ఒంగోలు క్రైం: ఒంగోలు నగరానికి తూర్పు వైపున నిర్మించిన నూతన బైపాస్‌కు ఇరువైపులా ఉన్న మలుపు కూడళ్లు ప్రాణసంకటంగా మారాయి. నూతన బైపాస్ దక్షిణం వైపు, ఉత్తరం వైపు అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నందున వాహనదారులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా, అసౌకర్యంగా మారింది. దీంతో అటు ఉత్తరం వైపు, ఇటు దక్షిణం వైపు తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా జాతీయ రహదారి అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేస్తుండటంతో వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. నూతన బైపాస్ కూడళ్లలో, మలుపుల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవటంతో కార్లు, ద్విచక్ర వాహనాలు రోడ్డుపై ఉంచిన సిమెంట్ దిమ్మెలను ఢీకొంటున్నాయి. ఇటీవలి కాలంలో దక్షిణ బైపాస్‌లో ఐదు ప్రమాదాలు సంభవించాయి. ఇక ఉత్తర బైపాస్‌లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇప్పటికైనా రోడ్డు మార్జిన్లలో ప్రమాద సూచికలు, రేడియం స్లిక్కర్లు ఏర్పాటు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment