయత్తం..!
భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కరాలు ముగిసిన మరుసటి రోజు నుంచి స్వచ్ఛ భద్రాద్రి పేరుతో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఈ మేరకు ఆయా శాఖల అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. గోదావరి పుష్కర స్నానం కోసం భద్రాచలానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీ సీతారాముల వారి దర్శనం చేసుకోవాలనే వాంఛతో భద్రాచలం పుష్కర ఘాట్‌లలోనే స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పుష్కర స్నానం చేసిన భక్తులు గోదావరి తీరంలో పూజాది కార్యక్రమాల పేరిట వివిధ రకాల వ్యర్థ పదార్థాలను విడిచిపెడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం పట్టణం, గోదావరి తీరం చిత్తడిగా మారింది. ఇప్పటికే గోదావరి పరిసర ప్రాంతాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపడుతోంది. అయితే గత పుష్కరాల అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్న అధికారులు, భద్రాచలం మొత్తాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దితేనే భవిష్కత్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని నిర్ణయించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపటంతో అధికారులు ఇందుకనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు భద్రాచలంలోనే ఉండి, చెత్త చెదారాన్ని తొలించే కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణరుుంచారు. పుష్కర ఘాట్‌ల నుంచి బ్రిడ్జి సెంటర్, ఇందిరా గాంధీ విగ్రహం మొదలుకొని ఆర్‌డీవో కార్యాలయం మీదుగా రామాలయంనకు వెళ్లే దారి మొత్తాన్ని అవసరమైతే నీటితో కడిగేసేలా ఆలోచన చేస్తున్నారు. మిగతా ఐదు రోజుల్లో పారిశుధ్య కార్మికులతో పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ పేరుతో క్లీన్ భద్రాద్రి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అవసరమైతే ఆ వారం రోజుల పాటు భద్రాచలం రామాలయూనికి ఇతర ప్రాంతాల నుంచి భక్తులను అనమతించకుండా, స్వచ్ఛ భద్రాద్రిని చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.