ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ పద్మవ్యూహం
మీరెప్పుడైనా ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి వాహనంపై వెళ్లారా? అయితే.. అక్కడి ట్రాఫిక్‌తో నరకం అనుభవించే ఉంటారు! వాహనాల ప్రవాహంతో ఆ కూడలి దిగ్బంధనంలో చిక్కుకున్న దృశ్యం మీకు కనిపించే ఉంటుంది. మరోసారి ఈ దారి నుంచి రావొద్దురా బాబు అని అనుకునే ఉంటారు. ఇసుక పోస్తే రాలనంత వాహనాల సమూహం. అక్కడి పరిసరాలన్నీ నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహం. ఓ వైపు సికింద్రాబాద్, హబ్సిగూడల నుంచి.. మరోవైపు ఎల్‌బీనగర్ నుంచి.. ఇంకోవైపు కోఠి, ఎంజీబీఎస్, అఫ్జల్‌గంజ్, రామంతాపూర్ ప్రాంతాల నుంచి వచ్చీ వెళ్లే వాహనాలతో ఉప్పల్ కూడలితో పాటు దాని సమీప ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి.
దీంతో అటు పాదచారులు, ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లోపం, స్కైవే నిర్మాణంలో జాప్యం తదితర కారణాలతో వాహన దిగ్బంధనం కొనసాగుతోంది. భారీ ప్రాజెక్టులు, ఆకాశాన్నంటే వంతెనలు, ఆకాశ మార్గాల్లో నడకదారులు.. ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నా ఇక్కడి ట్రాఫిక్ వ్యవస్థ తీరు మాత్రం మారడం లేదు.
– ఉప్పల్
పెరిగిన వ్యక్తిగత వాహనాలు..
కోవిడ్ తర్వాత వ్యక్తిగత వాహనాలు పెరగడంతోనూ ట్రాఫిక్ సమస్యకు ఆజ్యం పోసినట్లవుతోంది. ఈస్ట్ సిటి అభివృద్థిలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ వైపు ఐటీ కారిడార్‌లను తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉప్పల్ వద్ద జెన్‌ప్యాక్, అరీనా టవర్స్ వంటి సాఫ్ట్‌వేర్ సంస్థలు, డీఎస్‌ఎల్ మాల్ లాంటి అనేక కంపెనీలో అడుగుపెట్టాయి. మరిన్ని సంస్థలు వచ్చి చేరడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. వీటికి మార్గం సుగమం కావాలంటే మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ అవసరం. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన యూటర్న్ సిస్టంపై నెట్టుకుంటూ వస్తున్నారు. ఉప్పల్ చౌరస్తా మీదుగా నిమిషానికి సుమారు 600 నుంచి 700 వాహనాలు వెళ్తున్నట్లు అంచనా.
బస్టాప్‌తో పరేషాన్..
హబ్సిగూడ, రామంతాపూర్‌ల నుంచి ఉప్పల్‌కు వచ్చే దారిలో బస్‌స్టాప్ ఉంది. సిటీ బస్సులతో పాటు వివిధ డిపోలకు చెందిన బస్సులు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. యాదాద్రి, వరంగల్‌కు వెళ్లడానికి ఈ బస్సుస్టాపే ప్రధానమైంది. దీంతో పాటు నాలుగు అడుగుల దూరంలోనే ఉప్పల్ చౌరస్తా వద్ద సిగ్నల్ ఉండటంతో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమవుతోంది.
స్కైవే ఎఫెక్ట్‌తో..
ఉప్పల్ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గం కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. రామంతాపూర్ వైపు స్కైవే నిర్మాణం జరుగుతుండగా భారీ వాహనాలను దారి మళ్లించడంతో రద్దీ రెట్టింపైంది. ఉప్పల్ చౌరస్తా నుంచి కేవీ– 2 స్కూల్ నుంచి వెళ్లాల్సిన భారీ వాహనాలను ఏక్ మినార్ మజీద్, ఉప్పల్ క్రికెట్ స్టేడియం మీదుగా రామంతాపూర్‌కు మళ్లించారు.
బస్సు పక్కన బస్సుతో..
హబ్సిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే దారిలో వరంగల్ వైపు వెళ్లే బస్సులతో పాటు మిగతావాటికీ ఇక్కడే బస్టాప్. వరంగల్, యాదాద్రి వెళ్లడానికి ఇదే ప్రధాన బస్టాప్‌గా మారడంతో ఇమ్లిబన్, జూబ్లీ నుంచి వచ్చే వాహనాలు రోడ్డుపైనే నిలబెట్టి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. దీంతో బస్సు వెనక బస్సు కాకుండా బసు పక్కన బస్సులను నిలపడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
దీనికి తోడు యాదాద్రికి వెళ్లడానికి ఉప్పల్ చౌరస్తా ప్రధాన రహదారి కావడం, ఎల్‌బీనగర్ వైపు పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లకు వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం. వీఐపీల ప్రయాణాలు అధికంగా ఉండటంతోనూ ట్రాఫిక్ నిత్యం నరకంగా మారుతోంది. అదనంగా లోకల్ బస్సు డిపోలకు సంబందించిన బస్సులు చేంజ్ ఓవర్ కూడా ఇక్కడే ఉండటంతో మరింత జటిలమవుతోంది.
బోడుప్పల్ నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు అడ్డదిడ్డం
ఉప్పల్ బస్‌డిపో నుంచి ఉప్పల్ చౌరస్తా, ఎల్‌బీనగర్ బస్టాప్ వరకు దాదాపు 2 కి.మీ రోడ్లు అడ్డదిడ్డంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. స్కైవే నిర్మాణం జరుగుతోందని ఈ రోడ్డును ఏమీ చేయలేమని జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
నత్తనడకన ఫ్లై ఓవర్ పనులు..
ఉప్పల్ ఎల్‌బీనగర్ బస్‌స్టాప్ నుంచి నాగోల్ చౌరస్తా వరకు దాదాపు 2 కి.మీ దూరం. ఉప్పల్ చౌరస్తాలోనే నాలుగు జిల్లాల ఆర్టీసీ బస్సులకు ఇక్కడే స్టాప్. దీంతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి బస్‌స్టాప్ కూడా ఇక్కడే ఉండటం, రోడ్డుకు ఇరువైపులా మెట్రో స్టేషన్లు.. ఇలా దారి పొడవునా ట్రాఫిక్ ఇబ్బందులే. వీటికి తోడు నాగోల్ బ్రిడ్జి దాటిన తర్వాత నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా జరగటంలేదు.
ఉప్పల్ ప్రయాణమంటేనే హడల్
రోడ్లు సరిగా లేవు. స్కైవే నిర్మాణం ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఇంకా కొలిక్కి రారేదు. మరోపక్క స్కైవాక్ వంతెన కూడా పూర్తి కాలేదు. రోడ్డు దాటాలన్నా హడలెత్తిస్తోంది. ఎప్పుడే ప్రమాదం వచ్చి పడుతుందోననే భయం వెంటాడుతోంది.
– సతీష్, ప్రైవేటు ఉద్యోగి, ఉప్పల్ ఆదర్శ్‌నగర్
ట్రాఫిక్‌తో పాటు కాలుష్యం..
ఉప్పల్ జంక్షన్‌కు వస్తున్నామంటనే ట్రాఫిక్ భయం పట్టుకుంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లేనందువల్లే అభద్రతా భావం ఏర్పడుతోంది. పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. కానీ అలా జరగడం లేదు. ట్రాఫిక్ పోలీసుల దృష్టి కేవలం చలానాలపైనే ఉంటోంది.
– ప్రదీప్ కుమార్, ఉప్పల్
Comments
Please login to add a commentAdd a comment