పది రోజుల్లో ఈ- రిక్షాలు
ఈ రిక్షాలకు మళ్లీ మంచిరోజులు రానున్నాయి.. వాటిని రోడ్లమీదకు అనుమతించేందుకు అవసరమైన విధి విధానాల రూపకల్పనలో కేంద్రం బిజీగా ఉంది... అన్నీ సక్రమంగా జరిగితే మరో పదిరోజుల్లో ఢిల్లీ రోడ్లపై ఈ రిక్షాల సంచారాన్ని చూడవచ్చు...
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ రోడ్లపై ఈ రిక్షాలు మళ్ల్లీ దర్శనమివ్వనున్నాయి. రానున్న పది రోజులలో ఈ రిక్షాలపై నోటిఫికేషన్ జారీ చేసి వాటిని రోడ్లపైకి తెస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఎన్‌డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తిచేసిన సందర్భంగా వంద రోజుల్లో తన మంత్రిత్వశాఖ విజయాలను తెలియచేయడం కోసం సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నితిన్ గడ్కరీ ఈ విషయం చెప్పారు. ఈ రిక్షాల కోసం కొత్త నియమనిబంధనలను రూపొందించినట్లు ఆయన చెప్పారు. పది రోజులలో ప్రక్రియను పూర్తి చే సి నోటిఫికేషన్ జారీ చేస్తారని ఆయన చెప్పారు. కాగా, ఈ రిక్షాలకు సంబంధించిన నియమ నిబంధనలు రవాణా మంత్రిత్వశాఖ రూపొందిస్తోందని మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో పది రోజులు పడుతుందని అంటున్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఈ రిక్షాలు మళ్లీ రోడ్ల పైకి వస్తాయని అంటున్నారు.
ఇదిలా ఉండగా, జాతీయ రాజధానిలో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయని ఆరోపిస్తూ గత జూలై 31వ తేదీన ఈ రిక్షాలు రోడ్లపై సంచరించడాన్ని హై కోర్టు నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్లపై ఈ రిక్షాల సంచారం వల్ల ఏర్పడుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనలను తయారుచేస్తున్నామన్నారు. వాటికి చట్టపరమైన రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఈ రిక్షాలను నిషేధించడం వల్ల వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సమస్యను సత్వరమే పరిష్కరించడానికి కృషిచేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, ఈ రిక్షాల సంచారంపై త్వరలోనే స్పష్టమైన నియమ నిబంధనలను రూపొందిస్తామని, అంతవరకు వాటిని రోడ్లపై తిరగడానికి అనుమతించాలని ఈ నెల 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. అయితే విధివిధానాల రూపకల్పన తర్వాతే వాటిని రోడ్లపైకి అనుమతిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, ఈ రిక్షాలను నగర రోడ్లపై అనుమతించడానికి ఎటువంటి విధివిధానాలను రూపొందించాలనేది కేంద్ర ప్రభుత్వం విచక్షణకే వదిలేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
17న ఈ రిక్షా చోదకుల ‘జైల్ భరో’
ఇదిలా ఉండగా, ఈ రిక్షాలపై నిషేధం తొలగించనట్లయితే ఈ నెల 17న జైల్ భరో ఆందోళన చేపడ్తామని ఈ రిక్షా చోదకులు హెచ్చరించారు. సెప్టెంబర్ 16 వరకు ఈ రిక్షాలపై తన వైఖరి తెలియచేయాలని ఈ రిక్షా యజమానుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేనట్లయితే సెప్టెంబర 17న జైల్ భరో ఆందోళన చేపడ్తామని హెచ్చరించింది. ఈ రిక్షాలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ తాము పలుమార్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టలేదని ఈ రిక్షా చోదకులు అంటున్నారు.