ఎంసెట్ లీకేజీ రాకెట్ @ ఢిల్లీ | cm kcr speaks over eamcet leakage case details | Sakshi
Sakshi News home page

ఎంసెట్ లీకేజీ రాకెట్ @ ఢిల్లీ

Published Wed, Aug 3 2016 2:26 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

ఎంసెట్ లీకేజీ రాకెట్ @ ఢిల్లీ - Sakshi

ఎంసెట్ లీకేజీ రాకెట్ @ ఢిల్లీ

ప్రధాన సూత్రధారులు నలుగురు..
బ్రోకర్లు 34 మంది
200 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రమేయం
ఎంసెట్-2పై సీఐడీ దర్యాప్తు వివరాలను వెల్లడించిన సీఎం..
గత్యంతరం లేకే మళ్లీ పరీక్ష
లీకేజీపై ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష
 
సాక్షి, హైదరాబాద్ :
ఎంసెట్-2 పేపర్ లీకేజీ ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా విస్తరించిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునీల్ సింగ్, ఇక్బాల్‌లను ఇందులో ప్రధాన సూత్రధారులుగా గుర్తించింది. మొత్తం 34 మంది బ్రోకర్లు ఈ లీకేజీ వ్యవహారంలో కుట్రదారులుగా ఉన్నారని.. వీరిలో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. మరో ఆరుగురి ఆచూకీ లభ్యమైందని, ఏ క్షణంలోనైనా వారిని అరెస్టు చేస్తామని తెలిపింది. దాదాపు 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులు బ్రోకర్లతో సంప్రదింపులు జరిపి పేపర్ లీకేజీ కుట్రలో పాలుపంచుకున్నట్లుగా పేర్కొంది. ఎంసెట్-2 లీకేజీకి సంబంధించి సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన పలు అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా వెల్లడించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎంసెట్ లీకేజీపై సీఎం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్ తివారి, జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, సీఐడీ ఐజీ సౌమ్యమిశ్రా, సీఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.
 
బాధాకరమే.. అయినా తప్పడం లేదు!
ఎంసెట్ ప్రశ్నపత్రాలు లీక్ కావటం అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన సంఘటన అని సీఎం ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకైన నేపథ్యంలో మరో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మళ్లీ ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కొద్దిమంది చేసిన తప్పుకు వేల మంది విద్యార్థులను ఇబ్బంది పెట్టి మరోసారి పరీక్ష రాయించటం బాధాకరమే అయినా తప్పడం లేదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహృదయంతో పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దీన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని, అనవసరంగా ఆందోళన చెంది విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని పేర్కొన్నారు. జరగకూడనిది జరిగినప్పుడు కొంత మందికి ఇబ్బంది తప్పదని, సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ఆందోళనతో సమయాన్ని వృథా చేసుకునే బదులు పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

పరీక్షకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
 ఎంసెట్ నిర్వహణ బాధ్యతను మళ్లీ జేఎన్‌టీయూహెచ్‌కే అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని జేఎన్‌టీయూ వీసీని ఆదేశించారు. పాత హాల్ టికెట్లతోనే విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తున్నందున సరిపడేన్ని ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసి, ముందుగానే విద్యార్థులకు సమాచారం అందించాలని సూచించారు. ఎంసెట్-2కు దరఖాస్తున్నవారందరికీ ఆన్‌లైన్లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించాలన్నారు. అవసరమైనచోట ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. విద్యార్థులు ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యేందుకు జేఎన్‌టీయూ వెబ్‌సైట్‌లో స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ విత్ ఆన్సర్స్, ఇతర సమాచారం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

నిందితులను వదలొద్దు
వేలాది మంది విద్యార్థుల మనోవేదనకు కారణమైన ఎంసెట్ పేపర్ల లీకేజీ వ్యవహరంలో పకడ్బందీగా దర్యాప్తు జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా, ఎక్కడున్నా అరెస్ట్ చేసి విచారించాలని చెప్పారు. మళ్లీ పేపర్ల లీకేజీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలుండాలని చెప్పారు. బ్రోకర్లతో చేతులు కలిపిన విద్యార్థుల తల్లిదండ్రులపై చట్ట ప్రకారం వ్యవహరించాలని ఆదేశించారు.

సుప్రీం తీర్పు మేరకే నిర్ణయం
ప్రశ్నపత్రాల లీకేజీ జరిగినప్పుడు గతంలో ఎలా వ్యవహరించారు? ఇప్పుడెలా వ్యవహరించాలి? ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై సీఎం విస్తృతంగా చర్చించారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 70 సందర్భాల్లో ప్రధాన పరీక్షలకు సంబంధించిన పశ్నపత్రాలు లీక్ అయ్యాయని, అన్ని సందర్భాల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించారని అధికారులు వెల్లడించారు. గతంలో వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సీఎం తెప్పించుకుని పరిశీలించారు. దాదాపు అన్ని సందర్భాల్లో కోర్టులు మళ్లీ పరీక్ష పెట్టాలనే సూచనలు, ఆదేశాలే ఇచ్చినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement