ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే అరెస్టే | The arrests in seizing Footpath | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే అరెస్టే

Published Thu, Aug 18 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే అరెస్టే

ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే అరెస్టే

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరగడానికి ఆక్రమణలు కూడా ప్రధాన కారణం.  వ్యాపారులు ఫుట్‌పాత్‌ల్ని ఆక్రమించడంతో పాదచారులకు రహదారులే ఆధారమవుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడటమే కాదు... కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.  ఈ పరిణామలను దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

అలా అలా ముందుకొస్తూ...
ఈ ఆక్రమణదారుల వ్యవహారం నానాటికీ తలనొప్పిగా మారుతోందని ట్రాఫిక్‌ విభాగం అధికారులు చెప్తున్నారు. ఓ దుకాణదారుడు తొలుత తన దుకాణం ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై కన్నేస్తున్నాడు. కొన్ని రోజుల పాటు దుకాణం తెరిచినప్పుడు అక్కడ సామాను పెట్టి, మూసేప్పుడు తిరిగి తీసేయడంతో ఆక్రమణ మొదలవుతోంది. కొన్నాళ్లకు ఆయా ఫుట్‌పాత్‌లపై నిర్మాణాలు చేపట్టి రహదారిని కూడా ఆక్రమిస్తున్నారు.  ఇలా నానాటికీ కుంచించుకుపోతున్న ఫుట్‌పాత్‌లు, రహదారులు సామాన్యులకు అనేక ఇబ్బందులు కలిగించడంతో పాటు నరకం చూపిస్తున్నాయి.

ఒకప్పుడు జరిమానా మాత్రమే...
ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణలపై ఒకప్పుడు కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం ఉండేదికాదు. వీరిపై కేవలం సిటీ పోలీసు (సీపీ) యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాతో సరిపెట్టేవారు. దీంతో ఈ ఆక్రమణదారులపై ఎలాంటి ప్రభావం ఉండేది కాదు. ట్రాఫిక్‌ పోలీసులు వచ్చినప్పుడల్లా జరిమానాలు కట్టేస్తూ తమ పంథా కొనసాగించేవారు. ఫలితంగా సమస్య తీరకపోవడంతో పాటు ఆక్రమణదారుల సంఖ్య నానాటికీ పెరిగేది. ఏళ్లుగా కొనసాగుతున్న జరిమానా విధానంలోని లోపాలను గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

క్రిమినల్‌ కేసులతో కోర్టుకు...
నగరంలో ఈ తరహా ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యాపారులపై క్రిమినల్‌ కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభించారు. దీనికోసం ‘మొబైల్‌ ఈ–టికెట్‌’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించి ట్రాఫిక్‌ పోలీసులు వినియోగిస్తున్న ట్యాబ్‌్సలో పొందుపరిచారు. దీని ఆధారంగా ఆక్రమణదారులపై సాంకేతికంగా కేసులు నమోదు చేసే ఆస్కారం ఏర్పడింది. ఈ యాప్‌లో టిన్‌ నెంబర్, దుకాణం, యజమాని వివరాలతో పాటు ఆక్రమణ ఫొటో సైతం తీసుకునే ఆస్కారం ఉంది. ఇది జీపీఎస్‌ ఆధారితంగా పని చేయడంతో న్యాయస్థానంలో బలమైన సాక్ష్యంగా పనికి వస్తోంది. వీటి ఆధారంగా ఆక్రమణదారులను న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు.

రెండుసార్లు అవకాశం ఇచ్చాకే:
‘సిటీలో ఫుట్‌పాత్‌లు, రహదారుల్ని ఆక్రమిస్తున్న దుకాణదారులకు రెండు అవకాశాలు ఇస్తున్నాం. తొలుత రెండుసార్లు కేవలం జరిమానా, కౌన్సెలింగ్‌తో సరిపెడుతున్నాం. మూడోసారి కూడా పునరావృతమైతే క్రిమినల్‌ కేసు నమోదు చేసి అభియోగపత్రాలతో సహా కోర్టుకు తరలిస్తున్నాం. ఇప్పటికే కొందరికి జైలు శిక్ష కూడా పడింది. ఈ వివరాల ఆధారంగా జీహెచ్‌ఎంసీ అధికారులకూ లేఖ రాసి వారి ట్రేడ్‌ లైసెన్సు రద్దుకు సిఫార్సు చేస్తున్నాం.’
                                                                 – జితేందర్, నగర ట్రాఫిక్‌ చీఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement