cross road
-
ఉప్పల్ కష్టాల్: అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం
మీరెప్పుడైనా ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి వాహనంపై వెళ్లారా? అయితే.. అక్కడి ట్రాఫిక్‌తో నరకం అనుభవించే ఉంటారు! వాహనాల ప్రవాహంతో ఆ కూడలి దిగ్బంధనంలో చిక్కుకున్న దృశ్యం మీకు కనిపించే ఉంటుంది. మరోసారి ఈ దారి నుంచి రావొద్దురా బాబు అని అనుకునే ఉంటారు. ఇసుక పోస్తే రాలనంత వాహనాల సమూహం. అక్కడి పరిసరాలన్నీ నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహం. ఓ వైపు సికింద్రాబాద్, హబ్సిగూడల నుంచి.. మరోవైపు ఎల్బీనగర్ నుంచి.. ఇంకోవైపు కోఠి, ఎంజీబీఎస్, అఫ్జల్‌గంజ్, రామంతాపూర్ ప్రాంతాల నుంచి వచ్చీ వెళ్లే వాహనాలతో ఉప్పల్ కూడలితో పాటు దాని సమీప ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో అటు పాదచారులు, ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లోపం, స్కైవే నిర్మాణంలో జాప్యం తదితర కారణాలతో వాహన దిగ్బంధనం కొనసాగుతోంది. భారీ ప్రాజెక్టులు, ఆకాశాన్నంటే వంతెనలు, ఆకాశ మార్గాల్లో నడకదారులు.. ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నా ఇక్కడి ట్రాఫిక్ వ్యవస్థ తీరు మాత్రం మారడం లేదు. – ఉప్పల్ పెరిగిన వ్యక్తిగత వాహనాలు.. కోవిడ్ తర్వాత వ్యక్తిగత వాహనాలు పెరగడంతోనూ ట్రాఫిక్ సమస్యకు ఆజ్యం పోసినట్లవుతోంది. ఈస్ట్ సిటి అభివృద్థిలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ వైపు ఐటీ కారిడార్లను తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉప్పల్ వద్ద జెన్‌ప్యాక్, అరీనా టవర్స్ వంటి సాఫ్ట్వేర్ సంస్థలు, డీఎస్ఎల్ మాల్ లాంటి అనేక కంపెనీలో అడుగుపెట్టాయి. మరిన్ని సంస్థలు వచ్చి చేరడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. వీటికి మార్గం సుగమం కావాలంటే మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ అవసరం. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన యూటర్న్ సిస్టంపై నెట్టుకుంటూ వస్తున్నారు. ఉప్పల్ చౌరస్తా మీదుగా నిమిషానికి సుమారు 600 నుంచి 700 వాహనాలు వెళ్తున్నట్లు అంచనా. బస్టాప్‌తో పరేషాన్.. హబ్సిగూడ, రామంతాపూర్‌ల నుంచి ఉప్పల్‌కు వచ్చే దారిలో బస్‌స్టాప్ ఉంది. సిటీ బస్సులతో పాటు వివిధ డిపోలకు చెందిన బస్సులు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. యాదాద్రి, వరంగల్‌కు వెళ్లడానికి ఈ బస్సుస్టాపే ప్రధానమైంది. దీంతో పాటు నాలుగు అడుగుల దూరంలోనే ఉప్పల్ చౌరస్తా వద్ద సిగ్నల్ ఉండటంతో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమవుతోంది. స్కైవే ఎఫెక్ట్‌తో.. ఉప్పల్ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గం కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. రామంతాపూర్ వైపు స్కైవే నిర్మాణం జరుగుతుండగా భారీ వాహనాలను దారి మళ్లించడంతో రద్దీ రెట్టింపైంది. ఉప్పల్ చౌరస్తా నుంచి కేవీ– 2 స్కూల్ నుంచి వెళ్లాల్సిన భారీ వాహనాలను ఏక్ మినార్ మజీద్, ఉప్పల్ క్రికెట్ స్టేడియం మీదుగా రామంతాపూర్‌కు మళ్లించారు. బస్సు పక్కన బస్సుతో.. హబ్సిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే దారిలో వరంగల్ వైపు వెళ్లే బస్సులతో పాటు మిగతావాటికీ ఇక్కడే బస్టాప్. వరంగల్, యాదాద్రి వెళ్లడానికి ఇదే ప్రధాన బస్టాప్గా మారడంతో ఇమ్లిబన్, జూబ్లీ నుంచి వచ్చే వాహనాలు రోడ్డుపైనే నిలబెట్టి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. దీంతో బస్సు వెనక బస్సు కాకుండా బసు పక్కన బస్సులను నిలపడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీనికి తోడు యాదాద్రికి వెళ్లడానికి ఉప్పల్ చౌరస్తా ప్రధాన రహదారి కావడం, ఎల్బీనగర్ వైపు పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లకు వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం. వీఐపీల ప్రయాణాలు అధికంగా ఉండటంతోనూ ట్రాఫిక్ నిత్యం నరకంగా మారుతోంది. అదనంగా లోకల్ బస్సు డిపోలకు సంబందించిన బస్సులు చేంజ్ ఓవర్ కూడా ఇక్కడే ఉండటంతో మరింత జటిలమవుతోంది. బోడుప్పల్ నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు అడ్డదిడ్డం ఉప్పల్ బస్‌డిపో నుంచి ఉప్పల్ చౌరస్తా, ఎల్బీనగర్ బస్టాప్ వరకు దాదాపు 2 కి.మీ రోడ్లు అడ్డదిడ్డంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. స్కైవే నిర్మాణం జరుగుతోందని ఈ రోడ్డును ఏమీ చేయలేమని జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. నత్తనడకన ఫ్లై ఓవర్ పనులు.. ఉప్పల్ ఎల్బీనగర్ బస్‌స్టాప్ నుంచి నాగోల్ చౌరస్తా వరకు దాదాపు 2 కి.మీ దూరం. ఉప్పల్ చౌరస్తాలోనే నాలుగు జిల్లాల ఆర్టీసీ బస్సులకు ఇక్కడే స్టాప్. దీంతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి బస్‌స్టాప్ కూడా ఇక్కడే ఉండటం, రోడ్డుకు ఇరువైపులా మెట్రో స్టేషన్లు.. ఇలా దారి పొడవునా ట్రాఫిక్ ఇబ్బందులే. వీటికి తోడు నాగోల్ బ్రిడ్జి దాటిన తర్వాత నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా జరగటంలేదు. ఉప్పల్ ప్రయాణమంటేనే హడల్ రోడ్లు సరిగా లేవు. స్కైవే నిర్మాణం ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఇంకా కొలిక్కి రారేదు. మరోపక్క స్కైవాక్ వంతెన కూడా పూర్తి కాలేదు. రోడ్డు దాటాలన్నా హడలెత్తిస్తోంది. ఎప్పుడే ప్రమాదం వచ్చి పడుతుందోననే భయం వెంటాడుతోంది. – సతీష్, ప్రైవేటు ఉద్యోగి, ఉప్పల్ ఆదర్శ్‌నగర్ ట్రాఫిక్‌తో పాటు కాలుష్యం.. ఉప్పల్ జంక్షన్‌కు వస్తున్నామంటనే ట్రాఫిక్ భయం పట్టుకుంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లేనందువల్లే అభద్రతా భావం ఏర్పడుతోంది. పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. కానీ అలా జరగడం లేదు. ట్రాఫిక్ పోలీసుల దృష్టి కేవలం చలానాలపైనే ఉంటోంది. – ప్రదీప్ కుమార్, ఉప్పల్ -
నూతన బైపాస్‌లో డేంజర్ బెల్స్
ఒంగోలు క్రైం: ఒంగోలు నగరానికి తూర్పు వైపున నిర్మించిన నూతన బైపాస్కు ఇరువైపులా ఉన్న మలుపు కూడళ్లు ప్రాణసంకటంగా మారాయి. నూతన బైపాస్ దక్షిణం వైపు, ఉత్తరం వైపు అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నందున వాహనదారులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా, అసౌకర్యంగా మారింది. దీంతో అటు ఉత్తరం వైపు, ఇటు దక్షిణం వైపు తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా జాతీయ రహదారి అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేస్తుండటంతో వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. నూతన బైపాస్ కూడళ్లలో, మలుపుల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవటంతో కార్లు, ద్విచక్ర వాహనాలు రోడ్డుపై ఉంచిన సిమెంట్ దిమ్మెలను ఢీకొంటున్నాయి. ఇటీవలి కాలంలో దక్షిణ బైపాస్‌లో ఐదు ప్రమాదాలు సంభవించాయి. ఇక ఉత్తర బైపాస్‌లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇప్పటికైనా రోడ్డు మార్జిన్లలో ప్రమాద సూచికలు, రేడియం స్లిక్కర్లు ఏర్పాటు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
డెత్ క్రాస్..!
అద్దంకి: చిన్నకొత్తపల్లి క్రాస్ రోడ్.. ఈ పేరు వింటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. అక్కడేదో శక్తి వచ్చేపోయే వాహనాలను ప్రమాదాలకు గురి చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో ఎవరూ చెప్పలేరు కానీ ఇదే ప్రదేశంలో లెక్కకు మించి ప్రమాదాలు సంభవించడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుంది. అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఉన్న బర్ముడా ట్రయాంగిల్ అనే ప్రదేశానికి వెళ్లిన నౌకలు.. విమానాలు మాయం అవుతున్నట్లు.. ఈ ప్రదేశానికి ఇది బర్ముడా ట్రాయంగిల్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అద్దంకి –నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారి పరిధిలో ఉన్న చిన్నకొత్తల్లి గ్రామానికి వెళ్లే మార్గం వద్ద క్రాస్ రోడ్ ఉంది. ఇది అత్యంత ప్రమాదకర ప్రదేశంగా మారింది. గత ఐదారు సంవత్సరాలుగా 50 మందికి పైగా ఇక్కడ జరిగిన వాహన ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. 150 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ప్రమాదాల నివారణ కోసం పోలీసులు తీసుకున్న స్టాప్ బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో స్పీడ్ బ్రేకర్లు వేయాలని పోలీసులు నిర్ణయించారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అటు పోలీసులకు, ఇటు వాహనదారులకు కంటిమీద కునుకు ఉండటంలేదు. ఏడాదికి పది ప్రాణాలు 2017 జనవరి నుంచి 2018 జనవరి వరకు ఇక్కడ జరిగిన ఐదు ప్రమాదాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. 20 మంది వికలాంగులుగా మారారు. ♦ 2017 ఫిబ్రవరి 7న బైక్‌ను బస్సు ఢీకొనడంతో ఏల్చూరుకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. ఒకరికి గాయాలయ్యాయి. ♦ ఏప్రిల్ 4న మారెళ్ల గ్రామానికి చెందిన అల్లాబక్షు, అతని భార్య కరిమూన్, ప్రియాంక అనే చిన్నారి మోటారు బైకుపై మలుపు తిరుగుతుండగా వేగంగా వస్తున్న, కారు ఢీ కొట్డడంతో, ప్రియాంక మృతిచెందింది. కరిమూన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే నెలలో 29న మోటారు బైకును కారు ఢీ కొట్టినప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ♦ మే 12న మహారాష్ట్రకు చెందిన తుఫాన్ వాహనంలో ఉన్న 12 మందికి గాయాలయ్యాయి. డిసెంబరు 16వ తేదీన మోటారు బైకుపై వెళ్తున్న బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు ఇంజినీర్లను, మరో వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో ఒక యువ ఇంజినీరు అక్కడికక్కడే మృతచెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. గతంలో ఇదే క్రాస్ రోడ్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై లారీ వెళ్లడంతో నలుగురు మరణించారు. ఈ క్రమంలో పోలీసులు ఈ క్రాస్ రోడ్‌ను డేంజర్ జోన్‌గా ప్రకటించారు. శాశ్వత పష్కారం? ఈ క్రాస్ రోడ్ వద్ద స్పీడు బ్రేకర్లు వేసినా, స్టాప్ బోర్డులు పెట్టినా ప్రయోజనం ఉండదని, ఆవి ప్రమాదాలను మరింత పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఏదో ఒక దైవ సంబంధిత విగ్రహం ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల భక్తుల రద్దీ పెరిగి వాహనాల వేగం తగ్గుతుందంటున్నారు. ఆ దిశగా అధికారులు, గ్రామానికి చెందిన పెద్దలు ఆలోచించాలని కోరుతున్నారు. గతంలో ఆధ్యాత్మిక ప్రాంతాల ఏర్పాటు.. గతంలో అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా ఉన్న వల్లూరమ్మ దేవస్థానం ప్రాంతం, జాతీయ రహదారిపైన బొప్పూడి వద్ద గుడుల ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను పూర్తిగా నివారించగలిగారని చెబుతున్నారు. చిన్నకొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద కూడా దేవాలయం నిర్మిస్తే నిత్యం జన సంచారంతోపాటు, ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించవచ్చు. లౌడ్ స్పీకర్ల వలన దాదపు రెండు వైపులా ఆర కిలోమీటరు మేర భక్తిపాటలు వినిపిస్తుంటాయి కాబట్టి నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లు కూడా మేల్కొనే అవకాశం ఉంటుంది. దుకాణాలు ఏర్పడటం వల్ల ఆక్కడ కాసేపు ఆగి విశ్రాంతి తీసుకొనే అవకాశం కలుగుతుంది. దైవ కృప సంగతి అటుంచితే దీనిని రద్దీగా ఉండే ప్రాదేశంగా మార్చవచ్చనేది నిపుణుల అభిప్రాయం. -
గాలిలో దీపంలా చిన్నారుల ప్రాణాలు
భీమవరం(పెళ్లకూరు): ఒకటి కాదు...రెండు కాదు...వరుసగా రోడ్డు ప్రమాదాలే...నిత్యం ఏదోకచోట విద్యార్థులు ప్రయాణించే బస్సులే ప్రమాదాలకు గురవుతున్నాయి. ముక్కుపచ్చలారరని చిన్నారులతో పాటు కళాశాలకెళ్లే విద్యార్థులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్రంగా గాయపడుతున్నారు. అన్నింటికంటే ప్రధానంగా ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నారులు ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. తల్లిదండ్రులు ప్రాణపదంగా భావించే తమ పిల్లలను ఎంతో ఆనందంగా స్కూల్‌కు పంపిస్తుంటే ప్రమాదాలు పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి. తాజాగా 71వ జాతీయ రహదారిపై భీమవరం క్రాస్‌రోడ్డు వద్ద శనివారం సాయంత్రం స్కూల్ వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో 19 మంది విద్యార్థులకు గాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిల్లకూరు వడ్డిపాళెం గ్రామంలోని ప్రైవేటు పాఠశాల బస్సు విద్యార్థులను భీమవరం, నెలబల్లి గ్రామాలకు తీసుకెళుతుంది. క్రాస్ రోడ్డుకు వ్యాన్ తిరిగే సమయంలో నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తి వైపు వెళ్లే లారీ స్కూల్ వ్యాన్‌ను వెనుక భాగంలో ఢీకొట్టింది. దీంతో వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న పంటకాలువలోకి బోల్తా పడింది. ఈ సంఘటనలో వ్యానులో ఉన్న 19మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలు ఆషాకు గాయాలయ్యాయి. వ్యాన్‌లో వున్న రాంధీప్, కౌశిక్‌లకు తలపైన, సంధీప్, రేష్మ, భరత్‌కుమార్‌లకు కాలు, చెయ్యి విరిగాయి. వాసు, వెంకటేష్, రూప, పురంధరీశ్వరి, గణేష్, ఉదయ్‌కుమార్, పవన్, ప్రవళిక తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై శివశంకరావు తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. తలపై గాయాలైన ఇద్దరు విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. నాయుడుపేట సీఐ రత్తయ్య, ఎస్సై ఆంజనేయరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్కూల్‌వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, డ్రైవర్‌కి గతంలో పలుమార్లు హెచ్చరించామని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌వ్యాన్ ప్రమాదానికి గురైన సమాచారం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన విద్యార్థులకు వెంటనే వైద్య సేవలు చేయించేలా చర్యలు చేపట్టారు. తమ బిడ్డలకు ఏమైందో నంటూ ఆసుపత్రి ప్రాంగణం తల్లిదండ్రుల రోదనలతో మిన్నంటాయి. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయిల్ ట్యాంకర్ ఢీకొని సీపీఎం నాయకుడి మృతి
నెల్లూరు, సిటీ: ఆరుుల్ ట్యాంకర్ ఢీకొని సీపీఎం సీనియర్ నాయకుడు అరిగెల నారాయణ(75) మృతిచెందిన సంఘటన గొలగమూడి క్రాస్ రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేం దుకు నారాయణతో పాటు ఆయన సోదరుడు రాధాకృష్ణతో కలిసి స్కూటర్‌పై నెల్లూరు నుంచి కనుపర్తిపాడు బయలుదేరారు. హైవే ఎక్కేందుకు గొలగమూడి క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి విజయవాడ వైపు వేగంగా వెళుతున్న ఆరుుల్ ట్యాంకర్ ఢీకొట్టింది. నారాయణ తలకు బలమైన గాయంకావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన సోదరుడు రాధాకృష్ణకు తీవ్ర గాయూలుకావడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని సింహపురి ఆస్పత్రికి తరలించారు. రాధాకృష్ణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రాధాకృష్ణ బండి నడుపుతుండగా నారాయణ వెనుక కూర్చున్నారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యూడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్యాంకర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదో నగర సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో దారిమళ్లించి దోపిడీ
పొదలకూరు: పాఠశాలకు వెళుతున్న ఇద్దరు ఉపాధ్యాయినులను ఆటోలో ఎక్కించుకుని మార్గంమధ్యలో దారిమళ్లించి దోపిడీకి పాల్పడిన ఘటన గురువారం మండలంలోని తోడేరు రోడ్డులో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. తోడేరు గిరిజన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సడ్డా లావణ్య, మెయిన్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎస్కే ఫామిదా నెల్లూరు-పొదలకూరు మెయిన్‌రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఎడమగట్టు కాలువ వద్ద ఆగంతుకులు కాలువ వెంబడి దారి మళ్లించారు. కేకలు వేసి ఎదురుతిరిగేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను వెనుక సీట్లో ప్రయాణికుడిలా ఉన్న యువకుడు వెంటనే కత్తిచూపి అరిస్తే పీక కోసేస్తానని బెదిరించాడు. కాలువ వెంబడి రెండు పర్లాంగుల దూరం తీసుకుని వెళ్లి ఓ గుంత వద్ద ఆటోను నిలిపి డ్రైవర్, ప్రయాణికుడిలా నటించిన ఆగంతకుడు, పక్కా ప్రణాళికతో గుంతలో సిద్ధంగా ఉన్న ముసుగు ధరించిన వ్యక్తి కలిసి ఉపాధ్యాయినుల వద్ద సుమారు 15 సవర్ల బంగారు నగలను లాక్కున్నారు. మంగళసూత్రం ఒక్కటి ఇవ్వండని లావణ్య ప్రాధేయపడినా దోపిడీ దొంగలు కనికరించకుండా అపహరించుకుని ఆటోలో వెళ్లారు. లావణ్య వద్ద సరుడు, ఉంగరాలు 2, గాజులు 2, కమ్మలు, ఫామిదా వద్ద నల్లపూసల దండ, కమ్మలు, ఉంగరాలు 2 దుండగులు దోచుకున్నారు. సెల్ఫోన్లతో సమాచారం అంది స్తారని ఉపాధ్యాయినుల వద్దనున్న హ్యాండ్ బ్యాగులను కూడా లాక్కుని వెళ్లారు. భయకంపితులైన టీచర్లు కాలువ వెంబడి నడుచుకుంటూ రోడ్డపైకి వచ్చి గ్రామంలోని పాఠశాలకు చేరుకుని సహోపాధ్యాయులు, గ్రామస్తులకు జరిగిన ఘటనను వివరించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్సై అంజిరెడ్డి చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకుని కేసునమోదు చేశారు. సమాచారం తెలుసుకున్న మండలంలోని పలుపాఠశాలల ఉపాధ్యాయులు, యూనియన్ల నాయకులు వచ్చి పరామర్శించారు. ముసుగు వ్యక్తి స్థానికుడిగా అనుమానం ముసుగు ధరించిన వ్యక్తే దోపిడీకి సూత్రదారి అయి ఉంటాడని గ్రామస్తులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆటోడ్రైవర్, మరో వ్యక్తి స్థానికేతరులుగా భావిస్తున్నారు. ముసుగు ధరించిన వ్యక్తిని ఉపాధ్యాయినులు గుర్తిస్తారనే ఉద్దేశంతో పక్కా ప్రణాళిక రచించి బయటి వ్యక్తుల సహకారంతో దోపిడీకి పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామని ఎస్సై తెలిపారు. అదే ఫక్కీలో వృద్ధురాలిని దోచుకున్న దుండగులు తోడేరు క్రాస్‌రోడ్డులో ఉపాధ్యాయినులను ఆటోలో ఎక్కించుకుని దారిదోపిడీకి పాల్పడిన దుండగులు అదే ఫక్కీలో సాయంత్రం మండలంలోని ఉలవరపల్లి సమీపంలో తాటిపర్తి గ్రామానికి చెందిన వృద్ధురాలిని దోచుకున్నారు. నెల్లూరులో నివాసం ఉంటున్న తాటిపర్తికి చెందిన అక్కెం శివకుమారి స్వగ్రామానికి వచ్చి నెల్లూరుకు బయలుదేరింది. పొదలకూరు వచ్చేందుకు తాటిపర్తి బస్టాండ్‌లో ఆటో ఎక్కింది. అదే ఆటోలో ప్రయాణికుడు మార్గంమధ్యలో షుగర్‌ఫ్యాక్టరీ వద్ద రూ.10 ఆటో డ్రైవర్‌కు చెల్లించి దిగిపోయాడు. పయాణికుడిలా నటించి ఆటో దిగిపోయిన వ్యక్తి మరో యువకుడ్ని పల్సర్ బైక్‌లో ఎక్కించుకుని ఆటోను వెంబడించాడు. ఆటో ఉలవరపల్లి ఫారెస్ట్ నర్సరీ వద్దకు వచ్చే సమయానికి రోడ్డు మళ్లించాడు. శివకుమారి ఎక్కడికి వెళుతున్నావని ప్రశ్నించడంతో నిమ్మకాయల బస్తాలు వేసుకోవాలని డ్రైవర్ చెప్పాడు. వెంటనే వెనుక బైక్‌లో వస్తున్న ఇద్దరు ఆగంతుకులు చెట్ల మధ్యకు వచ్చి వృద్ధురాలిని బెదిరించి ఆమె చీరతో చేతులు రెండూ కట్టేసి కర్చీఫ్ నోట్లో కుక్కి బంగారు సరుడు, రెండు గాజులు, మూడు ఉంగరాలు మొత్తం 8 సవర్ల బంగారు నగలను అపహరించుకుని వెళ్లారు. బాధితురాలు రోడ్డుపైకి వచ్చి షుగర్‌ఫ్యాక్టరీ బస్సును నిలపడంతో వారు ఆమె చేతికట్లు విప్పారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై అంజిరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి గాలించారు. శివకుమారి వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. తోడేరు సమీపంలో దోపిడీకి పాల్పడిన వారే వృద్ధురాలిని దోచుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
కారు బోల్తాపడి విద్యార్థి మృతి
చిల్లకూరు : ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించడంతో మెడిసిన్‌లో సీటు వస్తుందన్న ఆనందంలో స్నేహితులతో కలిసి కారులో షికారుకు వెళ్లిన ఓ విద్యార్థి ఆ కారు అదుపు తప్పి బోల్తా పడటంతో మృతి చెందిన సంఘటన కోట క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గూడూరు పట్టణంలోని కుమ్మరవీధికి చెందిన కావలి బుజగేంద్రరావు, సత్యవాణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు పృధ్వీ (19) విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకుని ఎంసెట్ పరీక్షకు హాజరయ్యాడు. ఫలితాల్లో మంచి ర్యాంకు రావడంతో మెడిసిన్‌లో సీటు ఖాయమన్న ఆనందంలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం నలుగురు స్నేహితులతో కలిసి కారులో విద్యానగర్ వైపు వెళ్లి అక్కడ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకోనున్న సమయంలో కోట క్రాస్ రోడ్డు సమీపంలో వేగంగా వస్తున్న కారు మలుపు తిరుగుతూ అదుపు చేయలేక పోవడంతో కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. అటువైపు వెళుతున్న వారు గమనించి కారులో ఇరుక్కుని ఉన్న అందరినీ వెలికి తీశారు. పృధ్వీ తలకు తీవ్రగాయాలు కావడంతో అతన్ని వేరే వాహనంలో చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. అయితే కారులో పృధ్వీతో పాటు గాయపడిన స్నేహితులు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో వారి వివరాలను పోలీసులు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషాదంలో అధ్యాపకులు, కుటుంబ సభ్యులు పృధ్వీ తండ్రి తండ్రి బుజగేంద్రరావు ఎస్కేఆర్ అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు పృధ్వీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని విషయం తెలుసుకున్న అతని స్నేహితులు, బంధువులు, ఎస్కేఆర్ కళాశాల అధ్యాపకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పృధ్వీ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. ఒక్కగానొక్క కొడుకు త్వరలో వైద్య కళాశాలలో చేరతాడనుకుంటే మృత్యువు పాలు కావడంతో ఆ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
గమ్యం చేరని ప్రయాణాలు
జాతీయ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డెక్కిన ప్రయాణం గమ్యం చేరే పరిస్థితి కనిపించడం లేదు. గురువారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందగా, పది మంది గాయపడ్డారు. జీవన పోరాటంలో కావలి సమీపంలో ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బాతుల లారీ బోల్తాపడి కావలికి చెందిన సంచార కుటుంబానికి చెందిన తల్లీ కూతురు మృతి చెందారు. నాయుడుపేటలో జరిగే బంధువు కర్మక్రియలకు వెళుతూ ఒకే కుటుంబంలోని అవ్వ, మనుమరాలు మృత్యు ఒడికి చేరారు. కావలి, న్యూస్‌లైన్ : బాతుల లోడుతో వెళుతున్న మినీ వ్యాన్ బోల్తా పడటంతో పట్టణంలోని బాలకృష్ణారెడ్డినగర్‌కు చెందిన తల్లీ కూతుర్లు మృతి చెందిగా, తండ్రీకొడుకులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లా సరిహద్దు ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పట్టణంలోని బాలకృష్ణారెడ్డినగర్‌కు చెందిన గిరిజనులు మొగిలి రమణయ్య, అంజమ్మ (35) దంపతులు బాతులు పెంచుతూ సంచార జీవనం చేస్తుంటారు. వీరికి కుమార్తె భవాని(12), కుమారుడు చెన్నకేశవులు ఉన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలో బాతులను పెంచి సూళ్లూరుపేటలో అమ్మేందుకు బుధవారం అర్ధరాత్రి మినీ వ్యాన్‌లో బయలుదేరారు. చేవూరు రోడ్డు సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. వ్యాన్ డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ చేవూరు రోడ్డు వద్ద జాతీయ రహదారి డివైడర్ పక్కన ఉన్న మట్టి బస్తాను ఢీకొన్నాడు. దీంతో వ్యాన్ అదుపు తప్పి డివైడర్ వైపునకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అంజమ్మ, భవాని అక్కడికక్కడే మృతి చెందారు. రమణయ్య, చెన్నకేశవులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాతులు కూడా మృతి చెందాయి. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌డ్రైవర్ పరారయ్యాడు. క్షతగాత్రులిద్దరిని 108 అంబులెన్స్ సిబ్బంది కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. మినీవ్యాన్ ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంచార జీవనం చేస్తున్న కుటుంబానికి చెందిన తల్లీకూతుర్లు అంజమ్మ, భవానీ మృతి చెందటంతో బాలకృషారెడ్డినగర్లో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వారి బంధువులు, స్థానికులు కావలి ఏరియా వైద్యశాలకు తరలివచ్చారు. -
విజిలెన్స్ అధికారుల దాడులు
విజిలెన్స్ అధికారుల దాడులు తాడేపల్లి రూరల్ మండల పరిధిలోని ప్రాతూరు క్రాస్ రోడ్స్ వద్ద బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి నాలుగు ఇసుక లారీలు సీజ్ చేశారు. మొదట విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రాతూరు క్రాస్‌రోడ్స్ నుంచి అధిక సంఖ్యలో ఇసుక లారీలు తరలి వెళుతుండగా, వాటిని ఆపి ధృవపత్రాలు ఉన్నాయో, లేవోనని పరిశీలించారు. వే బిల్లులపై తేదీ ఉండడం, సరైన సమయం నమోదు చేసి ఉండకపోవడంతో ఎస్పీకి అనుమానం వచ్చి డ్రైవర్లను ప్రశ్నించారు. ఉద యం పూట ఇసుక లోడు చేసినందుకుగాను త మ వద్ద సీనరేజిగా రూ.5500 తీసుకుంటారని, అదే సాయంత్రం వే బిల్లులు లేకుండా రూ, 4800 తీసుకుంటారని తెలిపారు. నాలుగు లారీలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి విజిలెన్స్ అధికారులు గుండిమెడ ఇసుక క్వారీకి వెళ్లారు. మార్గమధ్యలో ఒక ఇసుక లోడుతో వస్తున్న లారీని ఆపగా, అధికారులను చూచి లారీ డ్రైవర్ లారీ అక్కడే వదిలివేసి పారిపోయాడు. అనంతరం ఇసుక క్వారీలోకి వెళ్లిన అధికారులు పలు విషయలపై క్వారీ నిర్వాహకులను ప్రశ్నించారు. నిర్వాహకుడిపై విజిలెన్స్ ఎస్పీ ఆగ్రహం నిబంధనలకు విరుద్దంగా వే బిల్లులపై సరైన సమయం నమోదు చేయకుండా ఇసుక లోడుల ఉదంతంపై కార్వీ నిర్వాహకుడిని విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి నిలదీశారు. గతంలో రూ. 4 కోట్ల విలువైన ఇసుక క్వారీని సామాన్య మధ్యతరగతి వారికి గృహ నిర్మాణానికిగాను ప్రభుత్వం రూ.40 లక్షలకే కేటాయించగా, అధిక ధరలకు ఇసుక విక్రయిస్తున్నారంటూ ఎస్పీ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఎగిసిన సమైక్యం
సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్య ఉద్యమం మరోమారు ఉవ్వెత్తున ఎగిసిపడింది. రెండోరోజు ఎన్జీఓ లు, సమైక్యవాదులు జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు, పాలాభిషేకాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఫ్లెక్సీలను దహనం చేశారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. నగరంలో విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో స్టోన్‌హౌస్‌పేట నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. నెల్లూరు రూరల్‌లోని చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఏపీఎన్జీఓ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా రెండో రోజు కూడా కలెక్టరేట్లో ఏపీఎన్జీఓ రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉదయగిరి నియోజక వర్గంలోని వరికుంటపాడు మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. కావలిలో ఎన్జీఓల సమ్మె రెండోరోజుకు చేరింది. ఎన్జీఓ ఆసోసియేషన్ నేతలు, ప్రజా సంఘాలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన ఎన్జీఓలు విధులను బహిష్కరించారు. ఆత్మకూరు రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది విధులను బహిష్కరించారు. గూడూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్జీఓలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. సర్వేపల్లి నియోజక వర్గంలోని ముత్తుకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం మండలాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా రెవెన్యూ కార్యాలయ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. కార్యాలయాలు వెలవెలబోయాయి. పొదలకూరులో ఎంపీడీఓ, రెవెన్యూ కార్యాలయాల ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయ తలుపులకు తాళాలు వేశారు. సూళ్లూరుపేటలోని రెవెన్యూ శాఖ పరిధిలోని కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.