
‘మెట్రో’ టై!
ప్రమాదాలకు తావిస్తున్న మెట్రో రైలు పనులు
గాయాలపాలవుతున్న ప్రజలు
పలుచోట్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు
సిటీబ్యూరో: నగరంలో ప్రధాన రహదారుల మధ్యన జరుగుతున్న మెట్రో పనులు పలు చోట్ల ప్రమాదకరంగా మారాయి. ఆదివారం రవీంద్రభారతి చౌరస్తాలో జరిగిన ప్రమాదం పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన విషయం విదితమే. ప్రధానంగా నాంపల్లి హజ్‌హౌజ్, ఆలిండియా రేడియో, రవీంద్రభారతి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్ వంటి రద్దీప్రాంతాల్లో మెట్రో పనులు ఆయా మార్గాల్లో వెళుతున్న వారికి చుక్కలు చూపిస్తున్నాయి. మెట్రో పనుల్లో భాగంగా ప్రీకాస్ట్ యార్డుల్లో తయారు చేసిన వయాడక్ట్ సెగ్మెంట్లను రాత్రివేళల్లో భారీ ట్రక్కుల సాయంతో పనులు జరుగుతున్న చోటకు తరలిస్తున్నారు. వాటిని భారీ క్రేన్లు, లాంఛింగ్ గర్డర్ల సహాయంతో పైకి ఎత్తి మెట్రో పిల్లర్ల మధ్యన అమరుస్తున్నారు. నాగోలు-రహేజా ఐటీపార్క్, జేబీఎస్-ఫలక్‌నుమా, ఎల్బీనగర్, మియాపూర్ మొత్తం మూడు మార్గాల్లో 72 కి.మీ మార్గంలో మెట్రో పనులు గత నాలుగేళ్లుగా జరుగుతున్నప్పటికీ ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో దుర్ఘటనలు జరగలేదు.
కానీ ఇటీవల ఆస్తుల సేకరణ ప్రక్రియ పూర్తవడంతో అత్యంత రద్దీగా ఉండే ప్రధానప్రాంతాల్లో మెట్రో పనులు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, వాహనాలను దారిమళ్లించేందుకు సరైన సైన్‌బోర్డులు, బారికేడ్‌లు ఏర్పాటు చేయకపోవడం, ట్రాఫిక్‌ను దారిమళ్లించడానికి అవసరమైన సిబ్బందిని నియమించకపోవడంతోనే ఆయా మార్గాల్లో వెళుతున్న వాహనాలు, ప్రయాణికులు, చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొన్నిసార్లు పనులు ముగిసిన అనంతరం భారీ క్రేన్లను, ఇతర వాహనాలను, నిర్మాణ సామాగ్రి, వ్యర్థాలను నిర్మాణ సంస్థ రహదారులపైనే వదిలిపెడుతుండడంతో ఆయా రూట్లలో ట్రాఫిక్ స్తంభిస్తోంది. పిల్లర్ల నిర్మాణం కోసం కొన్ని చోట్ల భారీ గోతులు తవ్వినప్పటికీ వాటికి సరైన బారికేడింగ్ చేయడంలేదని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఈవిషయంలో నిర్మాణ సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. కాగా రవీంద్రభారతి చౌరస్తా వద్ద జరిగిన ప్రమాద ఘటనపై ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా..సంఘటనకు బాధ్యులెవరో గుర్తిస్తున్నామన్నారు. ప్రమాదాలు జరగకుండా ఆయా విభాగాల అనుమతులు, పలు జాగ్రత్తలు తీసుకున్న మీదటే నగరంలోని ముఖ్య కూడళ్లలో పనులు చేపడుతున్నామని చెప్పారు.