పుష్కర పాట్లు
♦ నాలుగు గంటల పాటు ప్రయాణికుల నరకయాతన
♦ జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు బారులు తీరిన వాహనాలు
♦ ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్‌కు కూడా ఇదే పరిస్థితి
♦ ఎల్‌బీనగర్ రింగ్ రోడ్డులోనూ అవే తిప్పలు
సాక్షి, సిటీబ్యూరో : గోదావరి పుష్కరాల కోసం నగరవాసులు భారీసంఖ్యలో క్యూకట్టారు. వరుస సెలవుల నేపథ్యంలో కరీంనగర్‌లోని ధర్మపురి, వరంగల్ జిల్లా ఏటూరునాగారం, మంగపేట, కాళేశ్వరం, ఖమ్మంలోని భద్రచలం ప్రాంతాల్లో గోదావరి పుష్కరాల కోసం రోడ్డెక్కారు. శనివారం ఉదయమే పెద్దసంఖ్యలో వాహనాలు రోడ్లెక్కడంతో నగరశివార్లలో నాలుగు గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తార్నాక, సంగీత్ చౌరస్తా మీదుగా సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌కు వచ్చేందుకు దాదాపు గంటన్నరకు పైగా పట్టింది. జేబీఎస్, తిరుమలగిరి, బొల్లారం, శామీర్‌పేట్ ప్రాంతాల్లో వాహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు.
జేబీఎస్, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్ మార్గాల్లోనూ ట్రాఫిక్ స్తంభించింది. మేడ్చల్ ప్రాంతంలో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఎంపీ మల్లారెడ్డి కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కొని మందుకెళ్లలేక మళ్లీ తిరుగు ప్రయాణమయ్యారు. వరంగల్ వెళ్లేందుకు ఉప్పల్ చేరుకున్న నగరవాసులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బొడుప్పల్, మేడిపల్లి, నారపల్లి, ఘట్‌కేసర్ వరకు వాహనాలు ముందుకెళ్లలేని పరిస్థితి కనిపించింది.
ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజమండ్రి, భద్రాచలం వెళ్లే ప్రయాణికులతో ఎల్‌బీనగర్ రింగురోడ్డు వాహనాల రద్దీతో కనిపించింది. ఎల్‌బీనగర్ రింగురోడ్డులో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్, సివిల్ పోలీసులు రంగంలోకి దిగినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపోయాయి. వరంగల్, బాసర, నిజామాబాద్, అదిలాబాద్ వెళ్లే ప్రయాణికుల వాహనాలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో అల్కాపురి, నాగోలు, ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఏపీ టూరిజంకు యమ గిరాకీ - 21వ తేదీ వరకు రిజర్వేషన్లు క్లోజ్
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ పర్యాటక శాఖ పుష్కరాల సందర్భంగా ప్రకటించిన ట్యూర్ ప్యాకేజీకు విశేషమైన స్పందన లభించినంది. దీంతో ఈ నెల 21 వరకు టికెట్లు రిజర్వయ్యాయి. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని హరిత హోటళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. నగరం నుంచి టూరిజం శాఖ ఆధ్వర్యంలో రోజు 17 బస్సులు నడుపుతున్నాయి. ట్యాంక్‌బండ్ సమీపంలోని శాఖ కార్యాలయం వద్ద నగరవాసులు క్యూ కట్టారు. సంస్థ ఆధ్వర్యలో నడుస్తున్న అన్ని బస్సుల టికెట్లు అమ్ముడుపోయాయని, డిమాండ్ మేరకు మరో మూడు బస్సులు అదనంగా నడుపుతున్నామని, సోమవారం తర్వాత మరిన్ని బస్సులు నడి పేందుకు చర్యలు తీసుకుంటామని సంస్థ అధికారులు పేర్కొన్నారు.
బస్సులన్నీ ఫుల్
అఫ్జల్‌గంజ్: వరుసగా సెలవులు రావడంతో మహానగరం నుంచి పుష్కరాలకు నగరవాసులు శనివారం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఎంజీబీఎస్ (ఇమ్లిబన్), గౌలిగూడ బస్‌స్టేషన్ల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే బస్సుల్లో భక్తులు పుష్కరాలకు బయలుదేరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాపుష్కరాలు ఉండటంతో నగరంలో ఉండే రెండు రాష్ట్రాల ప్రజలు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లారు. వారాంతం కావడం, రెండు రోజలు సెలవులు రావడంతో శుక్రవారం రాత్రి నుంచే ఎంజీబీఎస్‌లో పుష్కర ప్రయాణికుల రద్దీ పెరిగింది.
రాజమండ్రి, నర్సాపురం, మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, శ్రీకాకుళం, ధర్మపురి మార్గాల్లో వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిటకిటలాడింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా... ఆర్టీసీ సిటీ రీజియన్ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దీంతోగౌలిగూడ సిటీ బస్టాండ్‌కు బాసరకు వెళ్లే భక్తులు అధిక సంఖ్యతో తరలివచ్చారు. దీంతో పాటు నగరంలోని ఎల్‌బీనగర్, ఉప్పల్, సంతోష్‌నగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి బాసరకు ప్రత్యేక బస్సులు నడుపుతుండంతో అక్కడి నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు బాసరకు వెళ్లారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.