
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కేసు దర్యాప్తు సీఐడీ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. నిందితులను పట్టుకునేందుకు యూపీ, ఢిల్లీ, బిహార్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా మొత్తం 8 రాష్ట్రాల్లో వేట సాగించాల్సి వచ్చింది. దీనికితోడు ఆధారాల సేకరణ మరింత కష్టంగా మారింది. కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశంలో గాలింపు చేపట్టిన సీబీఐ మరోవైపు తెలంగాణ, ఆంధ్రాలో నిందితుల వేటను ఉధృతం చేసింది. అదే సమయంలో కస్టడీలో ఉన్న కమిలేశ్ సింగ్ (55) గుండెనొప్పితో చనిపోయాడు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలొచ్చాయి. అతనిచ్చిన సమాచారంతో పోలీసులు స్థానికంగా వారి ఏజెంట్లను కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సీఐడీ పోలీసులకు అనుకోని అవాంతరం వచ్చిపడింది.
పట్టుకున్నవన్నీ పాతనోట్లే..: రూ.50 లక్షల్లో అధిక శాతం రూ.500, రూ.1000 నోట్ల కట్టలే. అన్నీ కూడా రద్దయిన నోట్లు. నిందితులు కూడా వాటిని మార్చలేక ఏం చేయాలో పాలుపోక వారి వద్దే అట్టిపెట్టుకున్నారు. అదే సమయంలో పోలీసులు వారిపై దాడులు నిర్వహించి భారీ ఎత్తున నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు, నగదును కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమయ్యారు. ఎందుకైనా మంచిదని న్యాయనిపుణుల వద్ద సలహా తీసుకున్నారు. రద్దయిన నోట్లను కోర్టులో ఎలా సమర్పిస్తారన్న సందేహం లేవనెత్తారు. అదే సమయంలో విధించిన ఆర్‌బీఐ గడువు ముంచుకొస్తోంది. పిడుగులాంటి ఈ విషయం మీద పడేసరికి ఏం చేయాలో పాలుపోక పోలీసులు తలలు పట్టుకున్నారు. అంతపెద్ద మొత్తాన్ని మార్చడానికి ఏ బ్యాంకూ ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక నానాతిప్పలు పడ్డారు. చివరికి గడువులోగా నోట్లు మార్చి నగదును కోర్టుకు సమర్పించగలిగారు.