
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో రెండున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో జరిగిన ఎంసెట్ స్కాంలో సీఐడీ అధికారుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దర్యాప్తు అధికారులు బెంగళూరులో ఎంసెట్ లీక్ క్యాంపు కేంద్రాన్ని గుర్తించారు. 16 మంది విద్యార్థులను హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి బెంగళూరులోని ఓ ప్రైవేట్ భవనంలో లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. ఎంసెట్ కేసులో ఎప్పుడో అరెస్టయిన నిందితుడు అషుతోశ్ ఈ క్యాంపును నడిపించినట్టు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. కేసు దర్యాప్తు మూడేళ్లకు చేరువవుతున్న తరుణంలో కీలక ఆధారాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ కేసులో గతంలో దర్యాప్తు చేసిన అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
కేసులో ఏం జరుగుతోంది..?
ప్రశ్నపత్రం లీక్ వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి దర్యాప్తు అధికారులు సరైన వ్యూహంతో వ్యవహరించకపోవడం ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. నిందితుల కాల్‌డేటా వివరాలు బయటకు తీయడం దర్యాప్తు అధికారులకు కష్టసాధ్యంగా మారినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లు ఏడాదిలోపున్న కాల్‌డేటా వివరాలను మాత్రమే దర్యాప్తు సంస్థకు అందించవచ్చు. ఏడాది దాటితే వాటిని బయటకు తేవడం సులభకాకపోవడంతో ఇప్పుడు అధికారులు తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయారు. ఈ కేసులో ఇప్పటికే 74 మందిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేయాలంటే ఈ డేటా వివరాలు తప్పనిసరని భావిస్తున్నారు. అదే విధంగా కేసు తుదిదశలో ఉన్న సందర్భంలో కార్పొరేట్ కాలేజీల వ్యవహారం బయటపడటం, క్యాంపు నిర్వహించిన ప్రాంతం వెలుగులోకి రావడం, విద్యార్థులు ముందుకు వచ్చి వాంగ్మూలాలు ఇస్తుండటం సంచలనం రేపుతోంది. ఇంకా ఈ కేసు ఎన్నాళ్లు దర్యాప్తు చేస్తారు? ఎవరిని కటకటాల్లోకి పంపుతారు? ఎవరి ఒత్తిడికైనా తలొగ్గుతారా? అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment