EAMCET leakage case
-
పాత నోట్లు.. కొత్త పాట్లు!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కేసు దర్యాప్తు సీఐడీ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. నిందితులను పట్టుకునేందుకు యూపీ, ఢిల్లీ, బిహార్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా మొత్తం 8 రాష్ట్రాల్లో వేట సాగించాల్సి వచ్చింది. దీనికితోడు ఆధారాల సేకరణ మరింత కష్టంగా మారింది. కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశంలో గాలింపు చేపట్టిన సీబీఐ మరోవైపు తెలంగాణ, ఆంధ్రాలో నిందితుల వేటను ఉధృతం చేసింది. అదే సమయంలో కస్టడీలో ఉన్న కమిలేశ్ సింగ్ (55) గుండెనొప్పితో చనిపోయాడు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలొచ్చాయి. అతనిచ్చిన సమాచారంతో పోలీసులు స్థానికంగా వారి ఏజెంట్లను కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సీఐడీ పోలీసులకు అనుకోని అవాంతరం వచ్చిపడింది. పట్టుకున్నవన్నీ పాతనోట్లే..: రూ.50 లక్షల్లో అధిక శాతం రూ.500, రూ.1000 నోట్ల కట్టలే. అన్నీ కూడా రద్దయిన నోట్లు. నిందితులు కూడా వాటిని మార్చలేక ఏం చేయాలో పాలుపోక వారి వద్దే అట్టిపెట్టుకున్నారు. అదే సమయంలో పోలీసులు వారిపై దాడులు నిర్వహించి భారీ ఎత్తున నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు, నగదును కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమయ్యారు. ఎందుకైనా మంచిదని న్యాయనిపుణుల వద్ద సలహా తీసుకున్నారు. రద్దయిన నోట్లను కోర్టులో ఎలా సమర్పిస్తారన్న సందేహం లేవనెత్తారు. అదే సమయంలో విధించిన ఆర్బీఐ గడువు ముంచుకొస్తోంది. పిడుగులాంటి ఈ విషయం మీద పడేసరికి ఏం చేయాలో పాలుపోక పోలీసులు తలలు పట్టుకున్నారు. అంతపెద్ద మొత్తాన్ని మార్చడానికి ఏ బ్యాంకూ ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక నానాతిప్పలు పడ్డారు. చివరికి గడువులోగా నోట్లు మార్చి నగదును కోర్టుకు సమర్పించగలిగారు. -
రెండున్నరేళ్ల తర్వాత గుర్తించారు..
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో రెండున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో జరిగిన ఎంసెట్ స్కాంలో సీఐడీ అధికారుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దర్యాప్తు అధికారులు బెంగళూరులో ఎంసెట్ లీక్ క్యాంపు కేంద్రాన్ని గుర్తించారు. 16 మంది విద్యార్థులను హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి బెంగళూరులోని ఓ ప్రైవేట్ భవనంలో లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. ఎంసెట్ కేసులో ఎప్పుడో అరెస్టయిన నిందితుడు అషుతోశ్ ఈ క్యాంపును నడిపించినట్టు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. కేసు దర్యాప్తు మూడేళ్లకు చేరువవుతున్న తరుణంలో కీలక ఆధారాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ కేసులో గతంలో దర్యాప్తు చేసిన అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. కేసులో ఏం జరుగుతోంది..? ప్రశ్నపత్రం లీక్ వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి దర్యాప్తు అధికారులు సరైన వ్యూహంతో వ్యవహరించకపోవడం ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. నిందితుల కాల్‌డేటా వివరాలు బయటకు తీయడం దర్యాప్తు అధికారులకు కష్టసాధ్యంగా మారినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లు ఏడాదిలోపున్న కాల్‌డేటా వివరాలను మాత్రమే దర్యాప్తు సంస్థకు అందించవచ్చు. ఏడాది దాటితే వాటిని బయటకు తేవడం సులభకాకపోవడంతో ఇప్పుడు అధికారులు తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయారు. ఈ కేసులో ఇప్పటికే 74 మందిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేయాలంటే ఈ డేటా వివరాలు తప్పనిసరని భావిస్తున్నారు. అదే విధంగా కేసు తుదిదశలో ఉన్న సందర్భంలో కార్పొరేట్ కాలేజీల వ్యవహారం బయటపడటం, క్యాంపు నిర్వహించిన ప్రాంతం వెలుగులోకి రావడం, విద్యార్థులు ముందుకు వచ్చి వాంగ్మూలాలు ఇస్తుండటం సంచలనం రేపుతోంది. ఇంకా ఈ కేసు ఎన్నాళ్లు దర్యాప్తు చేస్తారు? ఎవరిని కటకటాల్లోకి పంపుతారు? ఎవరి ఒత్తిడికైనా తలొగ్గుతారా? అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. -
ఎంసెట్ ‘ప్రశ్నపత్రం లీకేజీ’లో ట్విస్ట్
-
ఎంసెట్ కేసులో ఏ-1 ఎవరు?
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో కీలక వ్యక్తులు ఒక్కొక్కరు బయటకు వస్తున్న తీరు సీఐడీని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నాలుగు రోజుల క్రితం వరకు సాదాసీదా మాఫియా అని భావించగా.. తాజాగా కార్పొరేట్ విద్యా సంస్థలతో నేరుగా, పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్న వారు నిందితులుగా బయటపడటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు తీరును బట్టి కీలక సూత్రదారి, ఏ1గా కమిలేశ్ కుమార్ సింగ్ అని భావించిన సీఐడీ, తాజాగా బయటపడ్డ పరిణామాలతో యూటర్న్ తీసుకుంది. కమిలేశ్ మృతి చెందడం, అతడు కాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కేసులో కీలక నిందితులుగా ఉండటంతో ఏ1గా ఎవరిని చేర్చాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఈ కేసులో కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన కీలక ఉద్యోగులు, వారి బంధువుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో సీఐడీ అన్ని కోణాల్లో విచారణ మొదలుపెట్టింది. ఇక్కడ ప్రశ్నలు.. అక్కడ ప్రింటింగ్ హైదరాబాద్ జేఎన్టీయూలో రూపొందించిన ప్రశ్నపత్రం ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీకైంది. ఈ ప్రశ్నపత్రం రూపొందించడానికి మూడు నెలల ముందు నుంచే ఓ మాఫియా ప్రతిక్షణం ప్రశ్నపత్రాన్ని ఫాలో అప్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రశ్నపత్రం రూపొందించడం పూర్తవడం, ప్రింటింగ్ ప్రెస్‌కు పలానా రోజు వస్తుందని తెలుసుకోవడం, ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే అటెండర్ రావత్ దాన్ని బయటకు తేవడం వెనుక తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే ఉన్నారని సీఐడీ తాజాగా> నిర్ధారణకు వచ్చింది. ప్రశ్నపత్రం, సంబంధిత వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న ఇక్కడి వ్యక్తులే దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న కమిలేశ్ గ్యాంగ్‌కు పని అప్పగించి ఉంటారని సీఐడీ అనుమానిస్తోంది. జేఎన్టీయూ నుంచి ప్రశ్నపత్రానికి సంబంధించి వివరాలు వెల్లడించడానికి ఓ కార్పోరేట్ విద్యా సంస్థ భారీగా డబ్బులు ముట్టజెప్పిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు కార్పొరేట్ కాలేజీలకు విద్యార్థులను చేర్పించే బ్రోకర్‌గా పని చేస్తున్న వ్యక్తి డబ్బు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కోసం సీఐడీ అన్వేషణ మొదలుపెట్టింది. ప్రశ్నపత్రం ఎవరికి అవసరం? ఇది అందుకున్న విద్యార్థులు ఏయే కళాశాలల్లో చదివారు? వారికి ప్రత్యేకంగా క్యాంపుల్లో శిక్షణ ఇచ్చిందెవరన్న కోణంలో దర్యాప్తు మొదలైంది. ఇక్బాల్.. కమిలేశ్.. ???.. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు ప్రాథమిక విచారణలో తేలిన అంశాల ఆధారంగా 2016లో ఏ1గా మహ్మద్ ఇక్బాల్ ఖాన్ అని భావించారు. కానీ అతడి అరెస్ట్ జరిగిన తర్వాత నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. పాత్రధారులు, సూత్రధారులు, బ్రోకర్లు... ఇలా నిందితుల జాబితా 90కి చేరింది. దీనితో ముందుగా కేసులో ఉన్న వారందరిని అరెస్ట్ చేసి వారి వాంగ్మూలం తీసుకుని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే లింకుల ద్వారా ఏ1 నిందితుడిని గుర్తించాలని భావించారు. దీనికి తగ్గట్టుగానే 2017 ఏప్రిల్ 16న అరెస్టయిన శివబహుదూర్ సింగ్ అలియాస్ ఎస్బీసింగ్ లింకుతో ఏ1గా కమిలేశ్ అని నిర్ధారణకు వచ్చారు. కానీ కమిలేశ్ విచారణ, మృతి తర్వాత మరికొంత మందిని సీఐడీ అరెస్ట్ చేసింది. ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. గత దర్యాప్తు అంశాలకు తాజా దర్యాప్తు పరిణామాలకు పొంతన లేకపోవడంతో సీఐడీ అధికారులు కంగుతిన్నారు. శ్రీచైతన్య కాలేజీ మాజీ డీన్, నారాయణ కాలేజ్ ఏజెంట్ అరెస్ట్ తర్వాత ప్రశ్నపత్రం లింకు మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచే బయటపడినట్టు తెలుసుకొని ఏ1 ఎవరన్న దానిపై విశ్లేషణ చేస్తున్నారు. మార్చుకోవచ్చు.. కేసు దర్యాప్తు తుది దశకు చేరే నాటికి కీలక నిందితుడు ఎవరో తేల్చి, చార్జిషీట్ సమయంలో ఏ1 నిందితుడి పేరుతో ఎఫ్ఐఆర్ సవరించుకునే అధికారం సంబంధిత దర్యాప్తు అధికారికి ఉంటుంది. ఇప్పుడు సీఐడీ కూడా అదే చేయబోతోంది. దాదాపు 100కు చేరువవుతున్న నిందితుల జాబితా వరుస క్రమాన్ని కూడా ఆధారాల ద్వారా ఓ క్రమపద్ధతికి తీసుకువచ్చి చార్జిషీట్ దాఖలు సమయంలో కోర్టుకు తెలపనుంది. ప్రింటింగ్ ప్రెస్‌లో ఆ పేపరే ఎలా? దేశవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో సెక్యూరిటీ ప్రింటింగ్‌లకు అనుమతులుంటాయి. అందులో కొన్నింటికి కీలకమైన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలకు టెండర్లు దాఖలు చేసి, ఆడిటింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రింటింగ్ ఆర్డర్ ఇస్తారు. సంబంధిత ప్రింటింగ్ ప్రెస్‌లు చాలా పకడ్బందీగా, అత్యంత భద్రత నడుమ, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయి. ఎంసెట్ ప్రశ్నపత్రం ప్రింటైన న్యూఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న అటెండర్ రావత్ పెద్దగా చదువుకోలేదని సీఐడీ గుర్తించింది. మరి అలాంటి వ్యక్తి కేవలం తెలంగాణకు చెందిన ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాన్ని తీసుకువచ్చి నిందితులకు ఎలా ఇచ్చాడు? తెలుగు వ్యక్తులకు సంబంధం లేకుండా ప్రశ్నపత్రాన్ని అంత సులభంగా బయటకు ఎలా తెచ్చాడు? అనే దానిపై ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. తొలుత రావత్‌కు ప్రశ్నపత్రం ఇచ్చిన వ్యక్తి, ఆ తర్వాత ఆదే ప్రశ్నపత్రాన్ని కమిలేశ్‌కు ఇచ్చి క్యాంపు నడపాలని చెప్పిన వ్యక్తి.. ఒకరేనని సీఐడీ అనుమానిస్తోంది. ఈ రెండు పనులు పూర్తి చేసిన వ్యక్తే కేసులో ఏ1గా ఉంటాని సీఐడీ ఉన్నతాధికారులు తేల్చిచెబుతున్నారు. ప్రశ్నపత్రం తయారీ, లీక్ కుట్ర, ప్రింటింగ్ ప్రెస్, పేపర్ బయటకు తేవడం, కమిలేశ్‌కు ఇవ్వడం.. ఇవన్నీ చేసింది ఒకరే కాబట్టి ఏ1గా సంబంధిత వ్యక్తే అవుతాడని న్యాయ సలహా సైతం సీఐడీ తీసుకుంది. -
ఎంసెట్ లీకేజీలో డాక్టర్లు !
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కేసును తవ్వేకొద్దీ విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య విద్య అభ్యసించి ఆ వృత్తిలో బోధకులుగా పని చేస్తున్నవారే ఈ స్కాంలో కీలక పాత్ర పోషించినట్టు తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్ ప్రశ్నపత్రాలు లీక్ చేసిన అప్పటి నిందితులే తెలంగాణ ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో కార్పొరేట్ విద్యా సంస్థలతో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. కార్పొరేట్ కాలేజీలతోపాటు బ్రోకర్ల నుంచి వచ్చే సొమ్ము కోసం కక్కుర్తి పడ్డట్టు సమాచారం. ప్రశ్నపత్రాల విక్రయంతో కోట్లు వచ్చి పడుతుండటంతో కొంతకాలంగా ఈ దందా యథేచ్ఛగా నడుస్తున్నట్లు సీఐడీ విచారణలో వెలుగు చూస్తోంది. కుట్రకు బీజం అప్పుడే.. బెంగళూరుకు చెందిన రాజగోపాల్‌రెడ్డి.. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రశ్నపత్రం లీకైనా విన్పించే పేరిది! 2013–14 ఎన్టీఆర్ వైద్య, విద్య పీజీమెట్ ప్రశ్నపత్రం లీక్ చేసింది ఇతడేనన్న ఆరోపణలున్నాయి. ఇతడితో సంబంధాలున్న డాక్టర్ ధనుంజయ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్ లీక్ చేసినట్టు తాజాగా సీఐడీ దర్యాప్తులో తేలింది. పట్నాకు చెందిన ధనుంజయ్ కర్ణాటకలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసించాడు. ఇతడితో చదువుకున్న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సందీప్.. తెలంగాణ ఎంసెట్ లీకేజీలో కీలక పాత్ర పోషించాడు. ప్రశ్నపత్రం లీక్ చేసి బిహార్ గ్యాంగ్‌ల ద్వారా ఇతడు క్యాంపులు నడిపినట్టు తేలింది. లీకైన ఈ ప్రశ్నపత్రం కోసం ఓ ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థ తీవ్రంగా యత్నించింది. చివరికి ఓ వ్యక్తి ద్వారా సంపాదించింది. మరో కార్పొరేట్ విద్యాసంస్థ డీన్ (ఈయన హైదరాబాద్ సంజీవరెడ్డినగర్ ప్రాంతలో కాలేజీలకు ఇన్చార్జ్) కూడా విశ్వప్రయత్నం చేసినట్లు తెలిసింది. మరో 26 కాలేజీలు.. ఎంసెట్ నిర్వహణకు కమిటీ వేసి ప్రశ్నలు రూపొందించే నోడల్ యూనివర్సిటీ అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రశ్నలు రూపొందించడం, ప్రింటింగ్‌కు ఎక్కడ ఇస్తున్నారో తెలుసుకోవడం, ప్రశ్నపత్రాల రూపకల్పనలో తమ కాలేజీకి చెందిన లెక్చరర్లు ఉండేలా రెండు కార్పొరేట్ కాలేజీలు కుట్రకు పాల్పడట్టు సీఐడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. శ్రీచైతన్య కాలేజీ డీన్ అరెస్ట్ తర్వాత ఈ కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. గుంటూరుకు చెందిన శివనారాయణ కేవలం చైతన్య, నారాయణ కాలేజీలే కాకుండా మరో 26 ప్రముఖ కాలేజీలకు విద్యార్థులను పంపడం, ఎంసెట్‌లాంటి వాటిల్లో మంచి ర్యాంకులు తెప్పించే బాధ్యత మాదేనంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు వాగ్దానంచేయడం వెనుక రహస్యం కూడా ఇదేనని సీఐడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఎంసెట్ నిర్వహణలో ప్రతీచోట ఏజెంట్లుగా తమ మనుషులను రెండు కార్పొరేట్ కాలేజీలు నియమించుకున్నట్టు డీన్ విచారణలో బయటపడింది. ‘‘ఈ మొత్తం వ్యవహారంలో మరిన్ని చేదు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. వాటన్నీటిని క్రోడీకరించే పనిలో ఉన్నాం’అని సీఐడీ అధికారి ఒకరు చెప్పారు. అందుకే ర్యాంకులు? నీట్ అమలుకు ముందు ప్రతీ రాష్ట్రంలో జరిగే మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ కుట్ర మొత్తం కర్ణాటకలోని దావనగిరి యూనివర్సిటీ నుంచి సాగినట్టు సీఐడీ తాజా విచారణలో బయటపడింది. ఈ యూనివర్సిటీలో వైద్యవిద్య చదివిన డాక్టర్ ధనుంజయ్ బ్యాచ్ మొత్తం ఇదే కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు సీఐడీ గుర్తించింది. ప్రతీ ఏటా ఒక్కో ఎంట్రెన్స్‌ను టార్గెట్ చేసుకొని ధనుంజయ్ గ్యాంగ్ రూ.50 కోట్ల మేర వసూలు చేసినట్టు అధికారులు వెలుగులోకి తెచ్చారు. రెండు కార్పొరేట్ కాలేజీల్లో చదివే మెరికల్లాంటి విద్యార్థులను ఎంచుకొని వారికి లీక్ చేసిన ప్రశ్నపత్రంపై శిక్షణ ఇప్పించినట్టు తేలింది. ఏ ఇతర కాలేజీలకు రాని ర్యాంకులు ఈ రెండు కాలేజీలకే రావడం వెనుకున్న ఆసలు రహస్యం ఇదేనని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే సీఐడీ అరెస్ట్ చేసిన శ్రీచైతన్య డీన్ వాసుబాబు, ఏజెంట్ శివనారాయణ చెప్పిన అంశాలు సరిపోలాయని సీఐడీ తేల్చింది. వారికి మళ్లీ శ్రీముఖాలు ఎంసెట్ నిర్వహణకు సంబంధించి డీన్ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై సంబంధిత అధికారులు శ్రీముఖాలు జారీ చేయాలని సీఐడీ భావిస్తోంది. ప్రశ్నపత్రాలు రూపొందించిన వారి పూర్తి జాబితా, ప్రింటింగ్ ప్రెస్‌తో జరిగిన ఒప్పంద పత్రాలు తదితర వివరాలను సేకరించి మరోసారి విచారణ జరపాలని యోచిస్తోంది. గతంలో ఎంసెట్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అధికారిని విచారించినా పెద్దగా ఆధారాలు లభించలేదు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా విచారిస్తే లీకేజీ కుట్రలో కీలకమైన ప్రింటింగ్ ప్రెస్ విషయం లింక్ బయటపడుతుందని సీఐడీ భావిస్తోంది. -
ఎస్బీ సింగ్‌ను కస్టడీకి అప్పగించండి
ప్రత్యేక కోర్టును కోరిన సీఐడీ.. 24కు కేసు వాయిదా.. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితుడు శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీ సింగ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని ప్రత్యేక కోర్టును సీఐడీ కోరింది. లీకేజీలో ఎస్బీ సింగ్‌ను 10 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించింది. ‘లీకేజీకి ఎవరు కుట్రపన్నారు. ఇందుకు సహకరించిన వారెవరు. విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధం ఉందా?’ అనే విషయాలు రాబట్టేందుకు ఎస్బీ సింగ్‌ను కస్టడీలో విచారించాల్సి ఉందని సీఐడీ తరఫు న్యాయవాది నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈనెల 24న వెలువరిస్తానని పేర్కొన్నారు. యూనివర్సిటీ నిర్లక్ష్యంపై నివేదిక ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో జేఎన్టీయూ నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదికివ్వాలని సీఐడీ భావిస్తోంది. 2005 నుంచి ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీకైన విషయం తెలుసుకోకుండా ప్రింటింగ్‌కు ఇవ్వడంపై ప్రభుత్వానికి నివేదించాలని సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ భావిస్తున్నారు. -
ఎంసెట్ లీకేజీ రాకెట్ @ ఢిల్లీ
-
ఎంసెట్ లీకేజీ రాకెట్ @ ఢిల్లీ
► ప్రధాన సూత్రధారులు నలుగురు.. ► బ్రోకర్లు 34 మంది ► 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రమేయం ► ఎంసెట్-2పై సీఐడీ దర్యాప్తు వివరాలను వెల్లడించిన సీఎం.. ► గత్యంతరం లేకే మళ్లీ పరీక్ష ► లీకేజీపై ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్-2 పేపర్ లీకేజీ ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా విస్తరించిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునీల్ సింగ్, ఇక్బాల్‌లను ఇందులో ప్రధాన సూత్రధారులుగా గుర్తించింది. మొత్తం 34 మంది బ్రోకర్లు ఈ లీకేజీ వ్యవహారంలో కుట్రదారులుగా ఉన్నారని.. వీరిలో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. మరో ఆరుగురి ఆచూకీ లభ్యమైందని, ఏ క్షణంలోనైనా వారిని అరెస్టు చేస్తామని తెలిపింది. దాదాపు 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులు బ్రోకర్లతో సంప్రదింపులు జరిపి పేపర్ లీకేజీ కుట్రలో పాలుపంచుకున్నట్లుగా పేర్కొంది. ఎంసెట్-2 లీకేజీకి సంబంధించి సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన పలు అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా వెల్లడించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎంసెట్ లీకేజీపై సీఎం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్ తివారి, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, సీఐడీ ఐజీ సౌమ్యమిశ్రా, సీఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. బాధాకరమే.. అయినా తప్పడం లేదు! ఎంసెట్ ప్రశ్నపత్రాలు లీక్ కావటం అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన సంఘటన అని సీఎం ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకైన నేపథ్యంలో మరో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మళ్లీ ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కొద్దిమంది చేసిన తప్పుకు వేల మంది విద్యార్థులను ఇబ్బంది పెట్టి మరోసారి పరీక్ష రాయించటం బాధాకరమే అయినా తప్పడం లేదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహృదయంతో పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దీన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని, అనవసరంగా ఆందోళన చెంది విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని పేర్కొన్నారు. జరగకూడనిది జరిగినప్పుడు కొంత మందికి ఇబ్బంది తప్పదని, సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ఆందోళనతో సమయాన్ని వృథా చేసుకునే బదులు పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పరీక్షకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎంసెట్ నిర్వహణ బాధ్యతను మళ్లీ జేఎన్టీయూహెచ్కే అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని జేఎన్టీయూ వీసీని ఆదేశించారు. పాత హాల్ టికెట్లతోనే విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తున్నందున సరిపడేన్ని ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసి, ముందుగానే విద్యార్థులకు సమాచారం అందించాలని సూచించారు. ఎంసెట్-2కు దరఖాస్తున్నవారందరికీ ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించాలన్నారు. అవసరమైనచోట ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. విద్యార్థులు ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యేందుకు జేఎన్టీయూ వెబ్సైట్లో స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ విత్ ఆన్సర్స్, ఇతర సమాచారం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిందితులను వదలొద్దు వేలాది మంది విద్యార్థుల మనోవేదనకు కారణమైన ఎంసెట్ పేపర్ల లీకేజీ వ్యవహరంలో పకడ్బందీగా దర్యాప్తు జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా, ఎక్కడున్నా అరెస్ట్ చేసి విచారించాలని చెప్పారు. మళ్లీ పేపర్ల లీకేజీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలుండాలని చెప్పారు. బ్రోకర్లతో చేతులు కలిపిన విద్యార్థుల తల్లిదండ్రులపై చట్ట ప్రకారం వ్యవహరించాలని ఆదేశించారు. సుప్రీం తీర్పు మేరకే నిర్ణయం ప్రశ్నపత్రాల లీకేజీ జరిగినప్పుడు గతంలో ఎలా వ్యవహరించారు? ఇప్పుడెలా వ్యవహరించాలి? ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై సీఎం విస్తృతంగా చర్చించారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 70 సందర్భాల్లో ప్రధాన పరీక్షలకు సంబంధించిన పశ్నపత్రాలు లీక్ అయ్యాయని, అన్ని సందర్భాల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించారని అధికారులు వెల్లడించారు. గతంలో వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సీఎం తెప్పించుకుని పరిశీలించారు. దాదాపు అన్ని సందర్భాల్లో కోర్టులు మళ్లీ పరీక్ష పెట్టాలనే సూచనలు, ఆదేశాలే ఇచ్చినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.