శుక్రవారం ఉప్పల్ రింగ్ రోడ్డులో ఒకే లైన్‌లో నిలిపిన బస్సులు
ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ కూడలిలో ట్రాఫిక్ చక్రబంధనం తప్పేందుకు కొన్ని చర్యలు తీసుకోవడం తక్షణావసరం. ఇక్కడ వాహనాల రద్దీని నిలువరించి సమస్యను పరిష్కరించేందుకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు మేల్కోవడం తప్పనిసరి. ఇక్కడ చేపట్టిన స్కై వాక్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లయితే ట్రాఫిక్ పద్మవ్యూహం సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
చదవండి: ఇన్‌స్ట్రాగాంలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. ఆటోలో తీసుకెళ్లి..
ఆ స్థలాన్ని సేకరిస్తే..
ఉప్పల్ జీహెచ్‌ఎంసీ మున్సిపల్ స్టేడియం పక్కనే దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఉన్నతాధికారులు, పాలకులు మాట్లాడి శాశ్వత లేక తాత్కా లిక పద్ధతిలోనైనా స్థలాన్ని సేకరిస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది.
జిల్లా బస్టాప్‌ను మారిస్తే..
ఉప్పల్ వరంగల్ బస్ స్టాప్ నుంచి మొదలు నలువైపులా కిలోమీటరు మేర బస్సులను ఇష్టానుసారంగా నిలుపుతున్నారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి చౌరస్తా వరకు బస్సుల వరుస నిత్యకృత్యం. దీంతో పాటు ఉప్పల్ చౌరస్తా నుంచి మెట్రో స్టేషన్ వరకు రోడ్డుకు అడ్డుగా బస్సులను నిలిపివేస్తుంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లా బస్ స్టాప్‌ను మెట్రో స్టేషన్ వద్దకు మార్చవచ్చు.
సమాంతర రహదారుల్ని అభివృద్ధి చేస్తే..
వరంగల్ జాతీయ రహదారికి సమాంతరంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా పార్కు నుంచి లిటిల్ ఫ్లవర్ సమాంతర రోడ్ల మీదుగా ట్రాఫిక్‌ను డ్రైవర్షన్ చేస్తే దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించుకోవచ్చు.
ప్రైవేట్ వాహనాలను నిలువరిస్తే..
ఉప్పల్ వరంగల్ రహదారి.. ఇటువైపు ఎల్‌బీనగర్ వెళ్లే మార్గం దాదాపు రోడ్డుకు ఇరువైపులా ప్రైవేట్ వాహనాలు తిష్ఠ వేస్తున్నాయి. వాటికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఆ స్థానంలోనే నిలిపే విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఫుట్‌పాత్ ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్లే మార్గంలో ఆర్టీఏ కార్యాలయం వరకు ప్రైవేట్ వాహనాల షోరూంల యజమానులు దాదాపుగా సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్నా అధికారులు వీరిని పట్టించుకోవడంలో విఫలమవుతున్నారు. సర్వీస్ రోడ్డును క్లియర్ చేస్తే ఎల్‌బీనగర్ రోడ్డు దాదాపుగా ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది.
పనుల నత్తనడకకు స్వస్తి పలికితే..
ఉప్పల్ చౌరస్తా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నా.. ఇవి నత్త నడకన జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ పనులు 2020లోనే పూర్తవ్వాలి. అధికారుల అలసత్వంతో ల్యాండ్ ఆక్విజేషన్ కాకపోవడంతోనే పనులు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్యకు ఇది కూడా కారణంగా చెప్పవచ్చు.
బస్టాప్‌తో బోలెడు కష్టాలు..
ఈ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోలేదు. ఆర్టీసీ, మున్సిపల్, అర్‌అండ్‌బీ, మెట్రో రైల్, ట్రాఫిక్ పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం అవసరం. యాదాద్రి టెంపుల్ తెరిచినప్పటి నుంచి నిత్యం వేలాది మంది ఉప్పల్ వరంగల్ బస్‌స్టాప్‌ను నుంచే యాదాద్రి వెళ్తున్నారు. దీంతో పాటు ఇటీవల కాలంలో యాదగిరిగుట్టపైకి మినీ బస్సులను సైతం ఉప్పల్ నుంచే ప్రారంభించారు. ఈ కారణంగానూ రద్దీ మరింత పెరిగింది. అదనంగా ఇమ్లీబన్, జూబ్లీ బస్‌స్టేషన్ వరంగల్, హన్మకొండ, పరకాల, చెంగిచర్ల, ఉప్పల్ డిపోల బస్సులు సైతం ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఒకే బస్‌స్టాప్ ఉంది. అది వరంగల్ బస్‌స్టాప్ మాత్రమే. సరైన బస్ బే లేక పోవడంతో రోడ్లపైనే బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. వీటిని పక్కపక్కనే పెట్టడంతో ట్రాఫిక్‌జాం సమస్య తలెత్తుతోంది.
Comments
Please login to add a commentAdd a comment