సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో కీలక వ్యక్తులు ఒక్కొక్కరు బయటకు వస్తున్న తీరు సీఐడీని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నాలుగు రోజుల క్రితం వరకు సాదాసీదా మాఫియా అని భావించగా.. తాజాగా కార్పొరేట్ విద్యా సంస్థలతో నేరుగా, పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్న వారు నిందితులుగా బయటపడటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు తీరును బట్టి కీలక సూత్రదారి, ఏ1గా కమిలేశ్ కుమార్ సింగ్ అని భావించిన సీఐడీ, తాజాగా బయటపడ్డ పరిణామాలతో యూటర్న్ తీసుకుంది. కమిలేశ్ మృతి చెందడం, అతడు కాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కేసులో కీలక నిందితులుగా ఉండటంతో ఏ1గా ఎవరిని చేర్చాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఈ కేసులో కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన కీలక ఉద్యోగులు, వారి బంధువుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో సీఐడీ అన్ని కోణాల్లో విచారణ మొదలుపెట్టింది.
ఇక్కడ ప్రశ్నలు.. అక్కడ ప్రింటింగ్
హైదరాబాద్ జేఎన్‌టీయూలో రూపొందించిన ప్రశ్నపత్రం ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీకైంది. ఈ ప్రశ్నపత్రం రూపొందించడానికి మూడు నెలల ముందు నుంచే ఓ మాఫియా ప్రతిక్షణం ప్రశ్నపత్రాన్ని ఫాలో అప్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రశ్నపత్రం రూపొందించడం పూర్తవడం, ప్రింటింగ్ ప్రెస్‌కు పలానా రోజు వస్తుందని తెలుసుకోవడం, ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే అటెండర్ రావత్ దాన్ని బయటకు తేవడం వెనుక తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే ఉన్నారని సీఐడీ తాజాగా> నిర్ధారణకు వచ్చింది. ప్రశ్నపత్రం, సంబంధిత వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న ఇక్కడి వ్యక్తులే దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉన్న కమిలేశ్ గ్యాంగ్‌కు పని అప్పగించి ఉంటారని సీఐడీ అనుమానిస్తోంది. జేఎన్‌టీయూ నుంచి ప్రశ్నపత్రానికి సంబంధించి వివరాలు వెల్లడించడానికి ఓ కార్పోరేట్ విద్యా సంస్థ భారీగా డబ్బులు ముట్టజెప్పిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు కార్పొరేట్ కాలేజీలకు విద్యార్థులను చేర్పించే బ్రోకర్‌గా పని చేస్తున్న వ్యక్తి డబ్బు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కోసం సీఐడీ అన్వేషణ మొదలుపెట్టింది. ప్రశ్నపత్రం ఎవరికి అవసరం? ఇది అందుకున్న విద్యార్థులు ఏయే కళాశాలల్లో చదివారు? వారికి ప్రత్యేకంగా క్యాంపుల్లో శిక్షణ ఇచ్చిందెవరన్న కోణంలో దర్యాప్తు మొదలైంది.
ఇక్బాల్.. కమిలేశ్.. ???..
ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు ప్రాథమిక విచారణలో తేలిన అంశాల ఆధారంగా 2016లో ఏ1గా మహ్మద్ ఇక్బాల్ ఖాన్ అని భావించారు. కానీ అతడి అరెస్ట్ జరిగిన తర్వాత నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. పాత్రధారులు, సూత్రధారులు, బ్రోకర్లు... ఇలా నిందితుల జాబితా 90కి చేరింది. దీనితో ముందుగా కేసులో ఉన్న వారందరిని అరెస్ట్ చేసి వారి వాంగ్మూలం తీసుకుని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే లింకుల ద్వారా ఏ1 నిందితుడిని గుర్తించాలని భావించారు. దీనికి తగ్గట్టుగానే 2017 ఏప్రిల్ 16న అరెస్టయిన శివబహుదూర్ సింగ్ అలియాస్ ఎస్బీసింగ్ లింకుతో ఏ1గా కమిలేశ్ అని నిర్ధారణకు వచ్చారు. కానీ కమిలేశ్ విచారణ, మృతి తర్వాత మరికొంత మందిని సీఐడీ అరెస్ట్ చేసింది. ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. గత దర్యాప్తు అంశాలకు తాజా దర్యాప్తు పరిణామాలకు పొంతన లేకపోవడంతో సీఐడీ అధికారులు కంగుతిన్నారు. శ్రీచైతన్య కాలేజీ మాజీ డీన్, నారాయణ కాలేజ్ ఏజెంట్ అరెస్ట్ తర్వాత ప్రశ్నపత్రం లింకు మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచే బయటపడినట్టు తెలుసుకొని ఏ1 ఎవరన్న దానిపై విశ్లేషణ చేస్తున్నారు.
మార్చుకోవచ్చు..
కేసు దర్యాప్తు తుది దశకు చేరే నాటికి కీలక నిందితుడు ఎవరో తేల్చి, చార్జిషీట్ సమయంలో ఏ1 నిందితుడి పేరుతో ఎఫ్‌ఐఆర్ సవరించుకునే అధికారం సంబంధిత దర్యాప్తు అధికారికి ఉంటుంది. ఇప్పుడు సీఐడీ కూడా అదే చేయబోతోంది. దాదాపు 100కు చేరువవుతున్న నిందితుల జాబితా వరుస క్రమాన్ని కూడా ఆధారాల ద్వారా ఓ క్రమపద్ధతికి తీసుకువచ్చి చార్జిషీట్ దాఖలు సమయంలో కోర్టుకు తెలపనుంది.
ప్రింటింగ్ ప్రెస్‌లో ఆ పేపరే ఎలా?
దేశవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో సెక్యూరిటీ ప్రింటింగ్‌లకు అనుమతులుంటాయి. అందులో కొన్నింటికి కీలకమైన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలకు టెండర్లు దాఖలు చేసి, ఆడిటింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రింటింగ్ ఆర్డర్ ఇస్తారు. సంబంధిత ప్రింటింగ్ ప్రెస్‌లు చాలా పకడ్బందీగా, అత్యంత భద్రత నడుమ, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయి. ఎంసెట్ ప్రశ్నపత్రం ప్రింటైన న్యూఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న అటెండర్ రావత్ పెద్దగా చదువుకోలేదని సీఐడీ గుర్తించింది.
మరి అలాంటి వ్యక్తి కేవలం తెలంగాణకు చెందిన ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాన్ని తీసుకువచ్చి నిందితులకు ఎలా ఇచ్చాడు? తెలుగు వ్యక్తులకు సంబంధం లేకుండా ప్రశ్నపత్రాన్ని అంత సులభంగా బయటకు ఎలా తెచ్చాడు? అనే దానిపై ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. తొలుత రావత్‌కు ప్రశ్నపత్రం ఇచ్చిన వ్యక్తి, ఆ తర్వాత ఆదే ప్రశ్నపత్రాన్ని కమిలేశ్‌కు ఇచ్చి క్యాంపు నడపాలని చెప్పిన వ్యక్తి.. ఒకరేనని సీఐడీ అనుమానిస్తోంది. ఈ రెండు పనులు పూర్తి చేసిన వ్యక్తే కేసులో ఏ1గా ఉంటాని సీఐడీ ఉన్నతాధికారులు తేల్చిచెబుతున్నారు. ప్రశ్నపత్రం తయారీ, లీక్ కుట్ర, ప్రింటింగ్ ప్రెస్, పేపర్ బయటకు తేవడం, కమిలేశ్‌కు ఇవ్వడం.. ఇవన్నీ చేసింది ఒకరే కాబట్టి ఏ1గా సంబంధిత వ్యక్తే అవుతాడని న్యాయ సలహా సైతం సీఐడీ తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment