చెక్కలను అందమైన ఆకృతులుగా మలిచే ఓ వడ్రంగి తన కుటుంబ జీవితాన్ని సుందరంగా మలచుకోవాలని కలలు కన్నాడు. అప్పులుచేసి సౌదీకి వెళ్లాడు. కల నెరవేరకనే గుండెపోటుతో కన్నుమూశాడు. ఇక్కడ అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. బిడ్డల బతుకు ఎలా దేవుడా అంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
బి.కొత్తకోట: బి.కొత్తకోట పోకనాటి వీధికి చెందిన ఎల్.హాషీంఖాన్ (35) వృత్తిరీత్యా కార్పెంటర్. 13ఏళ్ల కిత్రం నయీమాతో వివాహమైంది. బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాలోని ఆల్‌గస్సీమ్ బురేదాలో ఓ షేక్ వద్ద పనికి కుదిరాడు. నెలకు *15 వేల వేతనం పొందుతున్నాడు. అప్పుడప్పుడూ వచ్చి భార్యాపిల్లలతో కొన్ని రోజులు గడిపి తిరిగి వెళ్లేవాడు. ఈ ఏడాది జూలై 29న రంజాన్ పండుగకు బి.కొత్తకోటకు వచ్చాడు. భార్య, కుమార్తెలు సానియా (10), మహీరా (6), సభా (2)తో ఆనందంగా గడిపాడు. సెలవులు పూర్తి కావడంతో సౌదీకి బయలుదేరాడు. త్వరలోనే మళ్లీ వస్తానని వీడ్కోలు తీసుకున్నాడు.
అదే వారికి ఆఖరి చూపు అవుతుందని ఊహించలేదు. శుక్రవారం సాయంత్రం సౌదీ నుంచి అందిన కబురు ఆ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దుఃఖసాగరంలో ముంచెత్తింది. సాయంత్రం 4 గంటలకు హాషీంఖాన్ గుండెపోటుతో మరణించాడన్నదే ఆ కబురు సారాంశం. అతడి మృతదేహాన్ని బి.కొత్తకోటకు తీసుకొచ్చే అవకాశాలు లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ‘అమ్మీ!.. అబ్బాకు క్యా హువా హై? అబ్బా ఆతేని క్యా?’ (అమ్మా! నాన్నకేమైంది?..నాన్న రాడా?) అంటూ చిన్నారులు అమాయకంగా ప్రశ్నిస్తుంటే సమాధానం కరువవుతోంది.
‘హమ్ కో సహారా కౌన్ హై? హమ్ కైసే దీనా హై..హే భగవాన్! హమ్ కోహీ ఐసా క్యోం కర్ రహే హో’(మాకు దిక్కెవరు? ఇక ఎట్లా బతకాలి? భగవంతుడా..మాపట్ల ఎందుకిట్లా చేశావు?) పిల్లలను పట్టుకుని గుండెలవిసేలా రోదిస్తున్న నయీమాను చూసి పలువురు విచలితులయ్యారు. హాషీం పనిచేస్తున్న షేక్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడే అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఇక్కడి నుంచి న్యాయపరమైన ప్రక్రియ చేపట్టారు. హాషీం సోదరుడు, కొందరు బంధువులు సౌదీలోనే ఉండడంతో వారు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు.
పేదరికంలో పుట్టి..పెకైదిగిన జట్టి
Published Sun, Oct 12 2014 3:26 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM
Advertisement
Advertisement