సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్య ఉద్యమం మరోమారు ఉవ్వెత్తున ఎగిసిపడింది. రెండోరోజు ఎన్‌జీఓ లు, సమైక్యవాదులు జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు, పాలాభిషేకాలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వీఆర్‌సీ సెంటర్‌లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఫ్లెక్సీలను దహనం చేశారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్‌జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. నగరంలో విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో స్టోన్‌హౌస్‌పేట నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.
నెల్లూరు రూరల్‌లోని చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఏపీఎన్‌జీఓ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా రెండో రోజు కూడా కలెక్టరేట్‌లో ఏపీఎన్‌జీఓ రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉదయగిరి నియోజక వర్గంలోని వరికుంటపాడు మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. కావలిలో ఎన్‌జీఓల సమ్మె రెండోరోజుకు చేరింది. ఎన్‌జీఓ ఆసోసియేషన్ నేతలు, ప్రజా సంఘాలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన ఎన్‌జీఓలు విధులను బహిష్కరించారు. ఆత్మకూరు రెవెన్యూ కార్యాలయంలో వీఆర్‌ఓలు, రెవెన్యూ సిబ్బంది విధులను బహిష్కరించారు. గూడూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్‌జీఓలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. సర్వేపల్లి నియోజక వర్గంలోని ముత్తుకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం మండలాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా రెవెన్యూ కార్యాలయ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. కార్యాలయాలు వెలవెలబోయాయి. పొదలకూరులో ఎంపీడీఓ, రెవెన్యూ కార్యాలయాల ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయ తలుపులకు తాళాలు వేశారు. సూళ్లూరుపేటలోని రెవెన్యూ శాఖ పరిధిలోని కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.
ఎగిసిన సమైక్యం
Published Sat, Feb 8 2014 3:37 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM
Advertisement
Advertisement