ఆర్మీ ఆంక్షలపై నిరసన | Army Israelis protest | Sakshi
Sakshi News home page

ఆర్మీ ఆంక్షలపై నిరసన

Published Sat, Mar 1 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

Army Israelis protest

  •   రోడ్ల మూసివేతపై భగ్గుమంటున్న జనం
  •   పోరాట మార్గాలపై మల్లగుల్లాలు
  •   ప్రజలకు వ్యతిరేకం కాదంటున్న మిలటరీ అధికారులు
  •   ప్రత్యామ్నామ మార్గాలు లేక జనం సతమత ం
  •  కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ రోడ్లపైకి సాధారణ వాహనాల రాకపోకల్ని నిషేధిస్తూ మిలటరీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై చుట్టుపక్కల కాలనీల్లో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రాత్రివేళల్లో ఆంక్షల్ని అమలు చేస్తున్న మిలటరీ అధికారులు పగటిపూట కూడా ఆంక్షల్ని ఆరంభిస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ఆర్మీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా వివిధ వర్గాలు, పార్టీలు, అసోసియేషన్లు ఎవరికి వారు తమదైన శైలిలో పోరాటాలు ఆరంభించారు.

    వినతులు, విజ్ఞప్తులు, నిరసనలతో పాటు కోర్టు ద్వారా కూడా పోరాటాలు చేస్తున్నారు. ప్రధానంగా సఫిల్‌గూడ రైల్వే క్రాసింగ్ నుంచి వచ్చేరోడ్డు మూసివేత కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే మల్కాజ్‌గిరి, ఉప్పల్ నియోజకవర్గాల ప్రజలు ఉద్యమానికి సైతం సిద్ధమవుతున్నారు. వీరికి కంటోన్మెంట్ ప్రజలు కూడా తోడైతే ఈ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆర్మీ పాలనలోని కంటోన్మెంట్ బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తున్న బోర్డు సభ్యులు సైతం మిలటరీ అధికారులపై ఒత్తిడి తీవ్రతరం చేశారు.

    గతంలో కంటోన్మెంట్ నిధులతో అభివృద్ధి చేసిన రోడ్లపైకి సాధారణ పౌరుల రాకపోకల్ని ఎలా నిషేధిస్తారంటూ ఇటీవల బోర్డు సమావేశంలో సీనియర్ బోర్డు సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు జంపన ప్రతాప్, వెంకట్రావులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా మిలటరీ అధికారుల వాదన మరోలా ఉంది. కంటోన్మెంట్‌లో పెరిగిపోయిన ట్రాఫిక్ వల్ల తమ శిక్ష ణ కార్యకలాపాలు, ఇతరత్రా విధులకు తీవ్ర విఘాతం కలుగుతోందని, భద్రత పరంగా కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనతో  కంటోన్మెంట్ పరిధిలో సాధారణ పౌరులు, మిలటరీ సిబ్బం ది మధ్య ఉండాల్సిన పరస్పర సహకారం, బాధ్యతలు, విధులు, హక్కుల అంశాలు చర్చనీయాంశమయ్యాయి.

    కంటోన్మెంట్ విభిన్నం
     
    సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్‌సీబీ) చాలా భిన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన ఎస్‌సీబీ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన కంటోన్మెంట్. మొత్తం 10వేల ఎకరాల్లో మూడు భాగాలుగా విస్తరించిన ఎస్‌సీబీ పరిధిలో సుమారు 6వేల ఎకరాలు పూర్తిగా ఆర్మీ ఆధీనంలో ఉన్నాయి. 3 వేల ఎకరాల పరిధిలో కంటోన్మెంట్ సివిలియన్ ప్రాంతం ఉంది. మిగతా వెయ్యి ఎకరాల్లో బేగంపేట ఎయిర్‌పోర్టు, బీ-3, బీ-4 కేటగిరీ స్థలాలున్నాయి. ఏళ్ల తరబడి కంటోన్మెంట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల (ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో భాగమయ్యాయి) ప్రజలు నగరంలోకి వెళ్లేందుకు కంటోన్మెంట్ రోడ్లను వినియోస్తూ వచ్చారు. గత పదేళ్లలో ట్రాఫిక్ రద్దీ పెరిగిందనే కారణంతో వివిధ రోడ్లపై సివిలియన్ల రాకపోకలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి.
     
    మల్కాజ్‌గిరికి తెగనున్న లింక్
     
    మిలటరీ అధికారుల తాజా ఆంక్షల్లో ప్రధానంగా సఫిల్‌గూడ నుంచి మారేడ్‌పల్లి/ సికింద్రాబాద్ క్లబ్‌కు దారితీసే రోడ్డు మూతతో మల్కాజ్‌గిరి నియోజకవర్గ ప్రజలకు కంటోన్మెంట్‌తో లింక్ తెగిపోతుంది. దీంతో సివిలియన్ ప్రాంతాలకు ఆనుకుని సాగే ఈ రోడ్డుపైనైనా రాకపోకల్ని అనుమతించాలని పలువురు కోరుతున్నారు. ఆర్‌కేపురం- తిరుమలగిరి రోడ్డు మాదిరిగానే ఈ మార్గాన్ని కొనసాగిస్తే మెజారిటీ ప్రజల సమస్య తీరినట్లు అవుతుందని పేర్కొంటున్నారు.
     
    కాలనీల ప్రతినిధులతో చర్చలు: ఆర్మీ

    ఈ విషయమై మార్చి 2న ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ) సెంటర్ సమీప కాలనీ ప్రతినిధులతో చర్చించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్మీ శిక్షణ సంస్థలకు ఇబ్బందులు కలగని రీతిలో ఆర్మీ రోడ్లను వినియోగించే అంశాన్ని చర్చించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి మొదటి వారంలో స్థానిక సంస్థల అధికారులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్, పోలీసులతో మరో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు.
     
     బోర్డు నిధులతోనే నిర్మించాం
     ఆర్మీ కంటోన్మెంట్‌లోని పలు రోడ్లను సివిలియన్ కంటోన్మెంట్ బోర్డు నిధులతోనే అభివృద్ధి చేశాం. కొన్నేళ్లుగా ఆర్మీ అధికారులు ఒక్కొక్కటిగా రోడ్లు మూసివేస్తూ వస్తున్నారు. దీంతో సమీప కాలనీలతో కంటోన్మెంట్ ప్రజలకు రవాణా సంబంధాలు తెగిపోతున్నాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అందాల్సిన సర్వీసు చార్జీలు సకాలంలో అందడం లేదు. తాజాగా ఈ బకాయిలు రూ.315 కోట్లకు చేరాయి. ఈ నిధుల్ని అందిస్తే అంతర్గతంగా రోడ్లను విస్తరించడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
     - జంపన ప్రతాప్, కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు
     
     కచ్చితమైన సమాచారం లేదు
     కంటోన్మెంట్ పరిధిలో ఏయే రోడ్లు బోర్డు పరిధిలోకి వస్తాయి? ఏ రోడ్లు మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) పరి ధిలోకి వస్తాయనే పక్కా సమాచారం బోర్డులో అందుబాటులో లేదు. ఆర్‌కే పురం- తిరుమలగిరి మధ్య ఉన్న మార్గం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం (ఆర్ అండ్ బీ) అజమాయిషిలో ఉన్నట్లు ప్రెసిడెంట్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేశారు. తాజాగా ఆంక్షల నేపథ్యంలో రోడ్లపై విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అంతర్గత రోడ్ల విస్తరణపై కూడా దృష్టి సారించాం.    
    - సుజాత గుప్తా, కంటోన్మెంట్ సీఈఓ
     
     న్యాయపోరాటం చేస్తాం
     స్వాతంత్య్రానికి పూర్వం నుంచి సాధారణ ప్రజలు వినియోగిస్తున్న రోడ్లను అర్ధంతరంగా మూసివేయ డం సరికాదు. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తాం. కొంత కాలంగా ప్రజలు ఉపయోగిస్తున్న రోడ్లను సహేతుక కారణాలు లేకుండా మూసివేయం ఈజ్‌మెంట్ రైట్‌కు భంగం కలిగించడం అవుతుంది. ఈ కోణంలోనూ మా పోరాటాన్ని కొనసాగిస్తాం.
    - రమణ, సీనియర్ అడ్వకేట్,   సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు
     
     ఉద్యమం చేస్తాం
     కంటోన్మెంట్‌లో ఆర్మీ ఆంక్షలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సివిలియన్ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీ (ఎంసీహెచ్)లో విలీనం చేయాలని 1998లో స్థానిక ఎమ్మెల్యేగా తీవ్ర ప్రయత్నం చేశాను. ఇందుకు అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలోని రక్షణ శాఖ మంత్రి కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ, స్థానిక బోర్డు సభ్యులు సహకరించలేదు. రోడ్లపై ఆంక్షల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ప్రజా ఉద్యమంతో పాటు, న్యాయపోరాటం కూడా చేస్తాం.    
     - సాయన్న, మాజీ ఎమ్మెల్యే, కంటోన్మెంట్
     
     ఆంక్షలొద్దు: హైకోర్టు ఆదేశం
     కంటోన్మెంట్ పరిధిలో రక్షణాధికారుల ఆంక్షల వల్ల ఇబ్బం దులు పడుతున్న సాధారణ ప్రజానీకానికి హైకోర్టు కాస్త ఊరటనిచ్చింది. ఎటువంటి ఆంక్షలు విధించకుండా వాహనాల రాకపోకలను అనుమతించాలని రక్షణ మంత్రిత్వశా ఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యా యమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో రక్షణశాఖాధికారులు భద్రతను కారణంగా చూపుతూ పలు రహదారులను మూసివేశారని, దీని వల్ల సామాన్య ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎటువంటి ఆంక్షలు లేకుండా వాహనాల రాకపోకలకు అనుమతిని మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ మల్కాజిగిరి నియోజకవర్గ కోఆర్టినేటర్ గుడిమెట్ల సూర్యనారాయణరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన బి.కృష్ణవిజయారావులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను శుక్రవారం జస్టిస్ నవీన్‌రావు విచారించారు. కంటోన్మెంట్ రోడ్లపై వాహనదారులపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని న్యాయమూర్తి తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలను తదుపరి విచారణ నిమిత్తం మార్చి 6కి వాయిదా వేశారు.


     ఆంక్షలు వద్దని కోర్టు పేర్కొన్న మార్గాలివీ...
      ఎంట్రన్స్‌రోడ్ : ఎస్‌పీ రోడ్డు, ఈస్ట్ మారేడ్‌పల్లి నుంచి అలహాబాద్ గేట్
      వెల్లింగ్టన్‌రోడ్ : సికింద్రాబాద్ క్లబ్ నుంచి అలహాబాద్‌రోడ్.
      ఆర్డినెన్స్ రోడ్ : సఫిల్‌గూడ జంక్షన్ నుంచి
      మార్నింగ్‌టన్ రోడ్ : తిరుమలగిరి హనుమాన్ దేవస్థానం నుంచి గాఫ్ రోడ్.
      గాఫ్ రోడ్ : కేంద్రీయ విద్యాలయ క్రాసింగ్ నుంచి ఈస్ట్, వెస్ట్ మారేడ్‌పల్లి
     
     గత పదేళ్లలో మూతపడిన ప్రధాన రహదారులు
     బొల్లారం నుంచి బాలాజీనగర్, భవన్స్ కాలేజీ మీదుగా సైనిక్‌పురి వేళ్లే మార్గాన్ని ఏడేళ్ల క్రితం మూసేశారు. శామీర్‌పేట నుంచి రహదారి నుంచి నేరుగా ఈసీఐఎల్ వైపు వెళ్లే వారు ఈ మార్గాన్నే ఉపయోగించేవారు. ఈ రోడ్డు మూసివేతతో బొల్లారం- కౌకూరు- యాప్రాల్ మీదుగా బాలాజీనగర్ చేరుకోవాల్సి వస్తోంది.
     
     బోయిన్‌పల్లి చెక్‌పోస్టు సమీపంలోని నందమూరి నగర్ నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాలనీలకు ఉన్న రహదారిని ఐదేళ్ల క్రితం మూసేశారు. దీంతో ఒకటిన్నన కిలోమీటరు దూరంలోనే ఉన్న ఆయా కాలనీలకు చేరుకోవాలంటే ప్రస్తుతం సుచిత్ర జంక్షన్ నుంచి లేదా, బాలానగర్-ఐడీపీఎల్ -చింతల్ మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి. ఈ చర్యల వల్ల కంటోన్మెంట్‌కు కుత్బుల్లాపూర్‌కు ఉన్న లింక్ దాదాపుగా తెగిపోయింది.
     
     బొల్లారం అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఉన్న రహదారి ఆర్మీ ఈగల్ స్టాట్యూ నుంచి నేరుగా బాలాజీనగర్- భవన్స్ మార్గాలకు చేరేందుకు అనువుగా ఉండేది. మూడేళ్ల క్రితం ఈ రోడ్డు మూతతో అల్వాల్- లోతుకుంట- మల్లారెడ్డినగర్- రాష్ట్రపతినిలయం మార్గంలో వెళ్లాల్సి వస్తోంది.
     
     రామకృష్ణాపురం ఫ్లైఓవర్ నుంచి తిరుమలగిరి చౌరస్తాకు వచ్చే మార్గంలోని కుడివైపు రోడ్లలోని పలు సబ్ రోడ్లను దశలవారీగా మూసేస్తూ వచ్చారు. తాజాగా ఈ మార్గంలో ఎడమవైపు (కేంద్రీయ విద్యాలయం చౌరస్తా నుంచి ఏఓసీకి వెళ్లే రోడ్డు) మార్గాన్ని మూసివేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం నుంచి, సికింద్రాబాద్ క్లబ్/ పికెట్ నుంచి ఈస్‌మారేడ్‌పల్లి/ ఎస్‌పీరోడ్డు నుంచి, సఫిల్‌గూడ రైల్వే క్రాసింగ్ నుంచి ఏఓసీకి దారి తీసే మార్గాలన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement