సాక్షి, హైదరాబాద్: మియాపూర్–సంగారెడ్డి మార్గంలో నిత్యం నరకప్రాయంగా ఉన్న ట్రాఫిక్ రద్దీకి తెరపడనుంది. ట్రాఫిక్ చిక్కులు తొలగిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి (పోత్‌రెడ్డిపల్లి చౌరస్తా) వరకు ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు వరుసలుగా 60 మీటర్లకు విస్తరించనున్న విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి డీపీఆర్ సిద్ధమైంది. వారం రోజుల్లో ఇది కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రిత్వ కార్యాలయ అనుమతి కోసం ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. 31 కి.మీ. నిడివి ఉన్న ఈ రోడ్డు విస్తరణకు రూ.1,400 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రోడ్డునిర్మాణ పనులకు రూ.వేయి కోట్లు, భూసేకరణ పరిహారానికి రూ.400 కోట్లు ఖర్చు కానుంది.
నగరంలోనే పెద్ద రోడ్డుగా..
ఈ మార్గంలోనే ఉన్న కూకట్‌పల్లి వద్ద అత్యంత రద్దీ ట్రాఫిక్ వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ ఇప్పటికే మియాపూర్ వరకు రోడ్డును విస్తరించింది. అక్కడి నుంచి రోడ్డు విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల విభాగం తీసుకుంది. ఈ రోడ్డు 60 మీటర్లకు వెడల్పు కానుంది. ప్రధాన క్యారేజ్ వే, దాని పక్కన సర్వీస్ రోడ్లు కలిపి 200 అడుగుల విశాలంతో రోడ్డు ఏర్పడుతుంది. నగరంలో విశాలంగా ఉన్న ప్రధాన రోడ్డు ఇదే కానుంది. ప్రస్తుతం రోడ్డు నాలుగు వరుసలుగా ఉన్నా.. 60 మీటర్ల స్థలం మాత్రం అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ మొత్తం రోడ్డుగా మారబోతోంది.
అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు
ఈ రోడ్డులో వాహనాలకు క్రాసింగ్ రోడ్లతో ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్లను నిర్మిస్తారు. ఇందులో బీహెచ్‌ఈఎల్ వద్ద ఫ్లైఓవర్ రానుంది. దీనిని ఈ రోడ్డులో భాగంగానే నిర్మించాల్సి ఉంది. అక్కడ ట్రాఫిక్ చిక్కుల దృష్ట్యా ఆ పనులను విడదీశారు. త్వరలో అక్కడ నిర్మాణ పనులు జరగబోతున్నాయి. ఇక పటాన్‌చెరు, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం,కంది ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు.
నగరంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణకు వీలుగా 60 మీటర్ల స్థలం అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో తప్ప పెద్దగా నిర్మాణాలు అడ్డుగా లేవు. బీహెచ్‌ఈఎల్ దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. ఏప్రిల్ నాటికి టెండర్లు పూర్తి చేసి జూలై నాటికి పనులు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు ప్రారంభమైన రెండేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ, రెండున్నరేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment