చిన్నకొత్తపల్లి క్రాస్‌రోడ్ ప్రాంతం ఇదే..
అద్దంకి: చిన్నకొత్తపల్లి క్రాస్ రోడ్.. ఈ పేరు వింటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. అక్కడేదో శక్తి వచ్చేపోయే వాహనాలను ప్రమాదాలకు గురి చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో ఎవరూ చెప్పలేరు కానీ ఇదే ప్రదేశంలో లెక్కకు మించి ప్రమాదాలు సంభవించడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుంది. అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఉన్న బర్ముడా ట్రయాంగిల్ అనే ప్రదేశానికి వెళ్లిన నౌకలు.. విమానాలు మాయం అవుతున్నట్లు.. ఈ ప్రదేశానికి ఇది బర్ముడా ట్రాయంగిల్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అద్దంకి –నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారి పరిధిలో ఉన్న చిన్నకొత్తల్లి గ్రామానికి వెళ్లే మార్గం వద్ద క్రాస్ రోడ్ ఉంది. ఇది అత్యంత ప్రమాదకర ప్రదేశంగా మారింది. గత ఐదారు సంవత్సరాలుగా 50 మందికి పైగా ఇక్కడ జరిగిన వాహన ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. 150 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ప్రమాదాల నివారణ కోసం పోలీసులు తీసుకున్న స్టాప్ బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో స్పీడ్ బ్రేకర్లు వేయాలని పోలీసులు నిర్ణయించారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అటు పోలీసులకు, ఇటు వాహనదారులకు కంటిమీద కునుకు ఉండటంలేదు.
ఏడాదికి పది ప్రాణాలు
2017 జనవరి నుంచి 2018 జనవరి వరకు ఇక్కడ జరిగిన ఐదు ప్రమాదాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. 20 మంది వికలాంగులుగా మారారు.
♦ 2017 ఫిబ్రవరి 7న బైక్‌ను బస్సు ఢీకొనడంతో ఏల్చూరుకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. ఒకరికి గాయాలయ్యాయి.
♦ ఏప్రిల్ 4న మారెళ్ల గ్రామానికి చెందిన అల్లాబక్షు, అతని భార్య కరిమూన్, ప్రియాంక అనే చిన్నారి మోటారు బైకుపై మలుపు తిరుగుతుండగా వేగంగా వస్తున్న, కారు ఢీ కొట్డడంతో, ప్రియాంక మృతిచెందింది. కరిమూన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే నెలలో 29న మోటారు బైకును కారు ఢీ కొట్టినప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
♦ మే 12న మహారాష్ట్రకు చెందిన తుఫాన్ వాహనంలో ఉన్న 12 మందికి గాయాలయ్యాయి. డిసెంబరు 16వ తేదీన మోటారు బైకుపై వెళ్తున్న బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు ఇంజినీర్లను, మరో వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో ఒక యువ ఇంజినీరు అక్కడికక్కడే మృతచెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. గతంలో ఇదే క్రాస్ రోడ్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై లారీ వెళ్లడంతో నలుగురు మరణించారు. ఈ క్రమంలో పోలీసులు ఈ క్రాస్ రోడ్‌ను డేంజర్ జోన్‌గా ప్రకటించారు.
శాశ్వత పష్కారం?
ఈ క్రాస్ రోడ్ వద్ద స్పీడు బ్రేకర్లు వేసినా, స్టాప్ బోర్డులు పెట్టినా ప్రయోజనం ఉండదని, ఆవి ప్రమాదాలను మరింత పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఏదో ఒక దైవ సంబంధిత విగ్రహం ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల భక్తుల రద్దీ పెరిగి వాహనాల వేగం తగ్గుతుందంటున్నారు. ఆ దిశగా అధికారులు, గ్రామానికి చెందిన పెద్దలు ఆలోచించాలని కోరుతున్నారు.
గతంలో ఆధ్యాత్మిక ప్రాంతాల ఏర్పాటు..
గతంలో అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా ఉన్న వల్లూరమ్మ దేవస్థానం ప్రాంతం, జాతీయ రహదారిపైన బొప్పూడి వద్ద గుడుల ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను పూర్తిగా నివారించగలిగారని చెబుతున్నారు. చిన్నకొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద కూడా దేవాలయం నిర్మిస్తే నిత్యం జన సంచారంతోపాటు, ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించవచ్చు. లౌడ్ స్పీకర్ల వలన దాదపు రెండు వైపులా ఆర కిలోమీటరు మేర భక్తిపాటలు వినిపిస్తుంటాయి కాబట్టి నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లు కూడా మేల్కొనే అవకాశం ఉంటుంది. దుకాణాలు ఏర్పడటం వల్ల ఆక్కడ కాసేపు ఆగి విశ్రాంతి తీసుకొనే అవకాశం కలుగుతుంది. దైవ కృప సంగతి అటుంచితే దీనిని రద్దీగా ఉండే ప్రాదేశంగా మార్చవచ్చనేది నిపుణుల అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment