=ఆస్తుల వివరాలు, రికార్డులు లేని జీహెచ్‌ఎంసీ
= పరిహారం పేరిట రూ. 17 కోట్ల ఫలహారానికి రెడీ
=తనిఖీలతో వెల్లడైన అక్రమం
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలో ఎన్ని చెరువులున్నాయో తెలియదు.. వాటిలో ఎన్ని పరుల పాలయ్యాయో వివరాలు లేవు.. పార్కుల విస్తీర్ణమెంతో తెలిపే రికార్డులైనా ఉన్నాయంటే అవీ లేవు.. ఏ పార్కులు ఏ అక్రమార్కుల చెరలో మగ్గుతున్నాయో అంతకన్నా తేలీదు.. ఎస్టేట్ విభాగానికి సంబంధించి ఏ ఆస్తుల్లో ఎందరు థర్డ్‌పార్టీలున్నారో.. వాటిలో ఎన్నింటికి లీజు చెల్లించడం లేదో సమాచారం లేదు.. అంతేకాదు కనీసం ఎక్కడెక్కడ ఏయే రోడ్లున్నాయో తెలీని దుస్థితి. ఇంకా.. ఇంకా.. ఇంకా ఎన్నెన్నో విషయాలు తెలియకపోవడమే కాక స్వయానా మునిసిపల్ రోడ్లను సైతం తమ ఆస్తులని లబ్ధిదారులు చెబితే, కళ్లు మూసుకొని లెక్కలు కట్టి, పరిహారం చెల్లించే స్థితిలో ఉంది మన ఘనత వహించిన జీహెచ్‌ఎంసీ. ఉప్పల్ చౌరస్తా-నల్లచెరువు రోడ్డు విస్తరణ కోసం తమ రోడ్డు ఉన్న స్థలానికే దాదాపు రూ.17 కోట్ల పరిహారం చెల్లించేందుకు సిద్ధపడిన ఉదంతమే ఇందుకు అత్యుత్తమ నిదర్శనం.
ఉప్పల్ చౌరస్తా నుంచి నల్లచెరువు వరకు వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు రహదారి విస్తరణ అవసరమని జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. అందుకుగాను విస్తరణలో ఆస్తులో కోల్పోనున్న వారిని ఒప్పించేందుకు చాలాకాలం పాటు సంప్రదింపులు జరిపారు. భూసేకరణ ద్వారా అయితే ఆలస్యం అవుతుందని భావించి.. సాధ్యమైనన్ని ఆస్తుల్ని సంప్రదింపుల ద్వారానే సేకరించేందుకు సిద్ధమయ్యారు. స్థానిక కార్పొరేటర్‌తో సహా పలువురు అధికారులు తమ వంతు సహకారం అందించారు. మొత్తం 181 ఆస్తులకుగాను 70 మంది తమ ఆస్తులిచ్చేందుకు ముందుకొచ్చారు.
అక్కడ మార్కెట్ ధర చదరపుగజానికి రూ. 25 వేలుండగా, అంతకంటే మరో రూ.5 వేలు ఎక్కువతో (20 శాతం అదనం) చదరపు గజానికి రూ. 30 వేల వంతున పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించారు. అందుకు జీహెచ్‌ంఎసీ స్టాండింగ్ కమిటీ సైతం ఆమోదం తెలిపింది. దాంతో.. ఆస్తుల సేకరణ కోసం కొలతలు తీసిన అధికారులు వేటికి ఎంత చెల్లించాల్సి ఉంటుందో లెక్కలు వేశారు. చెల్లింపులకు ముందు.. టైటిల్ వెరిఫికేషన్స్ కోసం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన ఉన్నతాధికారులు.. జీహెచ్‌ఎంసీ రోడ్డు భాగాన్ని సైతం లబ్ధిదారుల ఆస్తిలో కలిపి లెక్కించినట్లు గుర్తించారు.
ఇదేమిటని ప్రశ్నిస్తే తెలియక జరిగిన పొరపాటన్నారు. దాంతో.. తిరిగి సర్వే నిర్వహించి, కచ్చితంగా లెక్కలు తీయాల్సిందిగా ఆదేశించడంతో తిరిగి ఆ పనిలో పడ్డారు. లేనిపక్షంలో రోడ్డున్న స్థలానికి కూడా నష్టపరిహార చెల్లింపులు జరిగేవి. అది తక్కువలో తక్కువ రూ. 17 కోట్లు. ఇదీ జీహెచ్‌ఎంసీ నిర్వాకం. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లకపోతే.. రూ.17 కోట్లు హాంఫట్ అయ్యేవే.
కొత్త చట్టం సాకు చూపుతూ..
జరిగిన పొరపాటు బయట పడనీయకుండా స్థానిక అధికారులు కొత్త భూసేకరణ చట్టాన్ని లబ్ధిదారుల ముందుంచారు. కొత్త చట్టం వల్ల ఎక్కువ నష్టపరిహారం అందనుండటంతో.. లబ్ధిదారులు సైతం ఇప్పుడు దాన్నే అమలు చేయాలని కోరుతున్నారు. కొత్త చట్టం పుణ్యమా అంటూ జీహెచ్‌ఎంసీ చేసిన తప్పిదం మరుగున పడిపోనుంది. జీహెచ్‌ఎంసీ అడ్డగోలు పాలనకు ఇదో నిదర్శనం మాత్రమే. బయటకు పొక్కకుండా లోలోపలే జరుగుతున్న అవకతవకలు.. అక్రమాలు.. పొరపాట్లు.. ఇంకా ఎన్నెన్నో! రానున్న జనవరి 1 నుంచి అమల్లోకి రాగలదని భావిస్తున్న కొత్త భూసేకరణ చట్టం మేరకు భూ నిర్వాసితులయ్యే వారికి మార్కెట్ ధర కంటే 70 శాతం అదనంగా గిట్టుబాటవుతుంది. దాన్ని చూపుతూ లబ్ధిదారుల నుంచి ఒత్తిడి రాకుండా చేయడమే కాక.. ఆ చట్టమే వర్తింపచేయాలని వారి నుంచే డిమాండ్ వచ్చేలా చేశారు.
గుడ్డి దర్బార్
Published Mon, Dec 16 2013 3:46 AM | Last Updated on Tue, Aug 21 2018 12:12 PM
Advertisement
Advertisement