సీఐడీ అదనపు డెరైక్టర్ జనరల్ టి.కృష్ణప్రసాద్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు.
సీఐడీ ఇన్‌చార్జిగా చారుసిన్హా నియామకం
సాక్షి, హైదరాబాద్: సీఐడీ అదనపు డెరైక్టర్ జనరల్ టి.కృష్ణప్రసాద్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. సీఐడీతో పాటు రాష్ట్ర రైల్వే పోలీసు విభాగం ఇన్‌చార్జి డీజీగా కూడా ఉన్న ఆయనను రాష్ట్ర పోలీస్ సాంకేతిక విభాగం అదనపు డీజీగా బదిలీ చేశారు. ప్రస్తుతం సీఐడీ ఐజీగా ఉన్న చారుసిన్హాకు ఈ విభాగం ఇన్‌చార్జి డీజీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కాగా కృష్ణప్రసాద్ ఆకస్మికంగా బదిలీ కావడంపై ఐపీఎస్ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. మెదక్ జిల్లా మాసాయిపేట ఘటనపై విచారణకు సంబంధించి కృష్ణప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్లు తెలియవచ్చింది.