సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కేసును తవ్వేకొద్దీ విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య విద్య అభ్యసించి ఆ వృత్తిలో బోధకులుగా పని చేస్తున్నవారే ఈ స్కాంలో కీలక పాత్ర పోషించినట్టు తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్ ప్రశ్నపత్రాలు లీక్ చేసిన అప్పటి నిందితులే తెలంగాణ ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో కార్పొరేట్ విద్యా సంస్థలతో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. కార్పొరేట్ కాలేజీలతోపాటు బ్రోకర్ల నుంచి వచ్చే సొమ్ము కోసం కక్కుర్తి పడ్డట్టు సమాచారం. ప్రశ్నపత్రాల విక్రయంతో కోట్లు వచ్చి పడుతుండటంతో కొంతకాలంగా ఈ దందా యథేచ్ఛగా నడుస్తున్నట్లు సీఐడీ విచారణలో వెలుగు చూస్తోంది.
కుట్రకు బీజం అప్పుడే..
బెంగళూరుకు చెందిన రాజగోపాల్‌రెడ్డి.. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రశ్నపత్రం లీకైనా విన్పించే పేరిది! 2013–14 ఎన్టీఆర్ వైద్య, విద్య పీజీమెట్ ప్రశ్నపత్రం లీక్ చేసింది ఇతడేనన్న ఆరోపణలున్నాయి. ఇతడితో సంబంధాలున్న డాక్టర్ ధనుంజయ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్ లీక్ చేసినట్టు తాజాగా సీఐడీ దర్యాప్తులో తేలింది. పట్నాకు చెందిన ధనుంజయ్ కర్ణాటకలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసించాడు. ఇతడితో చదువుకున్న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సందీప్.. తెలంగాణ ఎంసెట్ లీకేజీలో కీలక పాత్ర పోషించాడు. ప్రశ్నపత్రం లీక్ చేసి బిహార్ గ్యాంగ్‌ల ద్వారా ఇతడు క్యాంపులు నడిపినట్టు తేలింది. లీకైన ఈ ప్రశ్నపత్రం కోసం ఓ ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థ తీవ్రంగా యత్నించింది. చివరికి ఓ వ్యక్తి ద్వారా సంపాదించింది. మరో కార్పొరేట్ విద్యాసంస్థ డీన్ (ఈయన హైదరాబాద్ సంజీవరెడ్డినగర్ ప్రాంతలో కాలేజీలకు ఇన్‌చార్జ్) కూడా విశ్వప్రయత్నం చేసినట్లు తెలిసింది.
మరో 26 కాలేజీలు..
ఎంసెట్ నిర్వహణకు కమిటీ వేసి ప్రశ్నలు రూపొందించే నోడల్ యూనివర్సిటీ అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రశ్నలు రూపొందించడం, ప్రింటింగ్‌కు ఎక్కడ ఇస్తున్నారో తెలుసుకోవడం, ప్రశ్నపత్రాల రూపకల్పనలో తమ కాలేజీకి చెందిన లెక్చరర్లు ఉండేలా రెండు కార్పొరేట్ కాలేజీలు కుట్రకు పాల్పడట్టు సీఐడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. శ్రీచైతన్య కాలేజీ డీన్ అరెస్ట్ తర్వాత ఈ కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.
గుంటూరుకు చెందిన శివనారాయణ కేవలం చైతన్య, నారాయణ కాలేజీలే కాకుండా మరో 26 ప్రముఖ కాలేజీలకు విద్యార్థులను పంపడం, ఎంసెట్‌లాంటి వాటిల్లో మంచి ర్యాంకులు తెప్పించే బాధ్యత మాదేనంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు వాగ్దానంచేయడం వెనుక రహస్యం కూడా ఇదేనని సీఐడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఎంసెట్ నిర్వహణలో ప్రతీచోట ఏజెంట్లుగా తమ మనుషులను రెండు కార్పొరేట్ కాలేజీలు నియమించుకున్నట్టు డీన్ విచారణలో బయటపడింది. ‘‘ఈ మొత్తం వ్యవహారంలో మరిన్ని చేదు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. వాటన్నీటిని క్రోడీకరించే పనిలో ఉన్నాం’అని సీఐడీ అధికారి ఒకరు చెప్పారు.
అందుకే ర్యాంకులు?
నీట్ అమలుకు ముందు ప్రతీ రాష్ట్రంలో జరిగే మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ కుట్ర మొత్తం కర్ణాటకలోని దావనగిరి యూనివర్సిటీ నుంచి సాగినట్టు సీఐడీ తాజా విచారణలో బయటపడింది. ఈ యూనివర్సిటీలో వైద్యవిద్య చదివిన డాక్టర్ ధనుంజయ్ బ్యాచ్ మొత్తం ఇదే కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు సీఐడీ గుర్తించింది. ప్రతీ ఏటా ఒక్కో ఎంట్రెన్స్‌ను టార్గెట్ చేసుకొని ధనుంజయ్ గ్యాంగ్ రూ.50 కోట్ల మేర వసూలు చేసినట్టు అధికారులు వెలుగులోకి తెచ్చారు. రెండు కార్పొరేట్ కాలేజీల్లో చదివే మెరికల్లాంటి విద్యార్థులను ఎంచుకొని వారికి లీక్ చేసిన ప్రశ్నపత్రంపై శిక్షణ ఇప్పించినట్టు తేలింది. ఏ ఇతర కాలేజీలకు రాని ర్యాంకులు ఈ రెండు కాలేజీలకే రావడం వెనుకున్న ఆసలు రహస్యం ఇదేనని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే సీఐడీ అరెస్ట్ చేసిన శ్రీచైతన్య డీన్ వాసుబాబు, ఏజెంట్ శివనారాయణ చెప్పిన అంశాలు సరిపోలాయని సీఐడీ తేల్చింది.
వారికి మళ్లీ శ్రీముఖాలు
ఎంసెట్ నిర్వహణకు సంబంధించి డీన్ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై సంబంధిత అధికారులు శ్రీముఖాలు జారీ చేయాలని సీఐడీ భావిస్తోంది. ప్రశ్నపత్రాలు రూపొందించిన వారి పూర్తి జాబితా, ప్రింటింగ్ ప్రెస్‌తో జరిగిన ఒప్పంద పత్రాలు తదితర వివరాలను సేకరించి మరోసారి విచారణ జరపాలని యోచిస్తోంది. గతంలో ఎంసెట్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అధికారిని విచారించినా పెద్దగా ఆధారాలు లభించలేదు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా విచారిస్తే లీకేజీ కుట్రలో కీలకమైన ప్రింటింగ్ ప్రెస్ విషయం లింక్ బయటపడుతుందని సీఐడీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment