భీమవరం(పెళ్లకూరు): ఒకటి కాదు...రెండు కాదు...వరుసగా రోడ్డు ప్రమాదాలే...నిత్యం ఏదోకచోట విద్యార్థులు ప్రయాణించే బస్సులే ప్రమాదాలకు గురవుతున్నాయి. ముక్కుపచ్చలారరని చిన్నారులతో పాటు కళాశాలకెళ్లే విద్యార్థులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్రంగా గాయపడుతున్నారు. అన్నింటికంటే ప్రధానంగా ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నారులు ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. తల్లిదండ్రులు ప్రాణపదంగా భావించే తమ పిల్లలను ఎంతో ఆనందంగా స్కూల్‌కు పంపిస్తుంటే ప్రమాదాలు పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి.
తాజాగా 71వ జాతీయ రహదారిపై భీమవరం క్రాస్‌రోడ్డు వద్ద శనివారం సాయంత్రం స్కూల్ వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో 19 మంది విద్యార్థులకు గాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిల్లకూరు వడ్డిపాళెం గ్రామంలోని ప్రైవేటు పాఠశాల బస్సు విద్యార్థులను భీమవరం, నెలబల్లి గ్రామాలకు తీసుకెళుతుంది. క్రాస్ రోడ్డుకు వ్యాన్ తిరిగే సమయంలో నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తి వైపు వెళ్లే లారీ స్కూల్ వ్యాన్‌ను వెనుక భాగంలో ఢీకొట్టింది.
దీంతో వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న పంటకాలువలోకి బోల్తా పడింది. ఈ సంఘటనలో వ్యానులో ఉన్న 19మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలు ఆషాకు గాయాలయ్యాయి. వ్యాన్‌లో వున్న రాంధీప్, కౌశిక్‌లకు తలపైన, సంధీప్, రేష్మ, భరత్‌కుమార్‌లకు కాలు, చెయ్యి విరిగాయి. వాసు, వెంకటేష్, రూప, పురంధరీశ్వరి, గణేష్, ఉదయ్‌కుమార్, పవన్, ప్రవళిక తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై శివశంకరావు తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. తలపై గాయాలైన ఇద్దరు
విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. నాయుడుపేట సీఐ రత్తయ్య, ఎస్సై ఆంజనేయరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్కూల్‌వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, డ్రైవర్‌కి గతంలో పలుమార్లు హెచ్చరించామని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌వ్యాన్ ప్రమాదానికి గురైన సమాచారం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన విద్యార్థులకు వెంటనే వైద్య సేవలు చేయించేలా చర్యలు చేపట్టారు. తమ బిడ్డలకు ఏమైందో నంటూ ఆసుపత్రి ప్రాంగణం తల్లిదండ్రుల రోదనలతో మిన్నంటాయి. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గాలిలో దీపంలా చిన్నారుల ప్రాణాలు
Published Sun, Apr 19 2015 3:16 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM
Advertisement
Advertisement