సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు దగ్ధమైన కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి మహబూబ్‌నగర్ పోలీసుల నుంచి దాదాపు వెయ్యి పత్రాలను తీసుకున్న అధికారులు, తాము కూడా మరో ఐదు వందల వరకు పత్రాలను సేకరించారు. వీటన్నింటినీ న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించారు. ఈ లీజు పత్రంపై దివాకర్ ట్రావెల్స్ తరఫున జేసీ ప్రభాకర్ రెడ్డి సంతకం ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వోల్వో బస్సు పాలెం వద్ద ఘోర అగ్నిప్రమాదానికి గురై.. 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ కేసులో సీఐడీ అధికారులు ప్రమాదానికి అన్ని కోణాల నుంచీ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు... జేసీ దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సును జబ్బార్ ట్రావెల్స్‌కు లీజుకు ఇచ్చినట్లుగా చెబుతుండటంతో.. ఆ రెండు ట్రావెల్స్ మధ్య ఒప్పందాలేమిటి? వాటిలో ఏమైనా లొసుగులు ఉన్నాయా? తదితర అంశాలను గుర్తించడానికి ఆ పత్రాలను న్యాయ నిపుణుల పరిశీలనకు పంపారు. దుర్ఘటనకు గురైన వోల్వో బస్సు ఇంజన్‌లో లోపాలున్నాయని.. కర్ణాటక అధికారులు అక్కడి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు వచ్చిన సమాచారంపైనా సీఐడీ దృష్టి సారించింది.