సాక్షి, హైదరాబాద్: ఆరు వరుసలకు విస్తరిస్తున్న రోడ్డది.. నిడివి 31 కి.మీ. మాత్రమే. కానీ దాని నిర్మాణానికి మాత్రం ఏకంగా రూ. 1,297 కోట్లు ఖర్చు కానుంది! అంటే ఒక కిలోమీటర్‌కు దాదాపు రూ. 42 కోట్ల వ్యయం అన్నమాట. దీన్ని మరోలా చెప్పాలంటే ఎనిమిది వరుసలు, 158 కి.మీ. నిడివితో రూపుదిద్దుకున్న ఔటర్ రింగురోడ్డు నిర్మాణంలో ప్రతి కిలోమీటర్‌కు అయిన ఖర్చు స్థాయికి దాదాపు సమానమన్నమాట!
ఈ కాస్త దూరానికే అంత ఖర్చు ఎందుకు అనుకుంటున్నారా? ఇందులో నిర్మించేది ప్రధాన రోడ్డొక్కటే కాదు.. సరీ్వసు రోడ్లు, క్రాష్ బ్యారియర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ల వద్ద వంతెనలు, అండర్‌పాస్‌లు, కల్వర్టులు.. ఒకటేమిటి ఎక్స్‌ప్రెస్ వే అంటే ఇలా ఉండాలనే రీతిలో ఇది రూపుదిద్దుకోబోతోంది. ఓ రకంగా చెప్పాలంటే మోడల్ ఎక్స్‌ప్రెస్ వేగా నిలవబోతోంది. హైదరాబాద్–పుణే జాతీయ రహదారిపై మియాపూర్–సంగారెడ్డి మధ్య ఉన్న ఈ మార్గం ఎక్స్‌ప్రెస్ వే తరహాలో ముస్తాబుకానుంది. అందుకే ఖర్చు సైతం భారీగా ఉంది.
ట్రాఫిక్ చిక్కులకు తెరదించేలా...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న 65వ నంబర్ జాతీయ రహదారిపై కొన్నేళ్లుగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ శివార్లలో ఆ మార్గాన్ని యుద్ధప్రాతిపదికన 6 వరుసలకు విస్తరించనుంది. ఇందులో హయత్‌నగర్ దాటాక విజయవాడ రోడ్డులో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాథికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రోడ్డు విస్తరణను చేపట్టనుండగా ముంబై రహదారిలో మియాపూర్ సమీపంలోని మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు రాష్ట్ర పీడబ్ల్యూడీ విభాగం అభివృద్ధి చేయనుంది.
తాజాగా మదీనాగూడ–సంగారెడ్డి మధ్య 6 వరుసల విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్‌కు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అ«దీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదించింది. దీంతో ఇక టెండర్లు పిలిచేందుకు
అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవి ఖరారయ్యాక రెండున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.
రోజుకు సగటున లక్ష వాహనాలు..
నగరం నుంచి సంగారెడ్డి రోడ్డు అత్యంత బిజీగా మారిపోయింది. డీపీఆర్ తయారీలో భాగంగా గత ఆగస్టులో ఇస్నాపూర్, పటాన్‌చెరు మధ్య వెళ్తున్న వాహనాల సంఖ్యపై జాతీయ రహదారుల విభాగం సర్వే నిర్వహించగా ఒక రోజులో సగటున లక్ష వాహనాలు ప్రయాణిస్తున్నట్లు తేలింది. పటాన్‌చెరు వద్ద రోజుకు 30,683 కార్లు, 12,353 త్రిచక్ర వాహనాలు, 34,437 ద్విచక్ర వాహనాలు, 5,551 బస్సులు, 9 వేల ట్రక్కులు... ఇలా అన్నీ కలిపి రోజుకు లక్ష వరకు తిరుగుతున్నాయి. ఇక మదీనాగూడ ప్రాంతంలో ఆ సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంటోంది. ఈ రోడ్డును విస్తరిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పుడేం చేస్తారు..?
మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 31 కి.మీ.మేర రోడ్డును 6 వరుసలకు విస్తరించనున్నారు. మూడు వరుసల సరీ్వసు రోడ్డు, ఫుట్‌పాత్, వరద నీటి డ్రెయిన్‌తో 11.66 కి.మీ., మిగతా నిడివిలో రెండు వరుసల సరీ్వసు రోడ్డు ఉండేలా నిర్మించనున్నారు. రుద్రారం వద్ద 1,020 మీటర్ల మేర, గంగారం వద్ద 840 మీటర్ల మేర రెండు ఎలివేటెడ్ కారిడార్లతోపాటు కొత్తగా 11 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఏడు మేజర్, 19 మైనర్ జంక్షన్లను విస్తరించనున్నారు. ఏడు ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఆరు చోట్ల కల్వర్టులను కట్టనున్నారు. ఐదు ప్రాంతాల్లో లిఫ్టు వసతి ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్డుకు రెండు వైపులా క్రాష్ బ్యారియర్లను ఏర్పాటు చేయనున్నారు.
వెరసి ప్రధాన క్యారేజ్ వే మీదకు చుట్టుపక్కల నుంచి ఇతర వాహనాలు, మనుషులు, జంతువులు వచ్చే వీలుండదు. ప్రధాన క్యారేజ్ వే మీదుగా వెళ్లే వాహనాలకు, దీన్ని దాటుతూ అటూఇటూ పోయే వాహనాలకు పరస్పరం ఆటంకం లేని విధంగా డిజైన్ చేశారు. ఇందుకు వీలుగా అదనంగా కావాల్సిన భూమి కోసం రూ. 166 కోట్లు వెచి్చస్తున్నారు. అన్నీ కలిపి నిర్మాణానికి రూ. 1,297 కోట్లు ఖర్చు కానున్నట్టు డీపీఆర్‌లో పేర్కొనగా దానికి తాజాగా కేంద్రం ఆమోదముద్ర వేసింది.
బీహెచ్‌ఈఎల్ వంతెన కాకుండా..
ఈ రోడ్డు విస్తరణలో భాగంగా బీహెచ్‌ఈఎల్ కూడలి వద్ద 131 కోట్లతో భారీ వంతెన నిర్మిస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో అది ఉండనుంది. దాన్ని ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో కాకుండా విడిగా చూపారు. దానికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ రూపొందించిన నమూనా ప్రకారం పనులు సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎన్‌హెచ్ విభాగం ఇటీవల ప్రతిపాదించింది. దీనిపై ఇరు విభాగాల మధ్య విభేదాలు తలెత్తడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు కారణం మీరంటే మీరంటూ ఇరు విభాగాలు లేఖలు రాసుకోవడం వివాదాస్పదంగా మారింది.
చదవండి: డేటా దేశం దాటిందా?
Comments
Please login to add a commentAdd a comment