ఈ-రిక్షాలను రక్షిస్తాం | No Ban on E-Rickshaws in Delhi: Transport Minister Nitin Gadkari | Sakshi
Sakshi News home page

ఈ-రిక్షాలను రక్షిస్తాం

Published Tue, Jun 17 2014 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

ఈ-రిక్షాలను రక్షిస్తాం

ఈ-రిక్షాలను రక్షిస్తాం

సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ రిక్షాలపై (ఈ-రిక్షా) నిషేధం విధించబోమని, మరింత అభివృద్ధి చేస్తామని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రామ్‌లీలా మైదాన్‌లో ఈ-రిక్షా డ్రైవర్లు, యజమానులు మంగళవారం నిర్వహించిన మహార్యాలీలో ఆయన పాల్గొన్నారు. 650 వాట్ల బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలకు లెసైన్సులు అవసరం లేదని, వాటిలో  నలుగురు ప్రయాణికులను, 50 కిలోల సామాన్లను తీసుకువెళ్లవచ్చని గడ్కరీ చెప్పారు. ఈ-రిక్షాల రిజిస్ట్రేషన్ల కోసం డ్రైవర్లు, యజమానులు ఇక ప్రాంతీయ రవాణాశాఖ అధికారి(ఆర్‌టీఓ) కార్యాలయానికి వెళ్లనవసరం లేదని నితిన్ గడ్కరీ చెప్పారు. వంద రూపాయల ఖర్చుతో ఎమ్సీడీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్‌తోపాటు ఈ-రిక్షా డ్రైవర్లకు గుర్తింపుకార్డు లభిస్తుందని మంత్రి తెలియజేశారు.
 
 ఈ వాహనాల పేరును ఇక మీదట దీన్ దయాళ్ ఈ-రిక్షాగా మార్చనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీన్‌దయాళ్ ఈ-రిక్షా పథకం కింద రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ-రిక్షావాలాల సమస్యల గురించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడానని గడ్కరీ తెలిపారు. ఈ వాహనాల యజమానులకు మూడు శాతం వడ్డీరేటుతో బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఆర్థిక మంత్రికి కూడా లేఖరాసినట్లు ఆయన చెప్పారు. ఈ-రిక్షాల్లో నలుగురిని మాత్రమే కూర్చోబెట్టుకోవాలని ఆయన సూచించారు. డ్రైవర్లు ఎనిమిది మందిని కూర్చోబెట్టుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన చెప్పారు. నలుగురు  ప్రయాణీకులతోపాటు 25 -50 కిలోల బరువున్న సామాన్లను తీసుకెళ్లవచ్చని గడ్కరీ వివరించారు.
 
 మంత్రి ప్రకటనను వ్యతిరేకిస్తున్న నిపుణులు
 ఈ-రిక్షాల సమస్యను రాజకీయం చేయవద్దంటూనే వాటికి వరాలు కురిపిస్తూ గడ్కరీ చేసిన ప్రకటనపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ-రిక్షాలపై నిసేధం విధించబోమని హామీ ఇవ్వడంపై రోడ్డు రవాణా నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిపై నియంత్రణ లేకపోవడం ఢిల్లీరోడ్లపై అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆక్షేపిస్తున్నారు. నగరంలో 25 వేల ఈ-రిక్షాలున్నాయని అంచనా. లెసైన్సులు, రిజిస్ట్రేషన్లు, నంబరు ప్లేట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల వంటివి లేకుండా రోడ్లపై తిరుగుతోన్న ఈ-రిక్షాలపై నిషేధం విధించాలని గత సెప్టెంబర్‌లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. కోర్టు జోక్యంతో ఢిల్లీ సర్కారు ఈ-రిక్షాల వ్యవహారాన్ని కేంద్ర ఉపరితల రవాణా మంతిత్వశాఖకు పంపింది. దీంతో కేంద్రం మోటారు వాహనాల చ ట్టాన్ని సవరించింది. అనుమతిలేకుండా ఈ-రిక్షాలు నడపడం చట్టవిరుధ్ధమని పేర్కొంటూ ఏప్రిల్ 24 నోటిఫికేషన్ జారీ చేశారు.
 
 రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు ముగియడంతో గత వారం రోజులుగా రవాణా విభాగం, ట్రాఫిక్ పోలీసులు ఈ-రిక్షాలపై కొరడా ఝుళిపించడం ప్రారంభించారు. దీంతో ఈ-రిక్షావాలాలు నిరసనకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ ఈ రిక్షావాలాలకు మద్దతుగా నిలిచి వారిపై చర్యలు తీసుకోవద్దని ఎల్జీని సోమవారం కోరారు. ఢిల్లీవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది ఈ-రిక్షాలను నడుపుతున్నారు. వీటిని నిషేధిస్తే లక్షలాది మంది జీవనోపాధి కోల్పోతారని కే జ్రీవాల్ విలేకరులతో అన్నారు. ఈ-రిక్షాల నోటి ఫికేషన్ల వ్యవహారం కోర్టు పరిశీలనలో ఉన్నందున తీర్పు వెలువడేంత వరకు ఈ-రిక్షాలపై చలాన్లు విధించ కూడదని, జప్తు చేయకూడదని తాము ఎల్జీని కోరామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement