పటాన్‌చెరుటౌన్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా మియాపూర్ నుంచి మెదక్ జిల్లా సంగారెడ్డి వరకు వేసిన 31 కిలోమీటర్ల నాల్గు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా అసంపూర్తిగానే మిగిలిపోయాయి. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ఈ జాతీయరహదారిపై ట్రాఫిక్ పెరగడంతో మియాపూర్ నుంచి సంగారెడ్డివరకు నాల్గు లేన్లతో రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను ఓ నిర్మాణ సంస్థకు (బీఓటీ) బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిన ప్రభుత్వం అప్పగిచింది. అయితే 2008 డిసెంబర్ నాటికి సదరు సంస్థ 80 శాతం రోడ్డు పనులను మాత్రమే పూర్తి చేసింది. 80 శాతం పనులు మాత్రమే పూర్తి చేసిన సదరు సంస్థకు టోల్‌ప్లాజా ఏర్పాటు చేసుకొని వాహన దారులనుంచి డబ్బులు వసూలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
టోల్ గేట్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిర్మాణ సంస్థ ఐదు సంవత్సరాలు గడిచినా మిగిలిన 20 శాతం పనులను పూర్తి చేయలేదు. కానీ ప్రతి రెండు సంవత్సరాలకోసారి 10 శాతం టోల్ గేటు రుసుము పెంచుతుందని విమర్శలు వస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో భాగంగా పట్టణంలోని మార్కెట్ సమీపంలో కల్వర్టు ఏర్పాటు చేసి సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. కల్వర్టు నిర్మించకుండా సర్వీసు రోడ్డును వేయడమే మానేశారు. అంతే కాకుండా పట్టణంలో ప్రయాణికుల భద్రత కోసం రోడ్డు మద్యలో గ్రిల్స్ ఏర్పాటు చేయాల్సి ఉండగా అటువంటి ఏర్పాట్లే చేయలేదు.
రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ గతంలో ఓ అధికార పార్టీకి చెందిన ఎంపీ కావడంతో అధికారులు పట్టించు కోలేదనే విమర్శలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వంలో నైనా మిగిలిన రోడ్డు పనులకు మోక్షం లభిస్తుందోమోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు. సంగారెడ్డి నుంచి మియాపూర్ వరకు ఎటువంటి ప్రమాదాలు జరిగినా సదరు సంస్థ క్షతగాత్రులను ఆంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది. కానీ ఏ రోజు కూడా ఆంబులెన్స్ అందుబాటులో ఉండదు. టోల్ ప్లాజా వద్ద నామమాత్రంగా డొక్కు అంబులెన్స్ దర్శనమిస్తుంది. రోడ్డు నిర్వాహణ బాధ్యత సదరు సంస్థపై ఉన్నప్పటికీ ఆ రోడ్డు ఏ రోజు చూసినా అపరిశుభ్రంగా ఉంటోంది. సదరు సంస్థ కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయలేదు. రోడ్డుపై సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
పూర్తికాని నాలుగులేన్ల రహదారి!
Published Sat, May 24 2014 11:55 PM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement