కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నగరంలోని ట్రాఫిక్‌ను పరిశీలిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖ సాంకేతికమయం అవుతోంది. టెక్నాలజీ సహాయంతో నేరాలను నిరోధించడానికి, కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప పోలీసింగ్ అమలు చేయాలని నిర్ణయించామని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదిరిగా అన్ని జిల్లాలు, పోలీసు కమిషనరేట్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్‌లను ఆయన బుధవారం ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ ‘బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ఆధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది.
ఈ ఏడాది చివరి నాటికి దీని నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, కమిషనరేట్లను అనుసంధానించి సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని చెప్పారు. ‘హైదరాబాద్ కమిషనరేట్‌లో ఈ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఏర్పాటు చేశాం. తొలుత ఇక్కడ అమలులోకి తీసుకువచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేస్తాం. లోపాలు బయటపడితే వాటిని సరిచేసి ఐసీసీసీ అందుబాటులోకి వచ్చేనాటికి పక్కాగా రూపొందిస్తాం’అని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైతే వెంటనే అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేయడానికి టెక్నాలజీ దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లోని పోలీసులకు శిక్షణ ఇచ్చే బాధ్యతల్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు అప్పగిస్తున్నామని అన్నారు.
రాష్ట్రాన్ని శాంతిభద్రతలకు నిలయంగా మార్చి పెట్టుబడులకు కేంద్రాన్ని చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఈ అంశంలో 1.66 లక్షల కెమెరాలను ఏర్పాటు చేయించిన హైదరాబాద్ కమిషనరేటే మిగిలిన వాటికి ఆదర్శం’అని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్‌చార్జి పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావుతోపాటు మూడు కమిషనరేట్ల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment