పట్నం చెరువైంది!
► భారీ వర్షంతో చిగురుటాకులా వణికిన నగరం
► ఉపరితల ద్రోణి, క్యుములోనింబస్‌తో కుండపోత
► బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు బీభత్సం
► ఉప్పొంగిన నాలాలు.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
► ఇళ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు
► చెరువులను తలపించిన ప్రధాన రహదారులు..
► నాలుగైదు గంటలపాటు స్తంభించిన వాహన రాకపోకలు
► పలుచోట్ల విరిగిపడిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు
► వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
► రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ భారీ వర్షం
► మరో రెండు మూడు రోజులు విస్తారంగా వానలు
► మూడు రోజుల్లో పలకరించనున్న రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్
భారీ వర్షంతో రాజధాని హైదరాబాద్ చిగురుటాకులా వణికింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన కుండపోతతో పట్నం చెరువైంది. నగరంలో చాలా చోట్ల నాలాలు ఉప్పొంగి పొర్లాయి.. భారీ వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో ఇళ్లలోకి నీరు చేరింది. ప్రధాన రహదారులపై వరద నీరు చేరి చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దాదాపు వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షం, రహదారులపై నీరు చేరడంతో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు వంద జంక్షన్ల పరిధిలో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ట్రాఫిక్ రద్దీ కనిపించింది.
పలు చోట్ల కుండపోత
హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబర్‌పేటలో 9.5 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. మొత్తంగా గ్రేటర్‌వ్యాప్తంగా సగటున 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని.. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షం కురిసినట్లు తెలిపింది. వచ్చే 24 గంటల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని... లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
లోతట్టు ప్రాంతాల్లో..
భారీ వర్షంతో లక్డీకాపూల్, ఎంజే మార్కెట్, ఉస్మాన్‌గంజ్, కిషన్‌గంజ్ ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్‌కు ఇబ్బంది ఎదురైంది. కిషన్‌గంజ్ నాలా నిండిపోయి నీరు రోడ్లపై ప్రవహించింది. అఫ్జల్‌సాగర్ బస్తీలో ఇళ్లలోకి నీరు చేరింది. ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ అంజయ్యనగర్, హస్మత్‌పేట, మల్లికార్జుననగర్, హరిజనబస్తీ, కోయబస్తీ తదితర ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపించాయి. పాతబస్తీలోని ఆమన్‌నగర్–బి, మురాద్ మహల్, నషేమాన్‌నగర్, సిద్ధిఖీనగర్ ప్రాంతాలతోపాటు మెహదీపట్నం నదీమ్ కాలనీ, టోలిచౌకి, నానల్‌నగర్, గోల్కొండ డివిజన్ ప్రాంతాల్లో, సీతాఫల్‌మండి డివిజన్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. పంజాగుట్ట మోడల్ హౌజ్ ప్రాంతమంతా నీటమునిగింది. నడుములోతు వరద నీరు నిలిచింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, చింతల్ బస్తీ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, కాలనీల్లో వరదనీరు పోటెత్తింది. తార్నాక ప్రాంతంలో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, చందానగర్, లింగంపల్లి, హఫీజ్‌పేట్, మియాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాలలో ప్రధాన రోడ్లపైకి వర్షపునీరు వచ్చి చేరడంతో మధ్యాహ్నం వరకు వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. వరద నీటి ప్రవాహానికి నాచారం ప్రధాన రోడ్డు మార్గంలో పెద్ద గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వనస్థలిపురం సుష్మ సాయినగర్‌లో ఓ ఇంటి ప్రహరీగోడ కూలి పడడంతో భవాని (37) అనే మహిళ తీవ్ర గాయాలపాలైంది. మరోవైపు నీట మునిగిన బస్తీలు, కాలనీల్లో వరద నీటిని తొలగించే విషయంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం విఫలమైందంటూ ఆయా బస్తీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అధికారులు తమను పరామర్శించలేదని వాపోయారు.
పలు జిల్లాల్లోనూ వాన బీభత్సం..
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ గురువారం వాన బీభత్సం సృష్టించింది. సిరిసిల్లలో 10 సెంటీమీటర్ల మేర వర్షం కురవటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామన్నపేట, మిర్యాలగూడ, ఖమ్మం జిల్లా వెంకటాపురం, బూర్గంపాడు, టేకులపల్లి, మణుగూరు, కూసుమంచి, భద్రాచలం, కొత్తగూడెం, బయ్యారం, పినపాక, నర్మెట్ట, హుజూరాబాద్, మేడ్చల్, డోర్నకల్, తాండూరు, వికారాబాద్, బెజ్జెంకి, అచ్చంపేట, గంగాధర, నాగార్జునసాగర్, దేవరకొండ, ధర్మసాగర్, నారాయణ్‌ఖేడ్, జగిత్యాల, నిర్మల్, నర్సంపేట, చెన్నరావుపేట, శాయంపేట, రామగుండం, హసన్‌పర్తి తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షంతో యాదాద్రి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి మండలంలో మూసీ ఉప్పొంగింది. జూలూరు–రుద్రల్లి, పెద్దరావులపల్లి–భట్టుగూడెం గ్రామాల మధ్య గల వంతెనలపై నుంచి వరద పొంగిపొర్లడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పలు వీధులు జలమయమయ్యాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లపైకప్పులు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని పెర్కిట్‌లో ఓ ఇల్లు కూలిపోయింది. ఇక రంగారెడ్డి జిల్లాలో గురువారం 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మూడు రోజుల్లో రుతుపవనాలు
మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఐదు, ఆరు తేదీలకల్లా రుతుపవనాలు రావాల్సి ఉన్నప్పటికీ... వాతావరణంలో మార్పుల వల్ల కాస్త ఆలస్యమైందని తెలిపింది. బుధవారమే రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించటంతో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
గురువారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షపాతం (సెంటీమీటర్లలో)
ప్రాంతం వర్షపాతం (సెంటీమీటర్లలో)
సైదాబాద్ 9.8
మారేడ్‌పల్లి 9.6
అంబర్‌పేట్ 9.5
ఖైరతాబాద్ 9.5
బండ్లగూడ 9.2
శ్రీనగర్‌కాలనీ 9.1
బేగంపేట 8.8
సికింద్రాబాద్ 8.8
తిరుమలగిరి 8.6
నాంపల్లి 8.4
నారాయణగూడ 7.6
ఆసిఫ్‌నగర్ 7.2
గోల్కొండ 6.8
–––––––––––––––––
సగటున 7.6
తదితర ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపించాయి. పాతబస్తీలోని ఆమన్‌నగర్–బి, మురాద్ మహల్, నషేమాన్‌నగర్, సిద్ధిఖీనగర్ ప్రాంతాలతోపాటు మెహదీపట్నం నదీమ్ కాలనీ, టోలిచౌకి, నానల్‌నగర్, గోల్కొండ డివిజన్ ప్రాంతాల్లో, సీతాఫల్‌మండి డివిజన్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. పంజగుట్ట మోడల్ హౌజ్ ప్రాంతమంతా నీటమునిగింది. నడుములోతు వరద నీరు నిలిచింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, చింతల్ బస్తీ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, కాలనీల్లో వరదనీరు పోటెత్తింది. తార్నాక ప్రాంతంలో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, చందానగర్, లింగంపల్లి, హఫీజ్‌పేట్, మియాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాలలో ప్రధాన రోడ్లపైకి వర్షపునీరు వచ్చి చేరడంతో మధ్యాహ్నం వరకు వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. వరద నీటి ప్రవా హానికి నాచారం ప్రధాన రోడ్డు మార్గంలో పెద్ద గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వనస్థలిపురం సుష్మ సాయినగర్‌లో ఓ ఇంటి ప్రహరీగోడ కూలి పడటంతో భవాని (37) అనే మహిళ తీవ్ర గాయాలపాలైంది. మరోవైపు నీట మునిగిన బస్తీలు, కాలనీల్లో వరద నీటిని తొలగించే విషయంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం విఫలమైందంటూ ఆయా బస్తీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అధికారులు తమను పరామర్శించలేదని వాపోయారు.
మరో మూడు రోజులు వానలు
రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైనా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని తెలిపింది.