చార్మినార్ వద్ద బందోబస్తు ఏర్పాట్లపై చర్చిస్తున్న కమిషనర్ మహేందర్ రెడ్డి
యాకుత్‌పురా: బక్రీద్, నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అదనపు కమిషనర్ శ్రీనివాస్ రావు, జాయింట్ కమిషనర్లు ప్రమోద్ కుమార్, శివ ప్రసాద్, డీసీపీ, అదనపు డీసీపీలతో కలిసి పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చార్మినార్‌లో విలేకరులతో మాట్లాడుతూ..బక్రీద్, గణేష్ నిమజ్జనోత్సవాలను దృష్టిలో ఉంచుకుని 9 జిల్లాలకు చెందిన పోలీసు బలగాలను బందోబస్తుకు వినియోగిస్తున్నామన్నారు. కేంద్ర పారా మిలటరీ బలగాలతో పాటు సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.
బక్రీద్ సందర్భంగా నగరంలోని మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. సోషల్ మీడియాల్లో వచ్చే తప్పుడు సమాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. బక్రీద్ సందర్భంగా వ్యర్ధాలను పొగు చేసేందుకు మైనార్టీ, జీహెచ్‌ఎంసీ శాఖల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్లను పంపిణీ చేశామన్నారు. ప్రార్థనలు నిర్వహించే ఈద్గాల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 15వ తేదీన గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 వేల విగ్రహాలు నిమజ్జనానికి రానున్నట్లు తెలిపారు. 15న అర్ధరాత్రి 12 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేయాలని సూచించారు. తాము సూచించిన విధంగా ఉదయం 6 గంటలకు నిమజ్జనాన్ని ప్రారంభించి 12 గంటల్లోపు పూర్తి చేయాలన్నారు. 12 గంటల తర్వాత వచ్చే విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పైకి కాకుండా నెక్లెస్ రోడ్డు వైపు పంపిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.