చిల్లకూరు : ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించడంతో మెడిసిన్‌లో సీటు వస్తుందన్న ఆనందంలో స్నేహితులతో కలిసి కారులో షికారుకు వెళ్లిన ఓ విద్యార్థి ఆ కారు అదుపు తప్పి బోల్తా పడటంతో మృతి చెందిన సంఘటన కోట క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గూడూరు పట్టణంలోని కుమ్మరవీధికి చెందిన కావలి బుజగేంద్రరావు, సత్యవాణి దంపతులకు ఇద్దరు పిల్లలు.
పెద్ద కుమారుడు పృధ్వీ (19) విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకుని ఎంసెట్ పరీక్షకు హాజరయ్యాడు. ఫలితాల్లో మంచి ర్యాంకు రావడంతో మెడిసిన్‌లో సీటు ఖాయమన్న ఆనందంలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం నలుగురు స్నేహితులతో కలిసి కారులో విద్యానగర్ వైపు వెళ్లి అక్కడ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు.
మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకోనున్న సమయంలో కోట క్రాస్ రోడ్డు సమీపంలో వేగంగా వస్తున్న కారు మలుపు తిరుగుతూ అదుపు చేయలేక పోవడంతో కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. అటువైపు వెళుతున్న వారు గమనించి కారులో ఇరుక్కుని ఉన్న అందరినీ వెలికి తీశారు. పృధ్వీ తలకు తీవ్రగాయాలు కావడంతో అతన్ని వేరే వాహనంలో చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. అయితే కారులో పృధ్వీతో పాటు గాయపడిన స్నేహితులు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో వారి వివరాలను పోలీసులు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విషాదంలో అధ్యాపకులు,
కుటుంబ సభ్యులు
పృధ్వీ తండ్రి తండ్రి బుజగేంద్రరావు ఎస్‌కేఆర్ అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు పృధ్వీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని విషయం తెలుసుకున్న అతని స్నేహితులు, బంధువులు, ఎస్‌కేఆర్ కళాశాల అధ్యాపకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పృధ్వీ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. ఒక్కగానొక్క కొడుకు త్వరలో వైద్య కళాశాలలో చేరతాడనుకుంటే మృత్యువు పాలు కావడంతో ఆ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
కారు బోల్తాపడి విద్యార్థి మృతి
Published Mon, Jun 30 2014 2:47 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement