నేటి నుంచి దారి బంద్
కంటోన్మెంట్,న్యూస్‌లైన్: ప్రజావసరాలు, ఆందోళనల్ని ఏమాత్రమూ ఖాతరు చేయని ఆర్మీ అధికారులు తమ పని కానిచ్చేస్తున్నారు. తమ పరిధిలోని రోడ్లపై ఆంక్షల అమలుకు రంగం సిద్ధంచేస్తున్నారు. కంటోన్మెంట్‌లోని ఏవోసీ సెంటర్ నుంచి వెళ్లే రోడ్లపై మంగళవారం (25వ తేదీ) రాత్రి నుంచి సాధారణవాహనాల రాకపోకల్ని నిషేధించనున్నారు. మార్చి 10 నుంచి ఆర్మీ మినహా ఇతర వాహనాల రాకపోకల్ని అనుమతించరు.
దీంతో ఇంతకాలం కంటోన్మెంట్ నుంచి మారేడుపల్లి, సికింద్రాబాద్ క్లబ్ మార్గాల్లో నగరంలోకి ప్రవేశించే మల్కాజిగిరి, సఫిల్‌గూడ, ఈసీఐఎల్, ఆర్‌కేపురం, ఏఎస్‌రావునగర్, మౌలాలి, సైనిక్‌పురి, కుషాయిగూడ తదితరప్రాంతాల వారికి ఇబ్బందులు తప్పవు. ఇకనుంచి వీరు గమ్యస్థానాలకు చేరుకోవాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయడంతోపాటు అధిక సమయం వెచ్చించక తప్పదు. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న తిరుమలగిరి చౌరస్తాలో ట్రాఫిక్ ఇబ్బందులు మూడింతలు పెరుగనున్నాయి.
రోడ్ల మూసివేతను నిరసిస్తూ ప్రజలే స్వచ్ఛందంగా ఆందోళనలకు సిద్ధమవుతుండగా ప్రజాప్రతినిధులు మాత్రం కేవలం ప్రకటనలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. సివిలియన్ కంటోన్మెంట్ నిధులతో వేసిన రోడ్లను తమ అనుమతి లేకుండా ఎలా మూస్తారంటూ బోర్డు సభ్యులు ప్రగల్భాలకు పోతున్నప్పటికీ, రోడ్లమూసివేతపై వారికి కనీస సమాచారం కూడా ఇవ్వకపోడం గమనార్హం. ఈ మేరకు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని బోర్డు సీఈవో సుజాతగుప్తా వెల్లడించారు.
మూసివేసే మార్గాలివే...
1. సికింద్రాబాద్‌క్లబ్, పికెట్/వెస్ట్‌మారేడుపల్లి నుంచి వెల్లింగ్టన్‌రోడ్డులో ఏవోసీ సెంటర్ ఏవోసీ సెంటర్‌కు అనుమతి ఉండదు.
2. ఈస్ట్‌మారేడుపల్లి/ఎస్‌పీ రోడ్డు నుంచి ఏవోసీకి వెళ్లే మార్గం
3. సఫిల్‌గూడ రైల్వేస్టేషన్ నుంచి ఏఓసీ ద్వారా సికింద్రాబాద్‌క్లబ్/ఈస్ట్‌మారేడ్‌పల్లికి వచ్చేమార్గం (మల్కాజిగిరి నుంచి కంటోన్మెంట్‌లోకి ప్రాంతంలోకి దారితీసే ఏకైక మార్గమదే). ఆయా మార్గాల్లో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8.00 గంటల మధ్య సాధారణ వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. మార్చి 10 నుంచి పూర్తిగా అనుమతించరు.
ఎవరెవరికి ఇబ్బందులు..
1 సఫిల్‌గూడ రైల్వేస్టేషన్ నుంచి ఏవోసీ మార్గంలో మారేడుపల్లి/సికింద్రాబాద్ క్లబ్ మధ్య దూరం 2 కి.మీ., ప్రయాణ సమయం 5 నుంచి 10 నిమిషాలు (మధ్యలో ఎలాంటి సిగ్నళ్లు లేవు)
ప్రత్యామ్నాయ మార్గం: సఫిల్‌గూడ-మల్కాజిగిరి-తుకారంగేట్-అడ్డగుట్ట-మారేడుపల్లి
దూరం : 6 కి.మీ., ప్రయాణ సమయం: 40 నిమిషాలు
2. ఆర్కేపురం బ్రిడ్జి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే ప్రయాణికులు ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి- ఏవోసీ మార్గంలో నేరుగా మారేడుపల్లికి చేరుకుంటున్నారు. ఈ మార్గం మూసివేస్తే తప్పనిసరిగా తిరుమలగిరి చౌరస్తా మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఇరుకైన రోడ్లు కారణంగా ఈ చౌరస్తాలో నిత్యం ట్రాఫిక్‌జామ్‌లవుతున్నాయి.ఆర్మీ కంటోన్మెంట్‌లో రోడ్లపై ఆంక్షలు అమల్లోకి వస్తే ఈ మార్గంలో వెళ్లే వాహనాలు తిరుమలగిరి చౌరస్తా నుంచి వెళ్లాల్సి వస్తుంది. సిగ్నల్ దాటాలంటే కనీసం అరగంట వేచి ఉండక తప్పదు.
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు తిప్పలే..
ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీవిరమణ చేసిన ఉద్యోగులు పెద్దసంఖ్యలో కంటోన్మెంట్ చుట్టుపక్కల కాలనీల్లో స్థిరపడ్డారు. వీరంతా నగరానికి వెళ్లాలంటే కంటోన్మెంట్ రోడ్ల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి సామాన్యులు కూడా ఈ రోడ్లను వినియోగిస్తున్నప్పటికీ, భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. అఖిలపక్షం ద్వారా అభిప్రాయం సేకరించి రోడ్ల మూసివేతపై నిర్ణయం తీసుకోవాలి. - జి.రమణారెడ్డి, ఏపీసీసీ ఎక్స్‌సర్వీస్‌మెన్ విభాగం కన్వీనర్