‘ఎంసెట్ – 2’ కేసులో తండ్రీకూతురి విచారణ
Published Thu, Jul 28 2016 10:53 PM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM
భూపాలపల్లి : ఎంసెట్ –2 పేపర్ లీకేజీపై వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన ఓ విద్యార్థిని, ఆమె తండ్రిని సీఐడీ పోలీసులు గురువారం విచారించారు. భూపాలపల్లి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తె ఎంసెట్–1లో 15 వేలకు పైగా ర్యాంకు సాధించగా ఏపీ ఎంసెట్‌లో 20 వేలకు పైగా ర్యాంకు వచ్చింది. టీఎస్ ఎంసెట్ –2లో 704 ర్యాంకు సాధించడంతో అనుమానం తలెత్తిన కొందరు ఉత్తమ విద్యార్థుల తల్లితండ్రులు పేపర్ లీకేజీ జరిగినట్లు ఆరోపించారు.
ఈ మేరకు సీఐడీ దర్యాపు కొనసాగుతుంది. అయితే పేపర్ లీకేజీతో ర్యాంకు సాధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్టణంలోని సదరు విద్యార్థిని, ఆమె తండ్రిని గురువారం ఉదయం సీఐడీ పోలీసులు వరంగల్‌లో విచారించారు. బుధవారం సీఐడీ బృందం భూపాలపల్లికి చేరుకొని వ్యాపారిని ప్రశ్నించేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అతడు తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో వరంగల్‌కు గురువారం ఉదయమే కూతురుతో సహా రావాలని సీఐడీ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు వ్యాపారి, ఆయన కూతురు ఉదయం జిల్లా కేంద్రానికి వెళ్లగా సీఐడీ అధికారులు వారిని పూర్తి స్థాయిలో విచారించినట్లు తెలిసింది. విద్యార్థిని, ఆమె తండ్రి రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా స్థానికులు భావిస్తున్నారు.
Advertisement