సమతుల్యత సాధిస్తాం | Government needs to balance jobs and safety: Nitin Gadkari on e-rickshaws | Sakshi
Sakshi News home page

సమతుల్యత సాధిస్తాం

Published Tue, Sep 2 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM

Government needs to balance jobs and safety: Nitin Gadkari on e-rickshaws

 న్యూఢిల్లీ: ఈ-రిక్షాల వివాదంపై తన వాదనను సమర్థించుకుంటూ... పేదవాడి ఉపాధి, భద్రతా పరిమితులమధ్య ప్రభుత్వం సమతుల్యతను సాధించాల్సిన అవసరముందని కేంద్ర రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమానవీయంగా అనిపించే లాగుడు రిక్షాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ-రిక్షాలను నగర రహదారులపై తిరిగేందుకు అనుమతించామన్నారు. చట్టం గట్టిగా ఉండాల్సిందేనని, అయితే సామాన్య పౌరుడిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. అందువల్లనే ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధిస్తామన్నారు.
 
 నగర రహదారులపై చట్టవిరుద్ధంగా సంచరిస్తున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది జూలై 31వ తేదీన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఈ రిక్షాలపై నిషేధం విధించిన సంగతి విదితమే. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. వాటిపై నియంత్రణ విధించేదాకా నిషేధం ఎత్తివేయలేమంటూ గత నెల ఐదో తేదీన ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ-రిక్షావాలాల జీవనోపాధి దెబ్బతింది. నియంత్రణకు సంబంధించి ముసాయిదాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నగర రహదారులపై ఈ-రిక్షాలను అనుమతించాలా లేక మోటారు వాహనాల చట్టం కింద కచ్చితంగా వాటిపై ఆంక్షలు విధించాలా అనే విషయమై ఈ నెల తొమ్మిదో తేదీన తన నిర్ణయాన్ని వెలువరించనుంది.
 
 అభిప్రాయాల్ని సేకరిస్తాం
 ఈ వివాదంపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరిస్తామని కేంద్ర మంత్రి నితిన్ తెలిపారు. ఆ తరువాత శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తాజా బిల్లును సభలో ప్రవేశపెడతామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement